Begin typing your search above and press return to search.

మీ ఫోన్లో దామిని లైట్నింగ్ యాప్ ఉందా? ఎందుకంటే?

స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. క్షణం విడవకుండా వెంట ఉండే చెలికాడు/చెలికత్తె మనిషికి దొరికేశాడు.

By:  Garuda Media   |   20 Aug 2025 10:09 AM IST
మీ ఫోన్లో దామిని లైట్నింగ్ యాప్ ఉందా? ఎందుకంటే?
X

స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. క్షణం విడవకుండా వెంట ఉండే చెలికాడు/చెలికత్తె మనిషికి దొరికేశాడు. ఎవరితో సంబంధం లేకుండా తమ ప్రపంచంలో మునిగిపోతున్న పరిస్థితి ఇప్పుడు ప్రతి దగ్గరా కనిపిస్తూనే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో బోలెడన్ని మొబైల్ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకొని ఉంటారు. ఇలాంటి వేళ.. మరో కొత్త యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవటమా? అనుకోవచ్చు. కానీ.. నిజ జీవితంలో ఎంతో విలువైన సమాచారాన్ని అందివ్వటమే కాదు.. సేఫ్ గా ఉండేందుకు సాయం చేస్తుందీ దామిని లైట్నింగ్ యాప్.

ఇంతకూ ఈ యాప్ దేనికి పని చేస్తుందన్న ప్రశ్న మీకు కలగొచ్చు. అది సహజం. ఇంతకూ ఈ దామిని లైట్నింగ్ యాప్ ఎందుకంటే.. పిడుగులు పడే వివరాల్ని మొబైల్ ఫోన్ ద్వారా అందించేలా దీన్ని రూపొందించారు. పూణెలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ దీన్ని రూపొందించింది. ఏ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందన్న విషయాన్ని మెసేజ్ ల ద్వారా అలెర్టు చేస్తారు. పిడుగులతో ప్రాణనష్టాన్ని నివారించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు.

పిడుగు ప్రమాదాన్ని అరగంట ముందే అలెర్టు చేసే సాంకేతికత దామిని లైట్నింగ్ యాప్ సొంతం. దేశంలోని వివిధ నగరాల్లో 83 చోట్ల ప్రత్యేకంగా సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఇంతకూ ఈ యాప్ ను ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత.. పేరు.. మొబైల్ నెంబరు.. అడ్రస్.. పిన్ కోడ్ తో రిజిస్టర్చేసుకోవాలి. జీపీఎస్ లొకేషన్ తెలుసుకునేందుకు వీలుగా యాప్ కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

పిడుగు పడే అవకాశం ఉందో లేదో తెలుసుకోవటానికి వీలుగా మూడు రంగుల్లో దీన్ని చూపిస్తారు. ఈ యాప్ వినియోగించే వారున్న ప్రాంతంలో పిడుగు పడే ప్రమాదాన్ని ముందుగా గుర్తించి హెచ్చరించేలా దీన్ని డిజైన్ చేశారు. ఇందులోని మూడు రంగులు (ఎరుపు.. పసుపు.. నీలం రంగుల్లో అలెర్టులు వచ్చేలా డిజైన్ చేశారు. ఎరుపు రంగు అలెర్టు వస్తే.. మీరున్న ప్రాంతంలో మరో ఏడు నిమిషాల్లో పిడుగు పడుతుందన్న అంశాన్ని తెలియజేస్తుంది. అదే పసుపు రంగు అలెర్టు వస్తే.. మీరు ఉండే ప్రాంతంలో మరో పది.. పదిహేను నిమిషాల్లో పిడుగు పడుతుందని చెప్పాలి. అదే నీలం రంగు అలెర్టు వస్తే.. పావు గంట నుంచి 25 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటుంది.

పిడుగు ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి ఎవరికి వారుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వర్షం పడే వేళలో చెట్ట కింద నిలబడకుండా ఉండటం.. అందులోనూ ఎత్తైన చెట్ల కింద అస్సలు నిలుచోకూడదు. పిడుగులు పడే సమయంలో లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతతో విడుదలయ్యే వేడి కారణంగా మనిషిని తాకగానే నేరుగా గుండెపై ప్రభావం పడుతుంది. వర్షం వేళ ఉపయోగించే గొడుగులపై ఇనుప బోల్టులు.. సెల్ ఫోన్లు.. కెమెరాలు దగ్గరగా లేకుండా జాగ్రత్తలు తీసుుకోవాలి. వర్షం పడే వేళలో.. విద్యుత్ తీగల కింద.. ట్రాన్స్ ఫార్మర్ల సమీపంలోనూ ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంటి పరిసరాల్లో కాపర్ ఎర్త్ వైర్ ఏర్పాటుతో పిడుగు పడే ప్రమాదాన్ని నివారించే వీలుంది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో పిడుగు ప్రమాదాన్ని ముందే గుర్తించి.. తప్పించుకునే వీలుంది.మరింక ఆలస్యం ఎందుకు డౌన్ లోడ్ చేసుకోవటానికి?