Begin typing your search above and press return to search.

నితీశ్ మంత్రివర్గంలో సర్ ప్రైజ్ మంత్రి.. జీన్స్ ఫ్యాంట్ తో ప్రమాణస్వీకారం

ఇంతకూ ఈ కుర్రాడు ఎవరు? అతడికి మంత్రి పదవి ఎలా దక్కిందన్న విషయంలోకి వెళితే.. తెర వెనుక ఎన్నో లెక్కల అనంతరం ఇలాంటి సీన్ కు కారణమైందని చెప్పాలి.

By:  Garuda Media   |   22 Nov 2025 9:30 AM IST
నితీశ్ మంత్రివర్గంలో సర్ ప్రైజ్ మంత్రి.. జీన్స్ ఫ్యాంట్ తో ప్రమాణస్వీకారం
X

రాజకీయ కుటుంబమే కానీ.. రాజకీయాలకు దూరంగా... ఆ మాటకు వస్తే దేశం కాని దేశంలో ఉంటూ తన ప్రపంచంలో తాను బతికేస్తుండే హీరో.. హటాత్తుగా మంత్రి కావటం.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం లాంటి సీన్లు సినిమాల్లో చూస్తుంటాం. సరిగ్గా ఇదే తరహాలో ఒక సీన్ ను రియల్ లైఫ్ లో బిహార్ లో కొలువు తీరిన నితీశ్ సర్కారు చూపించేసింది. రియాల్టీ షోల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేరుతో ఊహించని రీతిలో కొందరిని ఎంట్రీ ఇస్తుంటారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన సర్కారులో ఒక కుర్రాడికి మంత్రి పదవిని అప్పజెప్పటం ఆసక్తికరంగానే కాదు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెర తీశారు.

బిహార్ లో నితీశ్ సర్కారు కొలువు తీరిన వేళ.. ఎవరూ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు ఆ రాష్ట్ర సీఎం. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ కాదు.. ఆ మాటకు వస్తే రాజకీయాలకు దూరంగా ఉంటూ.. విదేశాల్లో ఉండే ఒక యువకుడ్ని చివరి నిమిషంలో మంత్రి పదవిని కట్టబెట్టారు. మంత్రిగా ప్రమాణం చేసే ఆ కుర్రాడికి కూడా తాను కొద్ది నిమిషాల్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానన్నవిషయం తెలీదేమో.. అందుకే ఫార్మల్ షర్ట్.. జీన్స్ ఫ్యాంట్ ధరించి బిహార్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దీపక్ ప్రకాశ్.

ఇంతకూ ఈ కుర్రాడు ఎవరు? అతడికి మంత్రి పదవి ఎలా దక్కిందన్న విషయంలోకి వెళితే.. తెర వెనుక ఎన్నో లెక్కల అనంతరం ఇలాంటి సీన్ కు కారణమైందని చెప్పాలి. రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కొడుకే ఈ దీపక్ ప్రకాశ్. 36 ఏళ్ల వయసున్న దీపక్ విదేశాల్లో బీటెక్ పూర్తి చేశాడు. ఇప్పటివరకు క్రియాశీలక రాజకీయాల్లో లేరు. తన తల్లి ఎన్నికల బరిలో ఉన్న వేళలో.. తల్లి తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా దీపక్ భార్య సాక్షి మిశ్రా కూడా అత్తగారి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.

విదేశాల్లో చదువుకుని వచ్చిన ఆ కుర్రాడికి అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది. నిబంధనల ప్రకారం ఆర్నెల్ల వ్యవధిలో అతను ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఆయన తండ్రికి చెందిన ఆర్ఎల్ఎం పార్టీ తరఫు ఎమ్మెల్సీని చేస్తారని చెబుతున్నారు. 2019 నుంచి తల్లిదండ్రులకు రాజకీయాల్లో సాయంగా ఉండే దీపక్ తాజాగా మంత్రి పదవిని సొంతం చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది.

ఎన్టీయే కూటమిలో భాగస్వామి అయినా ఆర్ఎల్ఎం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ స్థానాల్ని గెలుపొందింది. రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడైన ఉపేంద్ర కుష్వాహా సతీమణి స్నేహలత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ ఆశించారు. అయితే.. తన కొడుకును రాజకీయాల్లోకి అరంగ్రేటం చేయించటానికి ఇదే సరైన సమయంగా భావించిన ఆయన సేఫ్ గేమ్ ఆడటమే కాదు.. అమిత్ షా.. నితీశ్ లకు ఇష్టం లేకున్నా.. వారిని భావోద్వేగానికి గురి చేసి.. తాను అనుకున్నది సాధించినట్లుగా తెలుస్తోంది.

మంత్రి పదవి తనకు దక్కనున్న విషయం చివరి నిమిషం వరకు తనకు కూడా దక్కదని దీపక్ చెప్పటం చూస్తే.. చివరి క్షణం వరకు ఉపేంద్ర కుష్వాహా చేసిన ప్రయత్నాలు ఇట్టే అర్థమవుతాయి. తనకు తెలిసినంతవరకు తన తండ్రి.. పార్టీ ముఖ్యనేతల మధ్య జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. రియాలిటీ షోల మాదిరి అనూహ్య రీతిలో పొలిటికల్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మంత్రి పదవిని సొంతం చేసుకున్న వాడిగా దీపక్ నిలుస్తారని చెప్పక తప్పదు. కేబినెట్ లో వారసులకు చోటు కల్పించటంపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెడుతున్నాయి.