Begin typing your search above and press return to search.

రాజ‌మండ్రి మేయ‌ర్ పీఠం కోసం చిన్న‌మ్మ ప‌ట్టు.. ఫ‌లించేనా.. ?

రాజమహేంద్రవరం(రాజమండ్రి) కార్పొరేషన్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి పక్షాల మధ్య, ముఖ్యంగా స్థానిక ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి(చిన్న‌మ్మ‌) నేతృత్వంలో తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

By:  Garuda Media   |   15 Oct 2026 8:00 PM IST
రాజ‌మండ్రి మేయ‌ర్ పీఠం కోసం చిన్న‌మ్మ ప‌ట్టు.. ఫ‌లించేనా.. ?
X

రాజమహేంద్రవరం(రాజమండ్రి) కార్పొరేషన్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి పక్షాల మధ్య, ముఖ్యంగా స్థానిక ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి(చిన్న‌మ్మ‌) నేతృత్వంలో తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతుండటంతో ఈ సీటుకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే.. రాజమండ్రి మేయర్ స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు కేటాయించడం గ‌మ‌నార్హం.

దీంతో రాజ‌మహేంద్రిలో ఒక్కసారిగా రాజకీయ లెక్కలు మారిపోయాయి. అంతకుముందు జనరల్ కేటగిరీ కింద పోటీ చేయాలని భావించిన బలమైన సామాజిక వర్గాలకు చెందిన ఆశావహులకు ఇది ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఎస్సీ వర్గానికి చెందిన నేతల్లో తమకు అనుకూలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. రాజమండ్రి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పురందేశ్వరి, తన పరిధిలోని ఈ కీలకమైన మేయర్ పీఠాన్ని బీజేపీ ఖాతాలో వేసుకోవాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, తన పట్టును నిలుపుకునేందుకు మేయర్ స్థానం బీజేపీకి దక్కడం ఆమెకు ప్రతిష్టాత్మకంగా మారింది. కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు కూడా రాజమండ్రిలో అత్యంత బలంగా ఉన్నాయి. సాంప్రదాయకంగా రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. కాబట్టి మేయర్ స్థానాన్ని వదులుకోవడానికి స్థానిక టీడీపీ నేతలు అంత సులభంగా అంగీకరించే పరిస్థితి లేదు. మ‌రోవైపు... గోదావరి జిల్లాల్లో జనసేనకు పెరిగిన ఆదరణ రీత్యా వారు కూడా ఈ స్థానం కోసం గట్టిగా పోటీ పడుతున్నారు.

ఇక‌, రాజ‌మండ్రి సీటు ఎవ‌రికి కేటాయిస్తార‌న్న విష‌యం కూటమిలోని అగ్రనేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అధిష్టానం మధ్య జరిగే సీట్ల సర్దుబాటు చర్చలపైనే ఆధారపడి ఉంటుంది. ఎంపీగా పురందేశ్వరికి ఉన్న జాతీయ స్థాయి గుర్తింపు, నియోజకవర్గంలో ఆమె చేస్తున్న ఒత్తిడి కారణంగా ఈ సీటును బీజేపీకి కేటాయించాలని కోరుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మెజారిటీ కార్పొరేటర్ స్థానాలను గెలుచుకునే సత్తా ఉన్న పార్టీకే మేయర్ పీఠం ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.