అలెర్ట్: ఏఐలో ఈ ప్రశ్నలు అడిగారా జైలుకే!
ముఖ్యంగా ఈ టెక్నాలజీ వినియోగంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే జైలుకు వెళ్లక తప్పదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
By: Madhu Reddy | 4 Sept 2025 2:00 AM ISTసాధారణంగా గూగుల్లో ఎలా అయితే అడగరాని ప్రశ్నలు అడిగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందో.. ఇప్పుడు అధునాతన టెక్నాలజీగా పేరుపొందిన ఏఐలో కూడా కొన్ని అడగరాని ప్రశ్నలు అడిగితే జైలుకు వెళ్లక తప్పదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి ప్రశ్నలు ఏఐని అడగకూడదు? ఎలాంటి ప్రశ్నలు అడిగితే చిక్కుల్లో పడతారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
మారుతున్న కాలం కొద్ది కృత్రిమ మేధస్సు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ప్రతిరోజు ఉపయోగించే స్మార్ట్ ఫోన్లలో.. గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి వాయిస్ అసిస్టెంట్లను మొదలుకొని.. సోషల్ మీడియా, ఈ - కామర్స్ వెబ్ సైట్ లలో కూడా కృత్రిమ మేధస్సు గా పేరు సొంతం చేసుకున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రధమంగా ఉపయోగించబడుతోంది. అంతేకాదు ఏ విషయం గురించి అయినా సరే తెలుసుకోవాలి అంటే ఇట్టే చాట్ బాట్ లను ఉపయోగిస్తున్నారు. సమాచారం సేకరించడంలోనే కాదు కంటెంట్ ను తిరిగి క్రియేట్ చేయడంలో కూడా ఇది ప్రజలకు చాలా చక్కగా ఉపయోగపడుతోంది. ఖచ్చితమైన సమాధానాన్ని ఇవ్వడమే కాకుండా క్షణాలలో సమాధానం ఇస్తూ ఎంతోమందికి సహాయపడుతోంది.
అయితే ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈ టెక్నాలజీ వినియోగంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే జైలుకు వెళ్లక తప్పదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో కఠినమైన నిబంధనలు కూడా అమలులోకి వచ్చాయి. ప్రజల భద్రత , సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని.. ఏఐ చాట్ బాట్ వినియోగం దుర్వినియోగం చేయకుండా నియంత్రించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందుకే ఏఐ చాట్ బాట్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ కూడా చాట్ బాట్ నుండి సమాచారం రాబట్టడానికి అడిగే కొన్ని రకాల ప్రశ్నలను ఇప్పుడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
చాట్ బాట్ ను ఉపయోగించే ప్రతి ఒక్కరు కూడా వాటి పరిమితులను.. చట్టపరమైన నిబంధనలను తప్పకుండా తెలుసుకోవాలని.. వినోదం కోసమో .. లేక తెలుసుకోవాలనే ఉత్సాహంతో అడిగే ఒక ప్రశ్న జైలుకు కూడా పంపించవచ్చని హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు అనే విషయానికి వస్తే..ముఖ్యంగా ఆత్మహత్యకు మార్గాలు, బాంబులు, పేలుడు పదార్థాల తయారీ విధానాలతో పాటు మైనర్లపై జరిగే అఘాయిత్యాలు, హింసాత్మక ఘటనలకు వేసే ప్రణాళికలు, డ్రగ్స్ ఇలా కొన్ని సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం జైలుకు వెళ్లక తప్పదట.. కనీసం ఇప్పటికైనా ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏది ఎంత అవసరమో? టెక్నాలజీని ఎలా ఉపయోగకరంగా మార్చుకోవాలో? తెలుసుకుంటే అందరికీ ఉపయోగమని.. లేకపోతే నష్టాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
