సంక్రాంతికి తెలుగోళ్లకు ప్రకృతి షాక్ ఇవ్వనుందా?
కొత్త సంవత్సరం రావటం.. చూస్తుండగానే మొదటి వారం పూర్తై.. ముంగిట్లోకి సంక్రాంతి వచ్చేస్తోంది. ఇలాంటి వేళ.. వాతావరణ శాఖ షాకింగ్ అంశాన్ని వెల్లడించింది.
By: Garuda Media | 8 Jan 2026 1:28 PM ISTతెలంగాణ వారికి దసరా.. ఏపీ వారికి సంక్రాంతి పెద్ద పండగలన్న విషయం తెలిసిందే. అయితే.. గడిచిన కొద్దికాలంగా దసరాను ఏపీ వారు.. సంక్రాంతిని తెలంగాణ వారు ఘనంగా జరుపుకోవటం ఎక్కువ అవుతోంది. గతంలో ఈ రెండు పండగల సందర్భంగా విభజన రేఖ ఉండేది. ఇప్పుడు అందులో ఒక మార్పు వచ్చింది. దసరాకు ఏపీ నుంచి తెలంగాణకు.. సంక్రాంతికి తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే తీరు ఎక్కువైంది. దీంతో.. రెండు పండుగులు రెండు రాష్ట్రాల్లోని తెలుగు వారు ఘనంగా చేసుకోవటం మొదలైంది.
కొత్త సంవత్సరం రావటం.. చూస్తుండగానే మొదటి వారం పూర్తై.. ముంగిట్లోకి సంక్రాంతి వచ్చేస్తోంది. ఇలాంటి వేళ.. వాతావరణ శాఖ షాకింగ్ అంశాన్ని వెల్లడించింది. సంక్రాంతి వేళ.. వాయు గుండం గండం పొంచి ఉందని చెబుతున్నారు. ఒకవేళ.. పరిస్థితులు మారితే అది కాస్తా తుపానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. ఏడాది మొత్తం సంక్రాంతి కోసం వెయిట్ చేసే వారందరికి భారీ షాక్ గా చెప్పక తప్పదు. నిజానికి సంక్రాంతిని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళనాడులోనూ ఘనంగా నిర్వహిస్తారన్నది తెలిసిందే.
తాజాగా మారిన వాతావరణ పరిస్థితులతో ఆగ్నేయ బంగాళాఖాతంలో భూమధ్యరేఖ సమీపంలో తీవ్ర అల్పపీడనాన్ని బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడిన విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం సాయంత్రానికి శ్రీలంకలోని పొట్టువిల్ కు 570కి.మీ. దూరంలోనూ.. చెన్నైకు 1140కి.మీ. దూరంలో కేంద్రీక్రతమైనట్లుగా పేర్కొన్నారు.
వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందని అంచనా వేస్తున్న ఈ వాయుగుండం కారణంగా శుక్ర.. శని.. ఆదివారాల్లో శ్రీలంక, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాల్లో ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని భావిస్తున్నారు. అదే జరిగితే.. ఈసారి సంక్రాంతికి షాక్ తప్పదనే చెప్పాలి. ఈ వాయుగుండం తుపానుగా మారి.. ఎక్కడ తీరం దాటుతుందన్నది కూడా కీలకమవుతుంది. ఈ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలకు షాక్ తప్పదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.
