Begin typing your search above and press return to search.

బాబు మాట‌: రూటు మార్చిన దామ‌చ‌ర్ల ..!

కానీ, ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్సులో దామ‌చ‌ర్ల‌కు ఒకింత అనున‌యంగా దిశానిర్దేశం చేశారు.

By:  Garuda Media   |   9 Oct 2025 1:00 PM IST
బాబు మాట‌:  రూటు మార్చిన దామ‌చ‌ర్ల ..!
X

ఒంగోలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌.. రూటు మార్చారు. గ‌త ఏడాది కాలంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న మారిన తీరు ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలోనే కాదు.. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోనూ చ‌ర్చ‌కు దారితీస్తోంది. నిన్న మొన్న‌టి వ‌రకు.. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారితో ఆయ‌న క‌డు దూరం పాటించారు. దీనికి వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోపాటు.. రాజ‌కీయ ప‌రిస్థితులు కూడా ఉన్నాయి.

అయితే.. ఇలా చేయ‌డం వ‌ల్ల పార్టీకి న‌ష్టం వ‌స్తుంద‌ని.. గ్రూపు రాజ‌కీయాలు పెరుగుతాయ‌ని.. సీఎం చంద్ర‌బాబు సూచ‌న‌లు చేశారు. వాస్త‌వానికి వ్య‌క్తిగ‌త వైరుద్ధ్యాలు మ‌రిచిపోవ‌చ్చు. కానీ, 2019 ఎన్నిక‌ల్లో త‌న వారే త‌న‌కు ఎదురుతిరిగి.. ఓడించార‌న్న బాధ రాజ‌కీయాల్లో నాయ‌కుల‌ను వ‌దిలి పెట్ట‌దు. ఇదే దామ‌చ‌ర్ల ను కూడా కొన్నాళ్లుగా వేధిస్తోంది. తిరిగి వారే.. సొంత పార్టీలోకి వ‌చ్చి.. చ‌క్రం తిప్పుతామంటే.. ఎవ‌రు మాత్రం ఒప్పుకొంటారు? అందుకే.. ఆయ‌న డిస్టెన్స్ పాటించారు.

కానీ, ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్సులో దామ‌చ‌ర్ల‌కు ఒకింత అనున‌యంగా దిశానిర్దేశం చేశారు. ``మీకు మంచి పేరుంది. అంద‌రినీ క‌లుపుకొని పోండి. ఏదైనా వ‌స్తే.. నేను చూసుకుంటా. మీరు మాత్రం మీ ప‌ని మానొద్దు`` అని సీఎం భ‌రోసా ఇచ్చారు. దీంతో దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ స‌హా .. ఆయ న సోద‌రుడు, కార్పొరేష‌న్ చైర్మ‌న్‌.. స‌త్య‌లు రూటు మార్చారు. ఇప్పుడు అంద‌రినీ క‌లుపుకొని పోతున్నారు. రెండు రోజుల కింద‌ట‌.. ప్రారంభించిన ఆటోడ్రైవ‌ర్ల సేవ‌లో.. కార్య‌క్ర‌మంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

అంతేకాదు.. వైసీపీ నుంచి వ‌చ్చి ఎంపీ అయిన‌.. మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి స‌హా.. ఇత‌ర నాయ‌కుల‌తోనూ క‌లివిడిగా వ్య‌వ‌హ‌రించారు. తాను ఆటో న‌డుపుతూ.. వారంద‌రినీ ఎక్కించుకున్నారు. వారితో క‌లిసి టీ పార్టీల‌కూ అటెండ్ అయ్యారు. దీంతో ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీకి త‌లనొప్పిగా ఉన్న గ్రూపు రాజ‌కీయాల‌కు దామ‌చ‌ర్ల దాదాపు చెక్ పెట్టార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదే పంథాను కొన‌సాగిస్తే.. అంద‌రూ క‌లివిడిగా ఉంటే.. వైసీపీకి ఇక‌, చోటు ఉండ‌ద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.