84 ఎన్ కౌంటర్లు.. రిటైర్మెంట్ కు 48 గంటల ముందు ప్రమోషన్.. ఎవరీ దయా..!
ఈ క్రమంలోనే 1996లో చోటా రాజన్ గ్యాంగ్ లోని ఇద్దరిని కాల్చి చంపిన వ్యవహారంలో దయా నాయక్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
By: Raja Ch | 30 July 2025 5:42 PM ISTముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ లో సీనియర్ ఇనిస్పెక్టర్ గా ఉన్న దయా నాయక్ గురించి చాలా మందికి తెలిసిందే. ఆయనను ‘ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా’ గా చాలా మంది పిలుస్తారు. ఆయన ప్లాష్ బ్యాక్ వేరే రేంజ్ లో ఉంటుందని చెబుతారు. ఈ క్రమంలో తాజాగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. అదేముంది.. కామన్ విషయమే కదా అనుకుంటే పొరపాటే! ఇక్కడ ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది!
అవును... ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఇనిస్పెక్టర్ దయా నాయక్ కు తాజాగా ప్రమోషన్ వచ్చింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది! అదేమిటంటే... ఆయన పదవీ విరమణకు 48 గంటల ముందు ఆ శాఖ పదోన్నతి కల్పించింది! ఈ రెండు రోజులు ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) గా పని చేసి, ఆ హోదాలో రిటైర్ కాబోతున్నారన్నమాట!
ఇటీవల సినీ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు విచారణ సందర్భంగా.. సైఫ్ ఇంటిని సందర్శించిన పోలీస్ అధికారుల్లో దయా నాయక్ కూడా ఉన్నారు. బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్‌మెంట్ కు వచ్చిన ఆయన కేసు ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. దీంతో.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎవరీ దయానాయక్..?:
కర్ణాటకలోని ఉడిపిలో దయా నాయక్ జన్మించారు. అక్కడే ఏడో తరగతి వరకూ చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన కుటుంబం ఉపాధి నిమిత్తం ముంబయి వెళ్లిపోయింది. దీంతో.. ఓ వైపు హోటల్ లో పనిచేస్తూనే, మరోవైపు స్థానిక మున్సిపల్ స్కూల్ లో 12వ తరగతి పూర్తి చేశారు దయా నాయక్. అనంతరం.. అంధేరిలోని కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఈ క్రమంలో తాను కలలుగన్నట్లుగానే 1995లో స్టేట్ పోలీస్ పరీక్షల్లో విజయం సాధించి.. జుహు పోలీస్ స్టేషన్ లో సబ్ ఇనిస్పెక్టర్ గా విధుల్లో చేరారు. ఆ సమయంలో ముంబైలో అండర్ వరల్డ్ రాజ్యమేలుతుందనే చెప్పాలి! విపరీతంగా దందాలు, హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో నేరాలు ఈ అండర్ వరల్డ్ పేరుమీద జరిగేవి.
ఈ క్రమంలోనే 1996లో చోటా రాజన్ గ్యాంగ్ లోని ఇద్దరిని కాల్చి చంపిన వ్యవహారంలో దయా నాయక్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అటు ప్రజల్లోను, ఇటు డిపార్ట్‌మెంట్ లోనూ "దయా నాయక్" అనే పేరు మార్మోగిపోయింది. ఈ క్రమంలోనే అండర్ వరల్డ్ నెట్ వర్క్ కు సంబంధించిన సుమారు 84 మందిని ఆయన ఎన్ కౌంటర్ చేసినట్లు చెబుతారు.
ఏసీబీ కేసులు!:
ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా అటు పోలీసులు డిపార్ట్ మెంట్ లోనూ, ఇటు ప్రజల్లోనూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న దయానాయక్.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని 2006లో అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) ఆరోపించింది. దయా నాయక్ తన తల్లి రాధా నాయక్ పేరు మీద స్వగ్రామంలో ఒక హైటెక్ పాఠశాలను నిర్మించాడని ప్రచారం జరిగింది.
పైగా.. ఆ పాఠశాల ప్రారంభోత్సవానికి బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, సునీల్ శెట్టి వంటి వారు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో... ఈ ప్రాజెక్టు కోసం ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ఆరోపణలు వచ్చాయి. సబ్ ఇనిస్పెక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. దీంతో ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.
అయితే... ఏసీబీ అతనిపై చార్జిషీట్ దాఖలు చేయలేకపోయింది. దీంతో... బెయిల్ లభించడంతో బయటకు వచ్చారు. తరువాత జరిగిన దర్యాప్తులో నాయక్ పై ఎలాంటి మోసం చేయలేదని తేలింది. అనంతరం విధుల్లోకి చేరిన దయా నాయక్.. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ లో పనిచేశారు. ఈ క్రమంలో ఎన్నో ప్రతిష్టాత్మక కేసుల్లో కీలక భూమిక పోషించారని చెబుతారు!
ఆ ముంబై క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఇనిస్పెక్టర్ మరో 48 గంటల్లో పదవీ విరమణ చేయబోతోన్న వేళ.. ఆయన ఏసీపీగా పదోన్నతి పొందారు. కాగా... దయా నాయక్ జీవిత కథ స్ఫూర్తితో హిందీతో పాటు, తెలుగులోనూ పలు సినిమాలు వచ్చాయి.
