వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్.. ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
వెనెజువెలాలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్స్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది.
By: A.N.Kumar | 4 Jan 2026 2:50 PM ISTవెనెజువెలాలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్స్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. నికొలస్ మదురో అరెస్ట్ తర్వాత దేశ పగ్గాలు చేపట్టిన ఆమె నేపథ్యం.. రాజకీయ ప్రస్థానం.. ఆమె ముందున్న సవాళ్లు అధికంగా ఉన్నాయి.
కుటుంబ నేపథ్యం.. రాజకీయ అడుగులు
వెనెజువెలా రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన మహిళగా ఎదిగిన డెల్సీ రోడ్రిగ్స్, ఇప్పుడు ఆ దేశ సంక్షోభ సమయంలో కీలక బాధ్యతను భుజానికెత్తుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమితులైన ఆమె రాజకీయ ప్రయాణం ఆసక్తికరం. డెల్సీ రోడ్రిగ్స్ 1969లో కారకాస్‌లో జన్మించారు. ఆమె తండ్రి జోర్జ్ ఆంటోనియో రోడ్రిగ్స్ వెనెజువెలాలోని 'సోషలిస్ట్ లీగ్' వ్యవస్థాపకుడు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న డెల్సీ చిన్నప్పటి నుంచే వామపక్ష భావజాలంతో పెరిగారు. ఆమె సోదరుడు జోర్జ్ రోడ్రిగ్స్ కూడా వెనెజువెలా ప్రభుత్వంలో కీలక నేతగా కొనసాగుతున్నారు.
మదురో ప్రభుత్వంలో నమ్మకస్తురాలు..
నికొలస్ మదురో అధికారంలో వచ్చినప్పటి నుండి డెల్సీ ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆమె ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించారు. అంతర్జాతీయ వేదికలపై వెనెజువెలా వాణిని బలంగా వినిపించారు. 2018 నుంచి దేశ రెండో అత్యున్నత పదవిలో కొనసాగుతూ పాలనపై పట్టు సాధించారు. దేశ ఆర్థిక మూలస్తంభమైన చమురు రంగాన్ని పర్యవేక్షించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఆర్థిక సంక్షోభం.. వ్యూహకర్తగా డెల్సీ
వెనెజువెలా చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు డెల్సీ వినూత్న ప్రయత్నాలు చేశారు. అమెరికా ఆంక్షల మధ్య రష్యా, చైనాలతో సంబంధాలను బలపరిచారు. దేశీయంగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి పడిపోతున్న కరెన్సీ విలువను కాపాడే ప్రయత్నం చేశారు.
అంతర్జాతీయ మద్దతు.. అమెరికా వైఖరి
సాధారణంగా అమెరికా, వెనెజువెలా మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె పట్ల సానుకూలత వ్యక్తం చేయడం గమనార్హం. "వెనెజువెలాను మళ్ళీ గొప్పగా మార్చే క్రమంలో డెల్సీ సహకరిస్తారు" అని ట్రంప్ వ్యాఖ్యానించడం.. అంతర్జాతీయంగా కొత్త దౌత్య మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.
తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన డెల్సీకి పూలపాన్పు ఎదురుకావడం లేదు. ఆమె ముందు ప్రధానంగా పెద్ద సవాళ్లు ఉన్నాయి.. కుప్పకూలిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిర్మించడం.. ఆకలి చావులను అరికట్టడం అంత ఈజీ కాదు.. రాజకీయ స్థిరత్వం కోసం మదురో వర్గానికి.. ప్రతిపక్షాలకు మధ్య సమన్వయం సాధించడం అవసరం. ఆంక్షలను తొలగించుకుని, ప్రపంచ దేశాలతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడం ఎంతో కీలకం.
డెల్సీ రోడ్రిగ్స్ కేవలం ఒక రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు.. తీవ్ర సంక్షోభంలో ఉన్న దేశానికి ఆశాదీపం లాంటి వారు. మదురో శకం ముగిసిన తర్వాత ఆమె వెనెజువెలాను ప్రజాస్వామ్య , ఆర్థిక స్థిరత్వం వైపు నడిపిస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
