ఖైరతాబాద్ వేడెక్కిస్తోంది...ఉప ఎన్నికలు ఖాయం ?
ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఇపుడు హీటెక్కిస్తోంది. పది మంది దాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు కానీ పాపం దానం నాగేందర్ మాత్రమే అనర్హత వేటుకు గురి అయ్యారు.
By: Satya P | 24 Sept 2026 8:15 AM ISTఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఇపుడు హీటెక్కిస్తోంది. పది మంది దాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు కానీ పాపం దానం నాగేందర్ మాత్రమే అనర్హత వేటుకు గురి అయ్యారు. దానికి కారణం ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఏకంగా సికింద్రాబాద్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడమే. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచి ఉంటే హాయిగా ఎంపీ అయి ఉండేవారు. అపుడు ఖైరతాబాద్ కి ఉప ఎన్నిక వచ్చేది. ఈ అనర్హత వ్యవహారం ఏమీ ఉండేది కాదు. కానీ ఓటమి చెందడంతో పాటు మూడేళ్ళుగా సాగిన అనర్హత కధ కాస్తా ఇన్నాళ్ళకు కంచికి చేరిందనే అంటున్నారు.
సుప్రీం ఆశలెంతదాకా
ఇక తన మీద వచ్చిన ఫిరాయింపు వివాదం అనర్హత వేటు నేపధ్యంలో దానం సుప్రీం కోర్టు తలుపు తట్టారు. తనకు అక్కడ న్యాయం జరుగుతుందని ఆయన భావిస్తున్నారు. అయితే అదంత సులువు కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. హైకోర్టు అన్నీ పరిశీలించి ఇచ్చిన ఈ తీర్పుని సర్వోన్నత న్యాయ స్థానం కూడా చూసి హైకోర్టు తీర్పుకే ప్రాధాన్యత ఇస్తుందని అని అభిప్రాయపడుతున్న వారే హెచ్చుగా ఉన్నారు. దాంతో దానం కి పెద్దగా ఊరట కానీ ఉప శమనం కానీ కలిగేది ఉండదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దాంతో ఎందుకైనా మంచిదని ఖైరతాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు అన్నీ సిద్ధం అవుతున్నాయని అంటున్నారు.
మూడు పార్టీల వ్యూహాలు :
ఇదిలా ఉంటే అధికార కాంగ్రెస్ తో పాటు విపక్షంలోని బీఆర్‌ఎస్ కూడా ఖైరతాబాద్ లో గెలిచి తీరాలని పట్టుదలగా ముందుకు సాగుతున్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే గతంలో ఒకసారి ఇక్కడ గెలిచామని అంటోంది. దాంతో తమకు బలం ఉందని బీజేపీ గట్టిగా చెప్పుకుంటోంది. ఈసారి ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు చూస్తోంది. ఇలా మూడు పార్టీలు కలిసి బలమైన పోటీకి సిద్ధం పడుతున్నాయి అంటున్నారు.
హాట్ ఫేవరేట్ సీటు :
ఇక ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు నగరానికి మధ్యలో ఉంది. రాజకీయంగా కీలక స్థానం కావడంతో హాట్ ఫేవరేట్ గా మారింది. దాంతో తమకే ఈ సీటు సొంతం అని మూడు పార్టీలు పావులు కదుపుతున్నాయి. అంతే కాదు ఎవరి బలాలు ఎంత అన్న చర్చ కూడా సాగుఓంది. మూడు పార్టీలకు పట్టు ఉన్న సీటుగా కూడా ఖైరతాబాద్ ని అంతా చూస్తున్నారు. ఇక ఉప ఎన్నికలు అంటూ జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ మరోసారి పోటీ చేస్తారు అని అంటున్నారు. మిగిలిన ఎండు పార్టీలు తమ అభ్యర్ధులను ఖరారు చేసుకోవాల్సి ఉంది. ఇక బీజేపీ నుంచి చూస్తే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అలాగే యువ నాయకుడిగా ఉన్న ఇంద్రసేన్ రెడ్డి కూడా పోటీకి ఆసక్తిని చూపిస్తున్నారని భోగట్టా.
విష్ణు రెడీనా :
ఇక బీఆర్‌ఎస్ విషయానికి వస్తే ప్రముఖ నాయకుడు దివంగత నేత పి జనార్ధన్ రెడ్డి కుమారుడు విష్ణు వర్ధన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఆయనకు ఈ నియోజకవర్గంలో సొంతంగా బలం ఉంది. దానికి బీఆర్‌ఎస్ తోడు అయితే ఈజీగా గెలవచ్చు అన్నది గులాబీదళం అంచనాగా ఉంది అంటున్నారు. ఇక ఖైరతాబాద్ లో నివాసం ఉన్న నాయకుడిగా విష్ణు కనిపిస్తారు. ఆయనతో పాటుగా ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ పేరు కూడా బీఆర్‌ఎస్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన పోటీకి దిగితే బలంగా ఉన్న బీసీ సామాజిక వర్గాల నుంచి మద్దతు దక్కావచ్చు అని అంటున్నారు.
తలసాని వారసుడు :
ఇక మాజీ మంత్రి బీఆర్‌ఎస్‌లో కీలక నేత అయిన తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. తలసాని పట్టుబడితే కచ్చితంగా బీఆర్‌ఎస్ టికెట్ ఆయనకు ఇచ్చే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఇక సాయి కిరణ్ యాదవ్ 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. అలా రాజకీయంగా ఆయన పరిచయమే అని అంటున్నారు. ఇలా మూడు పార్టీల నుంచి అపుడే పోటీకి రంగం సిద్ధం అవుతోంది. అయితే ఖైరతాబాద్ లో ఎవరికి ఎంత బలం ఉంది అంటే వరసగా ఉప ఎన్నికలను గెలుస్తున్న కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉండొచ్చు అని ఆ పార్టీ అంచనా వేస్తోంది. అయితే ఫిరాయింపు అంశంలో జనంలో పెట్టి తాము కచ్చితంగా గెలుస్తామని బీఆర్ఎస్ అంటోంది. బీజేపీ అయితే రెండు పార్టీలను కాదని విజయం సొంతం చేసుకుంటామని చెబుతోంది.
