రాజీనామాకు దానం రెఢీ.. ఢిల్లీకి వెళ్లింది అనుమతి కోసమేనా?
పార్టీ ఫిరాయింపు పిటిషన్ పై విచారణ వరకు వెళ్లకుండా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సిద్ధమవుతున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.
By: Garuda Media | 22 Nov 2025 9:26 AM ISTపార్టీ ఫిరాయింపు పిటిషన్ పై విచారణ వరకు వెళ్లకుండా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సిద్ధమవుతున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇందులో భాగంగా తన రాజీనామాకు కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతి కోసం ఆయన వేచి చూస్తున్నట్లుగా చెబుతున్నారు. తాను రాజీనామా చేసిన తర్వాత.. జరిగే ఉప ఎన్నికల్లో తనకే కాంగ్రెస్ టికెట్ కేటాయించే షరతు మీద రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. పార్టీ అధిష్ఠానం నుంచి ఆయనకు ఎలాంటి సంకేతాలు అందలేదన్న మాట వినిపిస్తోంది.
దానం నాగేందర్ మాదిరే మాజీ మంత్రి కం ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఫిరాయింపుల పిటిషన్ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దానం బాటలోనే కడియం కూడా నడవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి రాజీనామా అంశంపై కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ సొంతం చేసుకున్న దానం.. కడియం.. ఇద్దరు ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే.. ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కు ప్రతికూలంగా రావటం.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన ఐదు నెలల్లోనే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ బరిలోకి దిగటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఒక పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. పార్టీ మారి.. తన పదవికి రాజీనామా చేయకుండానే అధికార పార్టీ అభ్యర్థిగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయటాన్ని పలువురు తప్పు పట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బరిలోకి దిగి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది.
అయితే.. అదేమీ చేయకుండానే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి.. ఓడిపోయారు. అదే సమయంలో పార్టీ ఫిరాయింపు పిటిషన్ ను ఎదుర్కొంటున్నారు. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అనర్హత వేటు వేసేందుకు తెలంగాణ స్పీకర్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ కేసు లోతుల్లోకి వెళ్లకుండా.. ఎమ్మెల్యే పదవికి ముందస్తుగానే రాజీనామా చేసి.. ఉప ఎన్నికను ఎదుర్కోవాలన్న ఆలోచనలో దానం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉప ఎన్నికల్లో తాను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే.. గెలుపు ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి.. కాంగ్రెస్ అధినాయకత్వం ఏ నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.నిజానికి దానంకు మించిన అభ్యర్థి కాంగ్రెస్ కు ఖైరతాబాద్ లో మరెవరూ లేరన్న మాట వినిపిస్తోంది. దానం రాజీనామాకు కాంగ్రెస్ అధినాయకత్వం ఓకే చెబితే.. బీఆర్ఎస్ కు తిప్పలు ఖాయమంటున్నారు. దీనికి కారణం.. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు బలమైన నేతలు ఎవరూ లేకపోవటమే. మరిప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం రాజీనామాకు దానంకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా? అన్నదిప్పుడు సస్పెన్స్ గా మారింది.
