Begin typing your search above and press return to search.

‘ఐ బొమ్మ’ రవిగా ఎందుకు మారాడు? పోలీసుల విచారణలో బయటకు వచ్చింది ఇదే!

తెలివికి ఢోకా లేదు. సాంకేతికంగా అతడి సత్తాను అనుమానించాల్సిన అవసరం లేదు.

By:  Garuda Media   |   18 Nov 2025 11:47 AM IST
‘ఐ బొమ్మ’ రవిగా ఎందుకు మారాడు? పోలీసుల విచారణలో బయటకు వచ్చింది ఇదే!
X

తెలివికి ఢోకా లేదు. సాంకేతికంగా అతడి సత్తాను అనుమానించాల్సిన అవసరం లేదు. అలాంటోడు తప్పుడు మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? మొదట్లో ఐటీ ఉద్యోగిగా ఉన్న అతను.. ఐ బొమ్మ రవిగా ఎందుకు మారాడు? అతడ్ని మార్చిన అంశాలేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేశారు హైదరాబాద్ నగర పోలీసులు. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి మైండ్ సెట్ ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. వారి విచారణలో పలు అంశాలు వెలుగు చూశాయి.

అందులో ముఖ్యమైనది కాలేజీ రోజుల నుంచి పెళ్లి వరకు డబ్బుల విషయంలో అతను ఎదుర్కొన్న అవమానాలు.. అవహేళనలు అతన్నిమార్చేయటం.. డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకొని.. తాను నడిచే దారి చట్టబద్ధమైందా? లేదా? అన్న అంశాన్ని పట్టించుకోవటం పూర్తిగా మానేశాడు. రవి తండ్రి చెప్పినట్లుగా వారు చూపించిన పెళ్లి సంబంధం కాకుండా 2016లో ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు.. రవికి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తటం.. ఈ క్రమంలో వెబ్ డిజైనర్ గా తనకున్న అనుభవంతో ఐ బొమ్మ.. బప్పం టీవీ వెబ్ సైట్లకు రూపమిచ్చాడు. తాను అనుకున్న మార్గంలోకి వెళ్లాడు. డబ్బు సంపాదించాలన్న ఆశతో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు తెర తీశాడు.

కొద్ది నెలలకే బెట్టింగ్ యాప్ ల నిర్వాహకుల నుంచి ప్రకటనలు రావటంతో ఊహించనంత డబ్బు వచ్చి పడింది. ఆ తర్వాత తన మకాంను నెదర్లాండ్స్ కు మార్చాడు.

తాను ఎక్కడున్నా.. అక్కడి నుంచే వెబ్ సైట్లను నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. వాటి ద్వారా సేకరించిన 50 లక్షల మంది డేటాను సైబర్ నేరస్థులకు.. గేమింగ్ ముఠాలకు అమ్మి రూ.20 కోట్లు సంపాదించాడు.దీంతో కూకట్ పల్లిలోని ఫ్లాట్ కొనటంతో పాటు.. తన వద్ద ఉన్న సొమ్ములతో విదేశాల్లో స్థిరపడాలన్న ఆలోచనకు వచ్చాడు. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కాడు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో రవి చేసిన అతి పెద్ద పొరపాటు పోలీసులకు సవాలు చేయటంగా చెప్పాలి. ఇదే విషయాన్ని సీపీ సజ్జన్నార్ సైతం మీడియా భేటీలో పేర్కొనటమే దీనికి నిదర్శనం. ‘‘దమ్ముంటే పట్టుకోవాలని సవాలు చేసే ఏ నేరస్తుడికైనా జైలు ఊచలు ఖాయం’’ అని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ వార్నింగ్ ఇచ్చారు. సైబర్ మోసాలతో పాటు ఆర్థిక నేరాలతో సామాన్యులను మోసగించి తప్పించుకోవాలనుకోవటం అసాధ్యమన్న ఆయన.. ఫ్రీగా సినిమాలు చూసే అవకాశం కల్పించటం వెనుక చీకటి కోణం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దన్న ఆయన మాటలు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అంశంగా చెప్పక తప్పదు.