160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?
ముంబైలో దావూద్ ఇబ్రహీం గతంలో నివసించిన 160 ఏళ్ల పురాతన భవనం కూల్చివేతకు బాంబే హైకోర్టు నవంబర్ 25 వరకు స్టే విధించింది. భెండీ బజార్‌లోని పాక్మోడియా వీధిలో ఉన్న ఈ భవనాన్ని ప్రమాదకరంగా ఉందంటూ బీఎంసీ అధికారులు కూల్చివేత ప్రారంభించారు. అయితే, ఇది వక్ఫ్ ట్రస్ట్‌కు చెందిన మతపరమైన ఆస్తి అని, చట్టపరమైన హక్కులను పరిశీలించకుండా కూల్చివేయడం సరికాదని ట్రస్ట్ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భవనాన్ని యథాతథ స్థితిలో ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది.
By: A.N.Kumar | 20 Nov 2026 12:15 PM ISTఒకప్పుడు ముంబై అండర్‌వరల్డ్‌ను శాసించిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం పేరు వింటేనే ఎన్నో సంచలన కథనాలు కళ్లముందు కదలాడతాయి. అలాంటి దావూద్‌తో ముడిపడి ఉన్న ఓ పురాతన భవనం ఇప్పుడు ముంబైలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందంటూ మున్సిపల్ అధికారులు కూల్చివేతకు సిద్ధం కాగా.. బాంబే హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. దీంతో అసలు ఆ భవనం వెనుక ఉన్న కథేంటి? కోర్టు ఎందుకు జోక్యం చేసుకుంది? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అది దక్షిణ ముంబైలోని భెండీ బజార్ ప్రాంతం.. పాక్మోడియా వీధిలో ఉన్న హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్‌ఖానా ఇప్పుడు ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. 1970వ దశకంలో దావూద్ ఇబ్రహీం తన కుటుంబంతో కలిసి ఇక్కడే నివసించాడు. 1986లో అతడు దేశం విడిచి పారిపోయిన తర్వాత 1993 ముంబై వరుస పేలుళ్ల ఘటనతో ఈ భవనానికి దావూద్ పాత ఇల్లు అనే ముద్ర పడిపోయింది.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఈ భవనంపై జరుగుతున్న న్యాయపోరాటానికి దావూద్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఉన్న 160 ఏళ్ల నాటి మతపరమైన వారసత్వం.. వక్ఫ్ ట్రస్ట్ హక్కులే ఈ వివాదానికి అసలు కారణం..
ఈ భవన నిర్మాణం 1864 నాటిది. హాజీ మియా హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ అనే దాత అక్టోబర్ 1864లో దీనిని హజ్ యాత్రికుల విశ్రాంతి గృహంగా.. మసీదు కోసం శాశ్వతంగా అంకితం చేశారు. అందుకు సాక్ష్యంగా భవనంలో అరబిక్.. పర్షియన్ భాషల్లో చెక్కిన పాలరాతి ఫలకాలు ఇప్పటికీ ఉన్నాయని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో సుమారు 148.79 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక మసీదు కూడా ఉంది. బయటి ప్రపంచానికి ఇది దావూద్ నివాసంగా తెలిసినా దీని వెనుక ఎంతో సామాజిక, మతపరమైన చరిత్ర దాగి ఉంది.
ఈ రెండు అంతస్తుల భవనం అత్యంత ప్రమాదకరంగా.. కూలిపోయే స్థితిలో ఉందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం కూల్చివేత పనులను ప్రారంభించారు. అధికారులు పనులు మొదలుపెట్టిన కొద్ది గంటల్లోనే ఈ వక్ఫ్ ట్రస్ట్‌కు చెందిన షేక్ అబ్దుల్ రజాక్, అమీరాలీ వజీరాలీ పంజ్‌వానీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మతపరమైన ఆస్తిని చట్టపరమైన హక్కులు పరిశీలించకుండా ఎలా కూల్చివేస్తారని వారు ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి మహేష్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ ఎం. సేథ్నాలతో కూడిన ధర్మాసనం నవంబర్ 25 వరకు కూల్చివేతపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భవనాన్ని యథాతథ స్థితిలో ఉంచాలని స్పష్టం చేసింది. అప్పటికే భవనంలోని కొంత భాగాన్ని కూల్చివేసిన అధికారులు.. కోర్టు ఉత్తర్వులతో పనులను తక్షణమే నిలిపివేశారు. నవంబర్ 25న జరిగే తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
