Begin typing your search above and press return to search.

దేశంలో తవ్వేకొద్దీ దొరుకుతోన్న పేలుడు పదార్థాలు!.. తాజాగా షాకింగ్ ప్లేస్ లో..!

ఈ క్రమంలో... ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ పిల్లలు ఆడుకుంటుండగా సమీపంలోని పొదల్లో అనుమానాస్పద వస్తువును గమనించారని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ పోలీసులకు సమాచారం అందించారు.

By:  Raja Ch   |   23 Nov 2025 11:32 AM IST
దేశంలో తవ్వేకొద్దీ దొరుకుతోన్న  పేలుడు పదార్థాలు!.. తాజాగా షాకింగ్  ప్లేస్  లో..!
X

దేశంలో దర్యాప్తు సంస్థలు, పోలీసులకు ఇటీవల వరుసగా పేలుడు పదార్ధాలు లభ్యమవుతున్న ఘటనలు షాకింగ్ గా మారుతున్నాయి! దేశంలో అంతర్లీనంగా ఇంత జరుగుతుందా అనే ప్రశ్నలు తదనుగుణంగా తెరపైకి వస్తోన్నాయి. దీంతో.. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు! ఈ క్రమంలో ఓ ప్రభుత్వ పాఠశాల సమీపంలో జెలెటిన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

అవును... ఇటీవల ఎర్రకోట పేలుడు, ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్శిటీ సమీపంలో సుమారు 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమైన సంగతి తెలిసిందే. మరోవైపు.. దేశంలోకి అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న భారీ స్మగ్లింగ్ రాకెట్ ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు.

ఇందులో భాగంగా మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ టర్కీ తుపాకులు భారత్ సరిహద్దు రాష్ట్రాల్లోకి పాకిస్థాన్ నుంచి డ్రోన్ల సహాయంతో ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో తాజాగా ఉత్తరాఖండ్ పోలీసులు అల్మోరాలోని ఒక ప్రభుత్వ పాఠశాల సమీపంలో 161 శక్తివంతమైన పేలుడు పదార్థమైన జెలెటిన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలో... ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ పిల్లలు ఆడుకుంటుండగా సమీపంలోని పొదల్లో అనుమానాస్పద వస్తువును గమనించారని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకొన్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సెర్చ్ చేసి.. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన అల్మోరా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్.ఎస్.పీ) దేవేంద్ర పించా... ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో తగిన సెక్షన్స్ కింద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశామని.. తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

కాగా... ఈ నెల 10న ఢిల్లీ పోలీసులు ఫరిదాబాద్ లోని ఉగ్ర మాడ్యూల్ కు సంబంధించిన పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొంతమంది వైద్యులను అరెస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత.. కశ్మీరీ వైద్యుడు ఉమర్ నబీ నడుపుతున్న పేలుడు పదార్థాలతో నిండిన కారు ఎర్రకోట సమీపంలో పేలిపోయింది.

ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు. దర్యాప్తులో ఇది ఉగ్రదాడి అని తేలింది. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ క్రమంలో అనేకమంది వైద్యులను, వైద్య విద్యార్థులను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకోని విచారిస్తోన్నాయి!