Begin typing your search above and press return to search.

దావోస్ లో నారా లోకేష్ - రేవంత్ రెడ్డి.. పిక్స్ వైరల్!

స్విట్జర్లాండ్‌ లోని దావోస్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   22 Jan 2026 4:58 PM IST
దావోస్  లో నారా లోకేష్ - రేవంత్  రెడ్డి.. పిక్స్  వైరల్!
X

స్విట్జర్లాండ్‌ లోని దావోస్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేష్.. ఈ పర్యటనను మ్యాగ్జిమం యుటిలైజ్ చేసుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఈ బీజీ షెడ్యూల్ నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి – లోకేష్ కలిశారు. దీనికి సంబంధించిన పిక్స్ హల్ చల్ చేస్తున్నాయి.





అవును... దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు అటు ఏపీ, ఇటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయంగా మరింతగా విస్తృతంగా ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అంతర్జాతీయంగా పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన చంద్రబాబు, లోకేష్.. లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు!





మరోవైపు.. డబ్ల్యూఈఎఫ్ ఎండీ జెరెమీ జర్గెన్స్‌ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమయంలో.. ఏటా హైదరాబాద్‌ లో డబ్ల్యూఈఎఫ్ ఫాలోఅప్‌ సదస్సు నిర్వహించాలని కోరారు. దీంతో... త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఎకనామిక్ ఫోరం బృందం ఆయనకు తెలిపింది. ఇదే సమయంలో.. సీ4ఐఆర్ నెట్‌ వర్క్ కో-ఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్‌ తోనూ సీఎం భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌ లక్ష్యాలను వివరించారు.

ఈ నేపథ్యంలోనే దావోస్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి లోకేష్ కలుసుకున్నారు. దీనిపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన లోకేష్... దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంతోషంగా ఉందని.. రెండు రాష్ట్రాల్లో విద్యా సంస్కరణలు, ఐటీ వృద్ధి, నైపుణ్య అభివృద్ధిపై తాము నిర్మాణాత్మక చర్చ చేసామని.. తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారం ద్వారా వేగంగా, బలంగా అభివృద్ధి చెందుతాయని తాను గట్టిగా నమ్ముతున్నట్లు తెలిపారు.

లోకేష్ ను కలిసిన గల్లా జయదేవ్!:

అంతకంటే ముందు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ, ఈ&సీ, హెచ్‌.ఆర్‌.డి, రియల్ టైమ్ గవర్నెన్స్ మంత్రి నారా లోకేష్ ను మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కలిశారు. ఈ సమయంలో... జీఎంఆర్ గ్రూప్‌ కు చెందిన శ్రీనివాస్ బొమ్మిడాల, మాలక్ష్మి గ్రూప్‌ కు చెందిన హరీష్ చంద్ర ప్రసాద్‌ లతో కలిసి సంభాషించినట్లు జయదేవ్ వెల్లడించారు. ఆవిష్కరణ, పెట్టుబడి, బలమైన ప్రపంచ భాగస్వామ్యాల ద్వారా ఆంధ్రప్రదేశ్ వృద్ధిని వేగవంతం చేయడంపై చర్చలు కేంద్రీకృతమయ్యాయని వెల్లడించారు.