అభయారణ్యంలో రూ.400 కోట్లు, 400 కేజీల బంగారం?.. ఎవరిదో తెలుసా?
లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు దండకారుణ్యంలో ఎక్కడికక్కడ డబ్బు దాచిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Political Desk | 1 Nov 2025 12:17 PM ISTదండకారుణ్యంలో నక్సల్స్ కోసం విస్తృతంగా గాలించే భద్రతా బలగాలు.. ఇప్పుడు బంగారం, డబ్బు డంపు కోసం అన్వేషిస్తున్నాయట.. ఆపరేషన్ కగార్ తో కకావికలమైన మావోయిస్టు పార్టీలో నేతలు, దళసభ్యులు గ్రూపులు, దళాల వారీగా లొంగుబాట్లకు మొగ్గుచూపుతున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పలువురు అగ్రనేతలు, వారి అనుచరులు, దళ సభ్యులు వందల సంఖ్యలో లొంగిపోయిన విషయం తెలిసిందే.
అయితే ఇలా లొంగిపోయిన వారిలో కొందరు తమ ఆయుధాలను కూడా ప్రభుత్వానికి అప్పగించారు. ఇదే సమయంలో తమ వద్ద ఉన్న డబ్బు, బంగారాన్ని దండకారుణ్యంలోనే వదిలేసినట్లు కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో ఇన్నాళ్లు మావోయిస్టుల కోసం అడవులను జల్లెడ పట్టిన పోలీసులు.. కోట్ల కొద్దీ ఉన్న డబ్బు, బంగారం ఆచూకీ కోసం అణువణువూ సాధించాలి ఏమో అని అంటున్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు దండకారుణ్యంలో ఎక్కడికక్కడ డబ్బు దాచిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం సుమారు రూ.400 కోట్లు వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. పార్టీని నడపాడానికి మావోయిస్టులు పలువురిని బెదిరించి విరాళాలు సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. దండకారుణ్యంతోపాటు ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే కాంట్రాక్టర్లు, వ్యాపారులు, రాజకీయ నేతల నుంచి మావోయిస్టుల కోట్ల కొద్ది డబ్బు సేకరించినట్లు చెబుతున్నారు. సూట్ కేసు కంపెనీలను ప్రారంభించడంతోపాటు మావోయిస్టు సానుభూతిపరులు, వారి కుటుంబ సభ్యుల పేరున కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఉందని అంటున్నారు.
ఇటీవల చత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఓ ప్రజా హక్కుల కార్యకర్త బ్యాంకు అకౌంటులో కోట్ల రూపాయల డబ్బు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. ఆయన కుటుంబ సభ్యుల పేరుతో డమ్మీ కంపెనీలు ఉన్న విషయం బయటపడినట్లు తెలుస్తోంది. ఇది లొంగిపోయిన ఓ మావోయిస్టు నేత బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా మావోయిస్టుల డబ్బు బ్యాంకుల్లో చాలా వరకు సురక్షితంగా ఉండగా, మరికొంత నగదు డంపుల్లో దాచిపెట్టినట్లు చెబుతున్నారు. లొంగిపోయే ముందు మావోయిస్టులు తమ వద్ద ఉన్న డబ్బును పార్టీకి అప్పగించి అడవులను వదిలేసి వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
అదేవిధంగా డబ్బుతోపాటు మావోయిస్టుల వద్ద పెద్ద ఎత్తున బంగారం కూడా నిల్వ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు సమయంలోను, కొవిడ్ సమయంలోను మావోయిస్టులు తమ వద్ద ఉన్న నగదు నిల్వలను బంగారం రూపంలో మార్చినట్లు చెబుతున్నారు. ఇలా దాదాపు 400 కిలోల వరకు బంగారాన్ని పోగేసినట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందిందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలే ఈ గుట్టు బయటపెట్టారని కూడా చెబుతున్నారు. దీంతో బంగారం వెలికి తీసేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. ఆపరేషన్ కగార్ తో మావోయిస్టుల్లో దాదాపు 70 శాతం లొంగిపోవడమే, ఎన్కౌంటర్లలో మరణించడమో జరిగిందని, మిగతా 30 శాతం మంది కోసం జల్లెడ పడుతున్న పోలీసులు.. అదే సమయంలో మావోయిస్టు పార్టీ ఆర్థిక మూలాలను బయటకు తీసేలా పనిచేస్తున్నాయని అంటున్నారు.
