Begin typing your search above and press return to search.

డేటింగ్ సంక్షోభం: అమెరికాలోనే కాదు భార‌త్‌లోను కుర్రాళ్ల‌ జేబులు ఖాళీ!

ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రేమ, అనుబంధాల కంటే ఆర్థికపరమైన లెక్కలే యువత నిర్ణయాలను ఎక్కువగా శాసిస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   18 May 2026 12:19 PM IST
డేటింగ్ సంక్షోభం: అమెరికాలోనే కాదు భార‌త్‌లోను కుర్రాళ్ల‌ జేబులు ఖాళీ!
X

ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రేమ, అనుబంధాల కంటే ఆర్థికపరమైన లెక్కలే యువత నిర్ణయాలను ఎక్కువగా శాసిస్తున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం కారణంగా డేటింగ్ చేయడం అనేది సగటు సింగిల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా పెను భారంగా మారుతోంది. ఈ సమస్య కేవలం పాశ్చాత్య దేశాలకే పరిమితం కాకుండా, ఇప్పుడు భారతదేశంలోని మధ్యతరగతి యువతను కూడా తీవ్రంగా వేధిస్తోంది. `ఫార్చ్యూన్` పత్రిక తాజా క‌థ‌నం ప్రకారం.. అమెరికాలోని దాదాపు 50 శాతం మంది సింగిల్స్ ఆర్థిక కారణాల వల్ల డేటింగ్‌కు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇదే ట్రెండ్ ఇప్పుడు భారత్‌లోనూ కనిపిస్తోంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. చమురు సంక్షోభం కారణంగా నిత్యావసరాల ధరలు అమాంతం పెరగడం వల్ల, కుటుంబ బాధ్యతలు మోస్తూ ఖరీదైన డేటింగ్ సంస్కృతిని తట్టుకోవడం ఇక్కడి యువతకు సాధ్యం కావడం లేదు.

బ్యాంక్ ఆఫ్ మోంట్రియాల్ (బీఎంవో) విడుదల చేసిన `2026 రియల్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఇండెక్స్` డేటా ప్రకారం.. అమెరికాలో ఒక సింగిల్ డేట్ కోసం అయ్యే సగటు ఆల్-ఇన్ ఖర్చు ఏకంగా 189 డాలర్లకు (భారత కరెన్సీలో దాదాపు రూ.15,800) చేరుకుంది. గత ఏడాది ఇదే ఖర్చు 168 డాలర్లుగా ఉండగా, కేవలం ఒక్క సంవత్సరంలోనే ఇది 12.5 శాతం పెరగడం గమనార్హం. ఈ ఆల్-ఇన్ ఖర్చులో కేవలం హోటల్ భోజనం, పానీయాలు మాత్రమే కాకుండా.. అక్కడికి వెళ్లడానికి అయ్యే రవాణా ఖర్చులు (ట్రాన్స్‌పోర్ట్), డేట్‌కు వెళ్లే ముందు యువతీయువకులు తమ ఆహార్యాన్ని అందంగా మార్చుకోవడానికి చేసే గ్రూమింగ్ (సెలూన్, దుస్తులు) ఖర్చులు కూడా కలిసి ఉన్నాయి. మన దేశంలోనూ మెట్రో నగరాల్లో ఒక సాధారణ వీకెండ్ డేట్‌కు వెళ్లాలన్నా వేల రూపాయలు వదిలించుకోవాల్సిన పరిస్థితి రావడంతో, సగటు జీతగాళ్లు దీనికి ఆమడదూరంలో ఉంటున్నారు.

ఈ విధంగా ఖర్చులు భారీగా పెరుగుతుండటంతో అమెరికన్లు డేటింగ్‌కు వెళ్లే సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటున్నారు. ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నా.. వారు బయటకు వెళ్లే సందర్భాలు తక్కువగా ఉంటున్నాయని సర్వే స్పష్టం చేసింది. 2025వ సంవత్సరంలో సగటున ఒక వ్యక్తి ఏడాదికి 14 సార్లు డేటింగ్‌కు వెళ్లగా 2026 నాటికి ఆ సంఖ్య 12కి పడిపోయింది. అయితే డేటింగ్ కోసం వారు చేసే వార్షిక వ్యయం మాత్రం ఏటా 2,300 డాలర్ల (దాదాపు రూ.1.92 లక్షలు) మార్కును దాటిపోవడం అక్కడి ద్రవ్యోల్బణ తీవ్రతకు అద్దం పడుతోంది. ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా చాలా మంది తమ విచక్షణారహిత ఖర్చులను పునఃసమీక్షించుకుంటున్నారు. భారతదేశంలోనూ ఈ వ్యత్యాసం స్పష్టంగా ఉంది. సామాన్య, మధ్యతరగతి యువకులు కాస్ట్ లీ లైఫ్‌స్టైల్‌తో వేగలేక వెనకడుగు వేస్తుంటే, ఎలైట్ క్లాస్ మాత్రం లగ్జరీ డేటింగ్‌ను కొనసాగిస్తోంది.

ఈ ఆర్థిక మార్పుల నేపథ్యంలో అమెరికా డేటింగ్ మార్కెట్‌లో ఒక సరికొత్త కే-షేప్డ్ (K-షేప్డ్‌) ఎకానమీ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. దీని అర్థం సమాజంలోని ఒక వర్గం ఆర్థిక ఇబ్బందుల వల్ల డేటింగ్‌కు పూర్తిగా దూరంగా జరిగిపోతుండగా లేదా కాఫీ షాపులు, పార్కుల వంటి అత్యంత తక్కువ ఖర్చయ్యే ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటోంది. మరోవైపు ఆర్థికంగా స్థిరపడిన ఉన్నత వర్గాల వారు మాత్రం ధరలు ఎంత పెరిగినా.. సంప్రదాయ పద్ధతిలోనే ఖరీదైన రెస్టారెంట్లు, ఈవెంట్లకు వెళ్తూ యథేచ్ఛగా ఖర్చు చేస్తున్నారు. ఈ విధంగా సింగిల్స్ మధ్య ఆర్థిక వ్యత్యాసాల ఆధారంగా డేటింగ్ ల్యాండ్‌స్కేప్ రెండు వేర్వేరు ధృవాలుగా చీలిపోతోంది.

మొత్తంగా చూస్తే.. నిత్యావసరాలు, ఇంధనం, గృహ వసతి వంటి ప్రాథమిక అవసరాల ఖర్చులు పెరగడం వల్ల అమెరికా యువత తమ వ్యక్తిగత జీవితాన్ని, బంధాలను కూడా ఆర్థిక కోణంలోనే చూసే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు కేవలం ఇద్దరు వ్యక్తుల ఇష్టాయిష్టాలు, మనస్తత్వాల చుట్టూ తిరిగే డేటింగ్ సంస్కృతి... ఇప్పుడు బ్యాంకు బ్యాలెన్స్ - నెలవారీ బడ్జెట్ పరిమితులపై ఆధారపడి నడుస్తోంది. ఈ ఆర్థిక భారం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వివాహాలు, కుటుంబ వ్యవస్థలపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

డేటింగ్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు! అనే చేదు నిజాన్ని నేటి యువత గ్రహిస్తోంది. ఈ ఆర్థిక భారం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వివాహాలు, సాంప్రదాయ కుటుంబ వ్యవస్థల మనుగడపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సామాజిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.