Begin typing your search above and press return to search.

దావోస్ అప్ డేట్స్... ఏపీకి దుబాయ్, ఇజ్రాయెల్ నుంచి గుడ్ న్యూస్ లు!

అవును... దావోస్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వ్యవహారం కీలకంగా మారుతుందని అంటున్నారు.

By:  Raja Ch   |   21 Jan 2026 2:20 PM IST
దావోస్ అప్ డేట్స్... ఏపీకి దుబాయ్, ఇజ్రాయెల్ నుంచి గుడ్ న్యూస్ లు!
X

దావోస్‌ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం 2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు పలు శుభవార్తలు వినిపిస్తున్నాయనే చర్చ బలంగా నడుస్తోంది. అంతర్జాతీయ వేదికపై ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వివరిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల ముందు కీలక ప్రతిపాదనలు పెట్టి, వారు సానుకూలంగా స్పందించేలా చేస్తున్నారు. ఈ సమయంలో మరో కీలక అప్ డేట్స్ తెరపైకి వచ్చాయి.

అవును... దావోస్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వ్యవహారం కీలకంగా మారుతుందని అంటున్నారు. ఈ సందర్భంగా పలు అంతర్జాతీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా దావోస్‌ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో యూఏఈ ఆర్థిక, పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మార్రీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా... ఏపీలో దుబాయ్‌ ఫుడ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ సంసిద్ధత తెలిపింది.

ఈ సందర్భంగా స్పందించిన యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ... యూఏఈకి చెందిన 40 సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో... షరాఫ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ఏపీలో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపైనా వారు చర్చించారు. ఈ క్రమంలో... ఏపీలో ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పర్యాటకం మొదలైన రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని చంద్రబాబు వివరించారు.

మరోవైపు.. అమరావతిని సైబర్‌ సెక్యూరిటీ నగరంగా తీర్చిదిద్దేందుకు సాంకేతిక సహకారం అందించాలని ఇజ్రాయెల్‌ దేశ ప్రతినిధి బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్‌ బరక్కత్, ట్రేడ్‌ కమిషనర్‌ గోయ్‌ ఫిషర్, స్విట్జర్లాండ్‌ లో ఇజ్రాయెల్‌ ట్రేడ్‌ మిషన్‌ ప్రతినిధి షిర్‌ స్లట్కీతో సమావేశమైన చంద్రబాబు ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలు వారి ముందుంచారు.

ఇందులో భాగంగా... పారిశ్రామిక అవసరాల కోసం వ్యర్థ జలాల రీసైక్లింగ్‌ సాంకేతికతపై సహకారం అందించాలని కోరిన చంద్రబాబు... క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ తోపాటు సెమీకండక్టర్ల తయారీ.. జపాన్, కొరియా పారిశ్రామిక క్లస్టర్ల మాదిరిగా ఇజ్రాయెల్‌ కూడా ఒక పారిశ్రామిక క్లస్టర్‌ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా... వారి నుంచి సానుకూల రియాక్షన్ వచ్చిందని తెలుస్తోంది!

మరోవైపు... బుధవారం ప్రముఖ కంపెనీల సీఈఓలతో చంద్రబాబు ముఖాముఖి భేటీ కానున్నారు. ఇందులో భాగంగా... తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్‌ సృష్టి శిబులాల్, ఆ సంస్థ సీఓఓ ఖష్బూ అవస్థి, కాలిబో ఏఐ అకాడమీ సీఈవో రాజ్‌ వట్టికుట్టి.. ముఖ్యమంత్రితో సమావేశమై చర్చిస్తారు. బ్లూమ్‌ బర్గ్‌ సంస్థ నిర్వహించనున్న ట్రిలియన్స్‌ ఆఫ్‌ డాలర్స్‌ ఏఐ మూవ్‌ మెంట్‌ ట్రాన్స్‌ ఫార్మింగ్‌ గ్లోబల్‌ ఎకానమీ సెషన్‌ లో చంద్రబాబు ప్రసంగించనున్నారు.