ఢిల్లీ తల్లఢిల్లీ : పీక్స్ కి చేరింది
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరాలలో చిక్కుకుంది. ప్రమాదకరమైన పరిస్థితులతో తల్లఢిల్లుతోంది.
By: Satya P | 21 Oct 2025 12:55 PM ISTదేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరాలలో చిక్కుకుంది. ప్రమాదకరమైన పరిస్థితులతో తల్లఢిల్లుతోంది. వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దాంతో పట్ట పగలు చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఇళ్ళలో నుంచి ఎవరూ బయటకు రావద్దు అని అధికారులు సూచిస్తున్నారు బయటకు వచ్చే వాహనాలు పగలే లైట్లు వేసుకుని మరీ ముందుకు సాగాల్సి వస్తోంది. ఇక ఇంట్లో ఉన్నా కూడా వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలను తోడేస్తోంది. కళ్ళు మంటతో పాటు, గొంతులో దగ్గు, ఒంటికి దద్దుర్లు ఇలా చాలానే బాధలు ప్రజలు పడుతున్నారు.
రెడ్ జోన్ లోకి :
ఢిల్లీ ఇపుడు రెడ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. దీపావళి వేళ పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చడంతో ఢిల్లీ గాలి అంతా కాలుష్యం అయిపోయింది చాలా పూర్ గా గాలి నాణ్యత ఉందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర కాలుష్య మండలి వేసిన అంచనానే తీసుకుంటే సోమవారం రాత్రి పది గంటలకే ఢిల్లీలో సగటు గాలి నాణ్యతా సూచీ ఏకంగా 344 కి ఎగబాకింది. ఢిల్లీలోని మరో నాలుగు ప్రాంతాలు చూస్తే ఏకంగా 400 పైగానే దాటాయి. ఇక ద్వారకలో 417, ఆనంద్ విహార్ లో 403, ఉంటే అశోక్ విహార్ లో 404, వజీర్ పూర్ లో 423 ఉంది. ఇవన్నీ అత్య్హంత తీవ్రమైన కాలుష్యాన్ని సూచిస్తున్నాయని కేంద్ర కాలుష్య మండలి పేర్కొంది. ఢిల్లీలో మొత్తం 38 ప్రాంతాలు ఉంటే అందులో 36 ప్రాంతాలు పూర్తిగా రెడ్ జోన్ లోకి వెళ్ళిపోవడం చూస్తే హస్తిన ఎంత ముప్పుని ఎదుర్కొంటోంది అన్నది చూడాల్సిందే.
ఆదేశాలు బేఖాతరు :
దేశ రాజధానిలో వాయు కాలుష్యం అధికంగా ఉందని భావించి సుప్రీం కోర్టు గ్రీన్ కాకర్స్ మాత్రమే కాల్చాలని ఆదేశించింది. అంతే కాదు రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వ్యవధి మధ్యలోనే కాల్చాలని సూచించింది. అయ్యుఇతె ఢిల్లీలో సాయంత్రం నుంచి మొదలైన బాణా సంచా కాల్పులు కాస్తా అర్ధ రాత్రి దాటినా ఆగలేదు. దాంతో సోమవారం రాత్రికే ప్రమాదకర సూచీలను వాయు కాలుష్యం దాటేసింది. దీంతో మంగళవారం తెల్లారుతూనే గాలి కాలుష్యం సూచీలు ఇంకా ఎత్తుకు ఎగబాకాయి. దీంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు.
మాస్క్ తప్పనిసరి :
అవసరం అయితేనే బయటకు జనాలు రావాలని అలా వచ్చే వారు కూడా మాస్క్ ధరించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ఒక వైపు చలి పెరిగింది. దాని వల్ల ఢిల్లీలో ప్రతీ ఏటా వాయు కాలుష్యం అధికం అవుతుంది. అలాగే యూపీ హర్యానా పంజాబ్ వంటి చోట్ల నుంచి వ్యర్థాల కాల్చడంతో కూడా పెద్ద ఎత్తున కాలుష్యం చేరి గాలిలో కలిసిపోతుంది. ఇలా ప్రతీ ఏటా ఉన్నదే. అలాగే దీపావళి కూడా ఈ కాలుష్యాన్ని పెంచుతోంది. దీంతో అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ప్రజలు ఉత్సాహం దీపావళి పండుగ చేసుకోవాలన్న కోరిక అన్నీ కలసి కాలుష్యాన్ని ఒక్కసారిగా పెంచేశాయి. దాంతో ఢిల్లీ ఇపుడు నానా బాధ పడుతోంది. ఊపిరి పీల్చుకోవడానికి పెద్ద వారు వృద్ధులు బాధలు పడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే మరో ఇరవై శాతం గాలి నాణ్యత దిగజారింది, కాలుష్యం పెరిగింది అని లెక్కలు చెబుతున్నాయి. ప్రజలలో చైతన్యమే వాయు కాలుష్యం నివారణకు మార్గమని అంటున్నారు.
