ఆ జంపింగుల మాటేంటి? తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ డిబేట్!
ఈ క్రమంలోనే స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు.. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. ఉదాశీనంగా వ్యవహరించిన తీరును ఎండగడుతు.. బీఆర్ ఎస్ న్యాయపోరాటం చేసింది.
By: Garuda Media | 19 Sept 2026 5:46 PM ISTతెలంగాణ రాజకీయాల్లో గత రెండు సంవత్సరాలుగా తీవ్ర చర్చకు, రాజకీయ రచ్చకు కూడా కారణమైన.. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ వ్యవహారంలో ప్రస్తుతం ఒక్కరిపైనే హైకోర్టు చర్యలు తీసుకుంది.? దీంతో మిగిలిన వారి సంగతేంటన్న చర్చ జోరుగా సాగుతోంది. 2023లో బీఆర్ ఎస్ టికెట్‌పై విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేల్లో 10 మంది గుండుగుత్తగా పార్టీ మారారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ చెంతకు చేరిపోయారు. దీంతో బీఆర్ ఎస్ నిప్పులు చెరిగింది. కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా.. న్యాయపరంగా కూడా పోరాటం చేసింది.
ఈ క్రమంలోనే స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు.. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. ఉదాశీనంగా వ్యవహరించిన తీరును ఎండగడుతు.. బీఆర్ ఎస్ న్యాయపోరాటం చేసింది. ఫలితంగా.. ఎట్టకేలకు రెండున్నరేళ్ల తర్వాత.. దానం నాగేందర్‌పై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.అయితే.. ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. మరో 9 మంది ఎమ్మెల్యేలు .. ఇంకా త్రిశంకు స్వర్గంలోనే ఉన్నారు. అయితే.. వీరిలో పఠాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి మాత్రమే ముప్పు తప్పింది.
మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చినా.. బీఆర్ ఎస్ న్యాయపోరాటం ప్రారంభించగానే.. సెట్ రైట్ అయ్యే ప్రయత్నం చేశారు. తిరిగి తన నియోజకవర్గంలో కార్యక్రమాలను ప్రారంభించారు. బీఆర్ ఎస్ నాయకులతో కలిసిపోయారు. దీంతో మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల వ్యవహారం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశం. అయితే.. ఈ ఎనిమిది మందిని కూడా గతంలోనే స్పీకర్ ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారించారు. కానీ.. ఆయన వీరికి క్లీన్ చిట్ ఇచ్చేశారు. నిజానికి దానం విషయంలోనూ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం.
అయినప్పటికీ.. బీఆర్ ఎస్ మాత్రం న్యాయపోరాటానికి దిగింది. ప్రస్తుతం మిగిలిన ఎనిమిది మందికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో విచారణ దశలోనే ఉన్నాయి. వచ్చే నెలలో వీటిపైనా విచారణ జరగనుంది. అయితే.. ఇప్పటికే స్పీకర్ విచారించినప్పటికీ.. కోర్టులో పిటిషన్లు ఉన్న నేపథ్యంలో వీరిపై ఎలాంటి నిర్ణయం వస్తుందన్నది చూడాలి. ఇక, ఇప్పుడు.. దానం నాగేందర్‌కు కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇతర నాయకులకు ఇంత తీవ్రమైన తీర్పు ఇచ్చే అవకాశం ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. మిగిలిన 8 మంది పరిస్థితి కూడా ఇరకాటంగానే ఉండడం గమనార్హం.
