Begin typing your search above and press return to search.

నేనంటే గిట్టని వాళ్ల పని.. రాజీనామాపై ‘దానం’ సంచలన ప్రకటన

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ రాజీనామా చేయబోతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.

By:  A.N.Kumar   |   5 Oct 2025 6:30 PM IST
నేనంటే గిట్టని వాళ్ల పని.. రాజీనామాపై ‘దానం’ సంచలన ప్రకటన
X

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ రాజీనామా చేయబోతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. సోషల్‌ మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఆయన త్వరలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారన్న వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై స్వయంగా దానం నాగేందర్‌ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

“నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదు. నేనంటే గిట్టని వాళ్లు నా పేరు మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు” అని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా వార్తలు పూర్తిగా అబద్ధమని, దానికి ఎలాంటి వాస్తవం లేదని ఖండించారు.

గత ఎన్నికల్లో దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ నుంచి బీఆర్ఎస్‌ అభ్యర్థిగా గెలుపొందిన విషయం తెలిసిందే. అనంతరం 2024లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ పార్టీ స్పీకర్‌కు ఫిరాయింపు కేసులో ఆధారాలు సమర్పించింది. ఇదే సమయంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారన్న వార్తలు వెలువడటంతో రాజకీయ చర్చలకు కారణమయ్యాయి.

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ షార్ట్‌లిస్టులో దానం నాగేందర్‌ పేరు లేకపోవడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. టికెట్‌ విషయంలో హైకమాండ్‌ పాజిటివ్‌గా మారేందుకు ముందుగా రాజీనామా చేస్తారన్న ప్రచారం వినిపించింది. అయితే ఈ సమస్తాన్ని దానం నాగేందర్‌ ఖండించారు.

“పార్టీ, ప్రజలు నాపై నమ్మకం ఉంచారు. నేను కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నాను. ఎవరు చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మకూడదు” అని స్పష్టం చేశారు.

మొత్తం మీద దానం నాగేందర్‌ రాజీనామా వార్తలకు ఆయన ఇచ్చిన సమాధానంతో ఒక్కసారిగా స్పష్టత వచ్చింది. ప్రస్తుతం రాజీనామా చేసే ఆలోచన లేదని, దుష్ప్రచారానికి తావు ఇవ్వొద్దని దానం స్పష్టం చేశారు.