దావోస్ లో బిగ్ అలర్ట్... ట్రంప్ పేరు చెప్పి స్కామర్లు రెచ్చిపోయారు!
అవును... స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో నేడు ట్రంప్ ఎంట్రీ వేళ ఓ కీలక పరిణామం చోటు చేసుకుని, వెలుగులోకి వచ్చింది.
By: Raja Ch | 21 Jan 2026 4:02 PM ISTకాదేదీ మోసానికి అనర్హం అంటున్నారు నేటి సైబర్ నేరగాళ్లు! ఈ క్రమంలో దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రంప్ ప్రసంగిస్తున్న వేళ.. ట్రంప్ పరిపాలనతో ముడిపడి ఉన్న కీలక వేదికను స్కామర్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో భాగంగా.. "యూ.ఎస్.ఏ. హౌస్"లోకి ప్రత్యేక ప్రవేశం కల్పిస్తామని అక్కడున్న బిలియనీర్లను బురుడీ కొట్టించారు. దీంతో వేదిక నిర్వాహకుల నుంచి బహిరంగ హెచ్చరిక జారీ అయ్యింది.
అవును... స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో నేడు ట్రంప్ ఎంట్రీ వేళ ఓ కీలక పరిణామం చోటు చేసుకుని, వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... అమెరికాకు చెందిన కీలక వేదికను స్కామర్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా... ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశమయ్యేందుకు గానూ అక్కడి 'యూ.ఎస్.ఏ హౌస్'లోకి వీఐపీ యాక్సెస్ కల్పిస్తామంటూ బిలియనీర్లకు మాయమాటలు చెప్పి, వారికి నకిలీ టికెట్లు అమ్మేశారు.
ఈ వ్యవహారం సదస్సు నిర్వాహకుల దృష్టికి చేరడంతో.. వారు వెబ్ సైట్ లో బహిరంగ హెచ్చరికను జారీ చేస్తూ.. విజిటర్లను అప్రమత్తం చేశారు. ఆ వీఐపీ యాక్సెస్ ప్యాకేజీలను కొనుగోలు చేయొద్దని హెచ్చరించారు. ఈ ఏడాది నకిలీ పాస్ ల విక్రయాలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ స్కామ్ బారిన పడిన వారి పట్ల తాము సానుభూతి వ్యక్తం చేస్తున్నామని నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు.
కాగా... దావోస్ లోని హై-సెక్యూరిటీ జోన్ వెలుపల ఉన్న చర్చిలో ఉన్న యూ.ఎస్.ఏ హౌస్ చర్చల సమితిని నిర్వహిస్తోంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో సీఈఓలు, యూఎస్ క్యాబినెట్ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొంటుంటారు. ఇక ప్రధానంగా బుధవారం ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొని, ప్రసంగించనున్నారు. దీంతో... తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రసంగంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.
వాస్తవానికి దావోస్ లో ట్రంప్ ప్రత్యేక ప్రసంగం స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2:00 ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే... ఈస్ట్రన్ టైం జోన్ ప్రకారం రాత్రి 11:07 గంటలకు ట్రంప్ బయలుదేరిన "ఎయిర్ ఫోర్స్ వన్" విమానం యూటర్న్ తీసుకుని తిరిగి మేరీల్యాండ్ లోని బేస్ ఆండ్రూస్ లో ల్యాండ్ అయ్యింది. విమానంలో తలెత్తిన చిన్న విద్యుత్ సమస్య దీనికి కారణం అని వైట్ హౌస్ వెల్లడించింది! దీంతో ఆయన ప్రయాణం ఆలస్యం అయ్యింది!
ఈ క్రమంలో... దావోస్ లో ట్రంప్ ప్రసంగం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం దాదాపు ఉదయం 11:00 గంటలకు) ఉంటుందని ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు!
