లగేజీల కుప్పలు.. ‘ఇండిగో’తో ఇన్ని తిప్పలు
ఢిల్లీ ఇండిగో విమానయాన సంస్థ కార్యకలాపాల సంక్షోభం పతాకస్థాయికి చేరింది. దీని కారణంగా వేలాది మంది ప్రయాణికులు నరకం చూస్తున్నారు.
By: A.N.Kumar | 6 Dec 2025 3:05 PM ISTఏ ఎయిర్ పోర్టుచూసినా ఇప్పుడు ‘ఇండిగో’ బాధితులే.. ఎక్కడ చూసినా వాళ్ల అరుపులే. ప్రత్యామ్మాయ విమానాలు చూపాలంటూ గొడవలు, అయినా ఒక్కరోజులో తీరే సమస్య ఇది కాదంటూ ఇండిగో వివరణలు.. వెరిసి ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికుల సూటు కేసులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండిగో నిర్వాకానికి ఈ చిత్రాలే నిదర్శనం అంటూ దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి నెలకొంది.
ఢిల్లీ ఇండిగో విమానయాన సంస్థ కార్యకలాపాల సంక్షోభం పతాకస్థాయికి చేరింది. దీని కారణంగా వేలాది మంది ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఎయిర్ పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. గురువారం ఒక్కరోజే ఢిల్లీలో 163 డొమెస్టిక్ ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. 101 బయలు దేరే విమానాల్లో ఏకంగా 98 ఆలస్యమయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో దాదాపు 16,500 మంది కుప్పలుగా పడి ఉన్న తమ బ్యాగులతో ఢిల్లీ ఎయిర్ పోర్టులో వేచి ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండిగో వ్యవహారాన్ని కళ్లకు కడుతున్నాయి.
ఇండిగో విమానాలు భారీగా రద్దయ్యాయి. ఒక్కో విమానం సగటున 160 నిమిషాలు ఆలస్యమైంది. సిబ్బంది సంబంధిత సమస్యల కారణంగా ఇండిగో సంస్థ 77 వచ్చే విమానాలు, 86 బయలుదేరే విమానాలు అన్నింటిని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విమానాల ఆలస్యాలు, రద్దులతో పాటు ఎయిర్ పోర్టుల్లో ఇప్పుడు ‘లగేజీ సమస్య’ తీవ్రమైంది. ఎవరి లగేజ్ ఎక్కడుంది? ఎవరిది ఎవరు తీసుకెళుతున్నారో తెలియక లగేజీ కనిపించకపోవడం సమస్యను మరింత జఠిలం చేస్తోంది. మూడు నుంచి నాలుగు రోజుల క్రితం చెక్ ఇన్ చేసిన లగేజీ కూడా ఇంకా తిరిగి రాక కుప్పలుగా పేరుకుపోయిన లగేజీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా ప్రయాణంలో లగేజీలే కీలకం. ఇందులో ముఖ్యమైన పత్రాలు, మందులు, విలువైన వస్తువులు ఉన్న లగేజీ గురించి సమాచారం కోసం ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇండిగో టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆందోళన చేశారు. టెర్మినల్స్ 2, 3లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. చాలా మంది వేరే విమాన టికెట్లను, లేదా హోటల్ గదుల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా వేరే విమానయాన సంస్థలు ధరలను కూడా భారీగాపెంచడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ధరల స్థిరీకరణ చేపట్టింది.
ముఖ్యంగా కుటుంబ అత్యవసర పరిస్థితులు, మీటింగ్ లు, ఇతర ముఖ్యమైన పనుల కోసం ప్రయాణించేవారికి ఈ ఆలస్యాలు కష్టాలను తెచ్చిపెట్టాయి. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో ఇండిగో విమానాల రద్దుతో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.
