Begin typing your search above and press return to search.

డేటింగ్ యాప్.. డెత్ ట్రాప్.. ప్రేమ ముసుగులో ప్రాణాలు తీస్తున్న కిరాతకులు.. యువత జాగ్రత్త!

డిజిటల్ యుగం మనకు అరచేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తోంది. ఒక్క క్లిక్‌తో కొత్త పరిచయాలు, స్నేహాలు, ప్రేమలు చిగురిస్తున్నాయి.

By:  A.N.Kumar   |   5 April 2026 10:56 AM IST
డేటింగ్ యాప్.. డెత్ ట్రాప్.. ప్రేమ ముసుగులో ప్రాణాలు తీస్తున్న కిరాతకులు.. యువత జాగ్రత్త!
X

డిజిటల్ యుగం మనకు అరచేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తోంది. ఒక్క క్లిక్‌తో కొత్త పరిచయాలు, స్నేహాలు, ప్రేమలు చిగురిస్తున్నాయి. అయితే ఈ వెలుగుల వెనుక చీకటి కోణాలు కూడా ఉన్నాయని మర్చిపోకూడదు. ముఖ్యంగా నేటి యువతను ఆకర్షిస్తున్న డేటింగ్ యాప్‌లు క్రమంగా ప్రమాదకర గండాలుగా మారుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై కనిపించే అందమైన ముఖచిత్రాలు, తీయని మాటల వెనుక ఎంతటి కిరాతక ఆలోచనలు ఉంటాయో తెలియక ఎంతోమంది యువతీ యువకులు తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.

ప్రేమ ముసుగులో ప్రాణాలు తీస్తున్న కిరాతకం

డేటింగ్ యాప్‌ల ద్వారా ఏర్పడే పరిచయాలు ఒక్కోసారి ఊహించని విషాదాలకు దారితీస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణే ప్రణవి ఉదంతం. రాకేష్ అనే వ్యక్తితో యాప్‌లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. కానీ అతడికి అప్పటికే పెళ్లైందనే నిజాన్ని దాచి ఆమెను నమ్మించాడు. చివరికి పెళ్లి చేసుకోమని ప్రణవి ఒత్తిడి చేయడంతో తన గుట్టు రట్టవుతుందనే భయంతో ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. ఇది ఒక ప్రణవి కథ మాత్రమే కాదు, గుడ్డిగా నమ్మితే ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయనే దానికి ఇదొక హెచ్చరిక.

డిజిటల్ వల.. మానసిక కుంగుబాటు

మరోవైపు హాసిని అనే యువతి అనుభవం ఆన్‌లైన్ భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. సరదా కోసం యాప్‌లో చేరిన ఆమె.. ఒక అపరిచితుడి మాయమాటలు నమ్మి వ్యక్తిగత వీడియోలు పంచుకుంది. అతను వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. అలాగే వర్షిణి కథ కూడా కన్నీళ్లు తెప్పిస్తోంది. 'ఘోస్టింగ్' లాంటి అకస్మాత్తుగా సంబంధం తెంచుకోవడం బాధితురాలిగా మారిన ఆమె.. నమ్మిన వ్యక్తి ముఖం చాటేయడంతో డిప్రెషన్‌లోకి వెళ్లి తన భవిష్యత్తును పాడు చేసుకుంది.

మోసాల వెనుక ఉన్న 'టెక్నిక్స్' ఇవే!

నేరగాళ్లు యువతను లొంగదీసుకోవడానికి రకరకాల పద్ధతులు వాడుతున్నారు. మొదట్లో విపరీతమైన ప్రేమను కురిపించి, ఎదుటివారిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. సన్నిహితంగా ఉన్నప్పుడు సేకరించిన ఫోటోలు, వీడియోలను బయటపెడతామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. ఇంటర్నెట్ నుండి సేకరించిన అందమైన ఫోటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి తప్పుడు హోదాలతో మోసం చేస్తారు. యాప్‌లోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను వాడుకుని బాధితులు ఎక్కడికి వెళ్తున్నారో కనిపెట్టి వేధింపులకు పాల్పడుతుంటారు.

జాగ్రత్తే అసలైన రక్ష!

డేటింగ్ యాప్‌లు వాడే వారు కింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఎదుటి వ్యక్తి చెప్పే వివరాలు నిజమో కాదో సరిచూసుకోండి. ఫోన్ నంబర్లు, బ్యాంక్ వివరాలు, ఇంటి అడ్రస్‌లు వెంటనే పంచుకోవద్దు. ఎవరినైనా మొదటిసారి కలిసేటప్పుడు జన సంచారం ఉన్న హోటళ్లు లేదా మాల్స్‌లోనే కలవాలి. మీరు ఎవరిని కలవబోతున్నారో ఆ వివరాలను.. మీ లైవ్ లొకేషన్‌ను నమ్మకమైన స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు పంపండి.

ఒకవేళ మీరు మోసపోయినట్లు అనిపిస్తే ఏమాత్రం భయపడకుండా వెంటనే స్పందించండి. సైబర్ నేరాల గురించి ఫిర్యాదు చేయడానికి 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి. అత్యవసర సమయంలో 100 కి డయల్ చేయండి.

ఆన్‌లైన్ పరిచయాలు ఆకర్షణీయంగా ఉండవచ్చు.. కానీ మీ ప్రాణం, గౌరవం అంతకంటే విలువైనవి. జాగ్రత్తగా ఉండండి, క్షేమంగా ఉండండి!