Begin typing your search above and press return to search.

డల్లాస్‌లో కలకలం.. భారతీయ కుటుంబాల ఇళ్లే లక్ష్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్ అతి

రింగ్ కెమెరాలు , సెక్యూరిటీ ఫుటేజీల ద్వారా ఆమె కదలికలను రికార్డ్ చేసిన బాధితులు వాటిని వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తున్నారు.

By:  A.N.Kumar   |   14 May 2026 12:22 PM IST
డల్లాస్‌లో కలకలం.. భారతీయ కుటుంబాల ఇళ్లే లక్ష్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్ అతి
X

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయ సమాజంలో ప్రస్తుతం ఒక వింతైన, ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్ అని చెప్పుకుంటూ అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని.. సంపాదిస్తున్నారని భారతీయులను టార్గెట్ చేస్తూ ఒక గుర్తు తెలియని యువతి భారతీయ కుటుంబాలు ఎక్కువగా నివసించే నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తిరుగుతూ వీడియోలు చేస్తుండడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సరైన గుర్తింపు పత్రాలు చూపకుండా ఇళ్లలోకి ప్రవేశించేందుకు ఆమె ప్రయత్నిస్తుండటంతో ప్రవాస భారతీయులు భయాందోళనలకు గురవుతున్నారు.

అసలేం జరుగుతోంది?

స్థానికులు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. సదరు యువతి డల్లాస్‌లోని భారతీయ ప్రాబల్యం ఉన్న కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతోంది. ఆమె తలుపు తట్టినప్పుడు నివాసితులు పలకరిస్తే తాను ఎందుకు వచ్చింది.. ఏ సంస్థ తరపున వచ్చింది అనే విషయాలపై పొంతన లేని సమాధానాలు చెబుతోంది. కొన్ని సందర్భాల్లో బలవంతంగా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆమె వద్ద ఎటువంటి అధికారిక గుర్తింపు కార్డు లేకపోవడం.. ప్రశ్నించినప్పుడు తప్పించుకునే ధోరణిలో సమాధానం ఇవ్వడం అనుమానాలను మరింత బలపరుస్తోంది.

గోప్యత, భద్రతపై ఆందోళన

అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యక్తిగత గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు లేదా సర్వే సంస్థల సిబ్బంది ఎవరైనా సరే నివాసాలకు వచ్చేటప్పుడు కచ్చితమైన ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. అధికారిక గుర్తింపు కోసం వారు ఏ ఏజెన్సీకి చెందినవారో తెలిపే పత్రాలు ఉండాలి. అవసరమైతే నోటీసులు లేదా అపాయింట్‌మెంట్ ఉండాలి. కానీ ఈ యువతి ప్రవర్తన ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ముఖ్యంగా భారతీయుల ఇళ్లను మాత్రమే ఆమె ఎంచుకోవడం వెనుక ఏదైనా నేరపూరిత కుట్ర ఉందా? లేదా ఇళ్లలోని విలువైన వస్తువులు, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించే ప్రయత్నమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు

రింగ్ కెమెరాలు , సెక్యూరిటీ ఫుటేజీల ద్వారా ఆమె కదలికలను రికార్డ్ చేసిన బాధితులు వాటిని వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తున్నారు. "ఈమె ఎవరో తెలియదు.. మాట్లాడటానికి ప్రయత్నిస్తే తడబడుతోంది, వెంటనే తలుపులు వేసుకోండి" అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పోస్టులపై స్పందిస్తున్న ఇతర నెటిజన్లు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు.

భారతీయ సంఘాల హెచ్చరిక

ఈ ఉదంతంపై డల్లాస్‌లోని వివిధ తెలుగు, భారతీయ సంఘాలు స్పందించాయి. ప్రవాసులు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ పలు సూచనలు చేశాయి. అపరిచితులకు అనుమతి లేదని.. పూర్తి వివరాలు తెలియకుండా ఎవరినీ ఇంట్లోకి రానివ్వకూడదని అంటున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు (911) ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఇంటి ముందు ఉండే సెక్యూరిటీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఇంట్లో పిల్లలు లేదా వృద్ధులు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు తీయవద్దని ముందే హెచ్చరించాలి.

అధికారుల స్పందన కోసం నిరీక్షణ

ఈ ఘటనలపై ఇప్పటికే కొందరు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు యువతి మానసిక స్థితి సరిగా లేక ఇలా చేస్తోందా? లేక ఏదైనా పెద్ద ముఠాలో సభ్యురాలా? అనే కోణంలో దర్యాప్తు జరగాలని కమ్యూనిటీ నాయకులు కోరుతున్నారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు భరోసా కల్పించాలని, ఇలాంటి అపారదర్శక చర్యలపై కఠినంగా వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంఘటన డల్లాస్ భారతీయ సమాజంలో భద్రతపై కొత్త చర్చకు దారితీసింది.