మరణం ఎంత అందమైనదో కదా !
మనిషి మరణం ఈ రెండూ దోబూచులాడుతూనే ఉంటాయి. నీడలా వెంటనే ఉంటుంది మరణం.
By: Satya P | 22 Feb 2026 11:00 PM ISTమనిషి మరణం ఈ రెండూ దోబూచులాడుతూనే ఉంటాయి. నీడలా వెంటనే ఉంటుంది మరణం. అది ఎపుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. జీవితాన్ని ఎంతగా ప్రేమించిన వారు అయినా అంతే తీవ్రంగా మరణం గురించి ఆలోచిస్తారు. చిత్రమేంటంటే జీవితానికి మరణానికి ఆకాశానికి పాతాళానికి మధ్య ఉన్నంత తేడా ఉంది. పైగా రెండూ బద్ధ శతృవులు. ఒకరు ఉనికిని మరొకరు నాశనం చేయాలనుకుంటాయి. అందుకే మనసు కవి ఆత్రేయ ఒక మాట అంటాడు. నాకు చావుకూ అసలు పడదు, బద్ధ విరోధం ఉంది. అందుకే నేనున్న చోటకు అది రాదు అది వచ్చిన నాడు నేను ఉండను అని. ఎంతో కవితాత్మకంగా ఆత్రేయ ఈ మాట చెప్పినా దీని వెనక అసలైన సత్యం ఉంది. మరణం వచ్చిన నాడు జీవితం ఉండదు కదా.
జీవితాన్నే కబలిస్తూ :
మరణం మనిషి జీవితాన్ని కబలిస్తుంది. ఇలా చెప్పుకుంటే ఎంతో బాధ ఉంటుంది. కానీ దీనినే వేరే విధంగా చెబితే మరణం అందం అర్ధం తెలుస్తాయి. మరణాన్ని ఒక్కసారి కలుసుకుంటే చాలు ఇక జీవితాన్నే అంతా మరచిపోతారు అని చెబితే కనుక మరణం అంత గొప్పదా అనిపించక మానదు. ఇక ఎవరూ కూడా జీవించి ఉండగా మరణాని చూడలేరు. ఒక్కసారి దానిని చూసిన వారు తిరిగి జీవించలేరు. అంటే మరణం అంత ప్రియతమమైనదిగా వారికి ఉన్నట్లే కదా. ఇదే మాటల ట్విస్ట్ అనుకున్నా మరొకటి అనుకున్నా మరణం లాంటి బరువైన దాన్ని లైట్ చేసి చెప్పడంగా కూడా అనుకోవచ్చు. లేదా వైరాగ్యాన్ని కూడా సాదాసీదాగా తీసుకునేలా చేయడమూ కావచ్చు.
వద్దు అనుకున్నా :
ఇక మనిషి తాను ఎపుడూ అబద్ధాలు ఆడనని సత్య సంధుడిని అని అంటూంటాడు. కానీ మనిషి బతికేదే నిజానికి అబద్ధంలో. మరణం ఉందని తెలుసు. అది ఎపుడు వస్తుందో కూడా తెలియదు అని తెలుసు. ఇన్ని తెలిసినా ఏమీ లేనట్లు తనకేమీ కానట్లు ఈ జీవితం అంతా శాశ్వతం అయినట్లు మనిషి బతికే బతుకు అంతా అబద్ధం కాక మరేమిటి అంటారు వేదాంతులు. వద్దు అనుకున్నా మరణానికి సంబంధించిన భయాలు సంశయాలు సందేహాలు, ఎన్నో విషయాలు ప్రతీ వారి మెదడుని దొలిచేస్తూనే ఉంటాయి.
ఉనికిని చాటుకుంటూ :
మరణం తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. నిత్యం ఒళ్ళు విరుచుకుంటూనే ఉంటుంది, నీ పక్క వాడిని తోటి వాడిని సాటి వాడిని బంధువుని, రక్త సంబంధీకుడిని, మిత్రుడిని శత్రువుని, ప్రేమించే వారిని ద్వేషించేవారిని కేవలం మనిషినే కాదు ఇష్టపడి పెంచుకునే కుక్కను పెరట్లో ఆవుని గొర్రెను బర్రెను ఇలా అన్నింటి మీద తన ఇనుప పదాలను గట్టిగా అదిమి పెడుతూ ఊపిరి తీస్తుంది. అలా తన భయంకరమైన శబ్దాన్ని చెవులు సోకేలా వినిపిస్తూనే ఉంటుంది. పక్కకు వచ్చినా ఎదురుగా వచ్చినా లేక అక్కడా ఇక్కడా కనిపించినా మరణం తన మీదకు రాదు అన్నది ప్రతీ వాడి నమ్మకం. ఒకవేళ వచ్చాక అపుడు చూసుకోవచ్చు అన్న మొండి ధైర్యం. ఎంతో మంది అంతు చూసిన మరణం తన వద్దకు వచ్చేసరికి ఓడిపోయి వాడిపోయి పారిపోతుందని ఏంటో వెర్రి నమ్మకం. ఆ నమ్మకమే మనిషిని నిరంతరం ఆయుష్షుని పెంచుతూ జీవితాన్ని కూడా కొనసాగించేలా చేస్తోంది. మరి అలా ఆలోచిస్తే మరణం కూడా జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేస్తుంది అనే భావించాలి.
కోట్లాది ఆలోచనల్లో :
ప్రతీ మనిషి మెదడు ఒక ఆలోచనల కర్మాగారం. అయితే అందులో ప్రతీ నిముషానికి వేలాది ఆలోచనలు ఎన్నో పుట్టుకుని వస్తాయి. అలా మనిషి జీవిత కాలంలో కోటానుకోట్ల ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. ఇందులో ఎంత కాదన్నా అత్యధిక భాగం మరణం గురించే వస్తాయని అంటారు ఎందుకంటే మనిషి ఎక్కువగా దేనికి భయపడతాడో దాని గురించే ఆలోచిస్తూంటాడు. అలా తన జీవితంలో మరణం గురించి ఆలోచిస్తూ పెద్ద పీట వేస్తూనే ఉంటాడు. అలా మరణాన్ని కూడా పదే పదే తలుస్తూ దానితో తెలియకుండానే నేస్తం కడుతున్నాడు. అంటే మరణం ఒక అందమైన రాక్షసిగా అనుకోవాలా అంటే ఏమో అనుకోవచ్చు. ఇంకో విషయం చెప్పుకోవాలి. జీవితంలో ఎవరికి వారికి పర్సనల్ ఎక్స్ పీరియెన్స్ ఉన్నా వాటిని అంతా పంచుకోగలరు, కానీ మరణం ఎక్స్ పీరియన్స్ అన్నది ఎవరితోనూ పంచుకోలేరు. సో ఆ విధంగా చూసినా అరుదైన ఆ అనుభవం జీవితం పూర్తి అయ్యాకనే దక్కుతుంది. అది మంచి అయినా చెడు అయినా ఆలోచనలు మాత్రం బతికి ఉండగానే మెదడుని గూడు కట్టుకుంటాయి. ఇలా ఆలోచిస్తే మరణం అన్నది ఒక అందమైన అనుభవంగానూ అనుకోవాల్సిందేనేమో.
