ఇరాన్ చరిత్రలో అతిపెద్ద ఊచకోత.. షాకింగ్ గా కుప్పల్లోని శవాల సంఖ్య!
అవును... ఇరాన్ లో ఆందోళనలు ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా మరణాలకు దారి తీస్తుందని అంటున్నారు.
By: Raja Ch | 14 Jan 2026 10:33 AM ISTఆర్థిక సంక్షోభంతో ఇరాన్ లో మొదలైన ఆందోళనలు మారణహోమంగా మారిన సంగతి తెలిసిందే. గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య వేలల్లో ఉన్నట్లు తెలియడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఒక్కొక్కరూ ఒక్కో నెంబర్ చెబుతున్నప్పటికీ.. మృతుల సంఖ్యపై రెండు రకాల నివేదికలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... ఆందోళనల్లో భద్రతా దళాల చేతుల్లో మరణించినవారు ఒకరు కాగా.. అరెస్టైన తర్వాత మరణ శిక్ష విధిస్తుండటం వల్ల మరణించినవారు ఇంకొందరు అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... ఇరాన్ లో ఆందోళనలు ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా మరణాలకు దారి తీస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా.. ఇరాన్ లో ఇప్పటివరకూ 2,571 మంది మృతి చెందినట్లు అమెరికా కేంద్రంగా పని చేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ వెల్లడించగా.. భద్రతా దళాలు అరెస్ట్ చేసిన 18,000 మందిలోనూ దాదాపు 12,000 మందిని చంపేశారనే ప్రచారమూ తెరపైకి వస్తోంది. దీంతో... నెక్స్ట్ ఏమి జరగబోతుందనే విషయంపై ప్రధానంగా పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి!
ఇక్కడ మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే... మృతుల్లో ఈ ఆందోళనలతో సంబంధం లేని సుమారు 12 మంది చిన్నారులు కూడా ఉండటం. ఈ నేపథ్యంలో మరణల సంఖ్య మరింత పెరగొచ్చనే చర్చా బలంగా వినిపిస్తోంది. మరోవైపు ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు వరుసగా ఆరో రోజూ నిలిచిపోయిన పరిస్థితి. దీంతో కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ స్టార్ లింక్ ఉచిత సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని స్టార్ లింక్ ఇంకా ధృవీకరించలేదు!
బహిరంగ ఉరి ప్రయత్నాలు!:
ఆందోళన కారులను అణిచివేసే విషయంలో ఇరాన్ ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలకైనా వెనకాడబోయేది లేదని చెప్పకనే చెబుతోన్న పరిస్థితి. ఈ క్రమంలో.. తాజాగా ఓ నిరసనకారుడికి మరణశిక్ష అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఆందోళనల్లో పాల్గొని ఇటీవల అరెస్టైన 26 ఏళ్ల ఇర్ఫాన్ సోల్తానిని బహిరంగంగా ఉరితీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు మానవహక్కుల సంఘాలు, మీడియా కథనాలు వెల్లడించాయి. ఇలాంటి హెచ్చరికలు ఆందోళన కారుల్లో భయం కలిగిస్తుందేమోనని ఇరాన్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు!
డొనాల్డ్ ట్రంప్ సీరియస్!:
తాజా పరిణామాలపై సీబీఎస్ న్యూస్ తో మాట్లాడిన ట్రంప్... ఇరాన్ నిరసనకారులను ఉరితీయడం ప్రారంభిస్తే అమెరికా చాలా కఠినమైన చర్య తీసుకుంటుందని, వారిని ఉరితీస్తే, ఇరాన్ ప్రభుత్వం కొన్ని కొత్త విషయాలను చూడబోతున్నారని అన్నారు. అర్థరహిత హత్యలను ఆపేవరకూ ఇరాన్ అధికారులతో తాను సమావేశం కాబోనని.. ఇరాన్ అధికారులతో తాను అన్ని సమావేశాలను రద్దు చేసుకుంటున్నానని ట్రంప్ వెల్లడించారు.
1 - ట్రంప్.. 2 - నెతన్యాహు!:
మరోవైపు ట్రంప్ బెదిరింపులపై ఇరాన్ స్పందించింది. ఈ సందర్భగా రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా... ఇరాన్ పౌరుల పాలిట ప్రధాన హంతకులు ఇద్దరే ఇద్దరని చెబుతూ.. వారిలో 1 - అమెరికా అధ్యక్షుడు ట్రంప్, 2 - ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అని ఆరోపించింది.
