డార్లింగ్ మూవీ సీన్ రిపీట్.. నిస్వార్థమైన స్నేహం.. ఎక్కడో ఏంటో తెలుసా?
అంతేకాదు నిన్న రామతీర్థం క్షేత్రంలో ప్రభాకర్ కూతురు పెళ్లిని ఘనంగా చేయడమే కాదు వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి పల్లకిని మోసిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By: Madhu Reddy | 12 Oct 2025 1:41 PM ISTపురాణాల నుండి మొదలు ఇప్పటివరకు స్నేహం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు. ముఖ్యంగా అన్ని బంధాల కంటే స్నేహబంధం గొప్పదని, రక్తసంబంధీకులు కాకపోయినా కూడా స్నేహబంధం చాలా గొప్పగా ఉంటుంది అని అంటూ ఉంటారు. స్నేహాన్ని మించిన అనుబంధం మరొకటి ఉండదని అంటారు. అలా ఇప్పటికే ఈ స్నేహం పై పాటలు, కవితలు, కవిత్వాలు, సినిమాలు ఇలా ఎన్నో వచ్చాయి.. అయితే అలాంటి స్నేహ బంధానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాళ్ళు నిజంగా అర్హులు అని చెప్పుకోవచ్చు. కొంతమంది స్నేహం పేరుతో వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. మరికొంతమంది స్నేహం పేరు చెప్పుకొని వారిని వాడుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇలాంటి స్నేహితులు మాత్రం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి అనుకుంటారు ఈ విషయం తెలిసిన జనాలు. తమతోటి స్నేహితుడు చనిపోతే ఆ స్నేహితుడు కూతురికి పెళ్లి చేసి తండ్రి లేని లోటును తీర్చారు వీరంతా.. మరి ఇంతకీ వాళ్ళు ఎవరు ? అసలు విషయం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని నల్లవాగుల పల్లెలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అదేంటంటే ప్రభాకర్ అనే వ్యక్తి 2007లో అనారోగ్య సమస్యలతో మరణించారు. కుటుంబానికి పెద్దదిక్కు మరణించడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయింది. తల్లి ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని ఇప్పటి వరకు నెట్టుకు వచ్చిన్నప్పటికీ పెళ్ళీడుకి వచ్చిన కూతురికి పెళ్లి చేసే సమయానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడింది.అయితే ఈ విషయం తెలుసుకున్న చనిపోయిన ప్రభాకర్ టెన్త్ క్లాస్ స్నేహితులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. వారందరూ కలిసి ప్రభాకర్ పెద్ద కుమార్తె కి గ్రాండ్ గా పెళ్లి చేశారు. అలా పదో తరగతి మిత్రులందరూ కలిసి ఒకే దగ్గర చేరి చనిపోయిన ప్రభాకర్ పెద్ద కూతురి వివాహానికి అయ్యే ఖర్చు మొత్తం వీళ్లే భరించారు.
అంతేకాదు నిన్న రామతీర్థం క్షేత్రంలో ప్రభాకర్ కూతురు పెళ్లిని ఘనంగా చేయడమే కాదు వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి పల్లకిని మోసిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన చాలా మంది జనాలు ఫ్రెండ్స్ అంటే మీలా ఉండాలి..మీ స్నేహితుడు చనిపోయినందుకు స్నేహితుడి కూతురి పెళ్లి చేసి గొప్ప మనసు చాటుకున్నారు. మీలాంటి స్నేహితులు జీవితంలో ఒక్కరైనా ఉండాలి.. ఇలాంటి స్నేహం ఎప్పటికీ నిలవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఈ సీన్ చూస్తుంటే అచ్చం ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ మూవీ సన్నివేశాన్ని తలపిస్తోంది.ఎందుకంటే ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీలో నటుడు చంద్రమోహన్ తన కూతురికి ఫారిన్ అబ్బాయితో పెళ్లి చేయాలని చూస్తాడు.
కూతురు పెళ్లి కోసం ఇల్లు అమ్మేయాలి అనుకున్న టైంలో చంద్రమోహన్ స్నేహితులందరూ కలిసి పెళ్లి ఖర్చులను పంచుకొని అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు. అలా అచ్చం డార్లింగ్ మూవీ తరహా సన్నివేశాన్ని తలపించేలా ప్రస్తుతం ఏపీలోని నంద్యాలలోని నల్లవాగుపల్లెలో జరిగిన ఈ స్నేహితులు చేసిన పని చాలామందిని ఆకట్టుకుంటుంది.
అంతేకాదు ఇలాంటి స్నేహితులు ఎంతోమందికి ఆదర్శం అని మెచ్చుకుంటున్నారు. ఈరోజుల్లో స్నేహం పేరుతో వెన్నుపోటు పొడిచే వారిని, అవసరానికి డబ్బు తీసుకొని వాడుకొని మోసం చేసే వారిని చూసాము గానీ ఇలాంటి వారిని చూడలేదు.. ఇది కదా నిస్వార్థమైన స్నేహం అంటే.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
