బ్లాక్ కామెడీతో డార్క్ రియాలిటీ.. కేతన్-సియా సోషల్ మీడియా వైరల్ రీల్స్ వెనుక అసలు కథ!
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సంచలన ఘటనలు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.
By: A.N.Kumar | 30 Jun 2026 10:51 AM ISTఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సంచలన ఘటనలు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ముఖ్యంగా పెళ్లి కాబోయే యువకులు, భర్తలు తమ భాగస్వాముల చేతుల్లోనే దారుణ హత్యలకు గురైన ఉదంతాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ భయానక వాతావరణం కేవలం వార్తలకే పరిమితం కాకుండా ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక కొత్త ట్రెండ్‌కు వేదికైంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్‌బుక్‌లలో ఈ అంశాలపై "బ్లాక్ కామెడీ" డార్క్ హ్యూమర్ రూపంలో వస్తున్న కంటెంట్ విపరీతంగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాను ముంచెత్తుతున్న వ్యంగ్య వీడియోలు
ఈ వైరల్ వీడియోలలో కంటెంట్ క్రియేటర్లు సమాజంలోని ప్రస్తుత పరిస్థితులను అత్యంత వ్యంగ్యంగా నవ్వు తెప్పించేలా అదే సమయంలో ఆలోచింపజేసేలా చిత్రీకరిస్తున్నారు. "పెళ్లికి ముందు కాబోయే భార్య గురించి ఎలాంటి నిజాలు తెలుసుకోవాలి?", "పెళ్లి తర్వాత ప్రాణాలతో ఎలా బతకాలి?" వంటి శీర్షికలతో రీల్స్ వెల్లువెత్తుతున్నాయి. కొన్ని వీడియోల్లో తల్లులు తమ వివాహ వయసు కుమారులను పిలిచి "జాగ్రత్తగా ఉండు బాబూ.. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు, ఈ రోజుల్లో నమ్మకాలు పోయాయి" అంటూ హెచ్చరిస్తున్నట్లుగా క్రియేట్ చేసిన వీడియోలు లక్షలాది వ్యూస్ సాధిస్తున్నాయి. నెటిజన్లు ఈ ట్రెండ్‌ను "డార్క్ రియాలిటీ" గా అభివర్ణిస్తున్నారు. సమాజంలో ఉన్న భయాన్ని, ఆందోళనను బయటకు చెప్పుకోలేక ఇలా హాస్యం రూపంలో వ్యక్తీకరిస్తున్నారని కొందరు సమర్థిస్తున్నారు.
వినోదమా? విషాదమా? రేగుతున్న వివాదం
ఈ తరహా కంటెంట్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం దీనిని కేవలం వినోదంగా చూస్తుంటే మరో వర్గం మాత్రం తీవ్రంగా తప్పుబడుతోంది. దారుణమైన హత్యలు, ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలను ఇలా రీల్స్ చేసి వినోదంగా మార్చడం ఏమాత్రం సరైంది కాదు. ఇది బాధిత కుటుంబాల మనోభావాలను మరింతగా గాయపరుస్తుందని పలువురు వాదిస్తున్నారు.
జనరలైజేషన్ ప్రమాదకరం
నిజానికి సోషల్ మీడియా అనేది సమాజంలో జరిగే పరిణామాలకు అద్దం పడుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఒకటి లేదా రెండు వికృత ఘటనలను ఆధారం చేసుకుని మొత్తం మహిళా సమాజాన్ని లేదా పవిత్రమైన వివాహ వ్యవస్థను అనుమానాస్పదంగా చిత్రీకరించడం తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది.
నేరం అనేది వ్యక్తిగత మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. నేరస్థుడికి లింగభేదం ఉండదు. కాబట్టి ఇలాంటి వీడియోల వల్ల సమాజంలో అనవసరమైన అపోహలు, ద్వేషం పెరిగే ప్రమాదం ఉంది. ఒక వర్గాన్ని మొత్తంగా తప్పుబట్టడం బాధ్యతారాహిత్యం అవుతుంది.
కావాల్సింది వినోదం కాదు.. బాధ్యత
ఈ వైరల్ రీల్స్ సమాజంలో ఒక ముఖ్యమైన చర్చను మాత్రం తెరపైకి తెచ్చాయి. వివాహం అనేది జీవితాంతం ఉండే బంధం. అందుకే పెళ్లికి ముందే భాగస్వామి వ్యక్తిత్వం, కుటుంబ నేపథ్యం, మానసిక ప్రవర్తన గురించి పూర్తిగా తెలుసుకోవడం అత్యంత అవసరమని నిపుణులు చెబుతున్నారు.
సోషల్ మీడియా కేవలం వినోదం కోసమే అయినప్పటికీ.. ఇలాంటి సున్నితమైన, ప్రాణాలతో కూడుకున్న అంశాలలో కంటెంట్ క్రియేటర్లు, వీక్షకులు ఇద్దరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
