ఏడేళ్ల తర్వాత డీమార్ట్ కీలక నిర్ణయం.. రూ.1,000 కోట్ల భారీ అప్పు.. వ్యూహం వెనుక అసలు కారణాలివే
ప్రస్తుతం ఇండియన్ రిటైల్ మార్కెట్‌ను జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
By: A.N.Kumar | 29 Aug 2026 4:00 PM ISTభారతీయ రిటైల్ దిగ్గజం డి-మార్ట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ దాదాపు ‘జీరో డెబ్ట్’ రుణ రహిత వ్యూహంతో సక్సెస్‌ఫుల్‌గా నడిచిన ఈ సంస్థ ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఏకంగా రూ.1,000 కోట్ల అప్పు సమీకరించేందుకు సిద్ధమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కు సమర్పించిన ఫైలింగ్‌లో రూ.1,000 కోట్ల విలువైన ‘కమర్షియల్ పేపర్స్’ జారీకి బోర్డు ఆమోదం తెలిపినట్లు కంపెనీ స్పష్టం చేసింది. 2017లో విజయవంతంగా ఐపీవో పూర్తి చేసుకున్న తర్వాత డి-మార్ట్ ఈ స్థాయిలో భారీగా నిధులు సమీకరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
భారీ విస్తరణ దిశగా పటాపంచలు కానున్న వ్యూహాలు
డి-మార్ట్ సేకరించబోయే ఈ రూ.1,000 కోట్ల నిధులను ప్రధానంగా సంస్థ ఫిజికల్ విస్తరణకు ఉపయోగించనుంది. సాధారణంగా ఇతర రిటైల్ స్టోర్లలా కాకుండా డి-మార్ట్ ఎక్కువ శాతం తమ సొంత స్థలాల్లోనే స్టోర్లను నిర్మిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త నగరాల్లో స్థలాల కొనుగోలు, మౌలిక వసతుల కల్పన, కొత్త అవుట్‌లెట్ల ఏర్పాటు కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా టైర్-2, టైర్-3 నగరాలకు సైతం డి-మార్ట్ తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అద్దె భారాన్ని తగ్గించుకునేందుకు సొంతంగా భూములు కొనుగోలు చేసి రీటైల్ స్టోర్లు నిర్మించడానికే ప్రాధాన్యం ఇస్తోంది.
క్విక్ కామర్స్ సవాలు.. డీమార్ట్ రెడీకి కొత్త ఊపిరి
ప్రస్తుతం ఇండియన్ రిటైల్ మార్కెట్‌ను జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. 10 నుంచి 15 నిమిషాల్లోనే నిత్యావసరాలు తలుపు తడుతుండటంతో మెట్రో నగరాల్లో వినియోగదారుల షాపింగ్ శైలి పూర్తిగా మారిపోతోంది.
ఈ తీవ్ర పోటీని తట్టుకునేందుకు డి-మార్ట్ తన ఆన్‌లైన్ విభాగమైన ‘డీమార్ట్ రెడీ’ ని మరింత బలోపేతం చేయాల్సి వస్తోంది. డార్క్ స్టోర్ల ఏర్పాటు.. వేగవంతమైన లాజిస్టిక్స్, ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల నిర్మాణానికి ఈ నిధుల నుంచి గణనీయమైన భాగం కేటాయించే అవకాశం ఉంది.
వ్యాపార వర్గాల్లో ఆసక్తి
తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులను అందిస్తూ 'డిస్కౌంట్ కింగ్'గా పేరుగాంచిన డి-మార్ట్ ఒకవైపు భౌతిక స్టోర్లను పెంచుకుంటూనే మరోవైపు డిజిటల్ రిటైల్‌లో బలమైన ముద్ర వేయాలని చూస్తోంది. రూ.1,000 కోట్ల రుణం తీసుకోవడం ద్వారా సాంప్రదాయ రిటైల్ ప్లేయర్‌గానే కాకుండా ఆధునిక డిజిటల్ కామర్స్ పోటీలోనూ ముందంజలో ఉండాలనేది రాధాకిషన్ దమానీ నేతృత్వంలోని డి-మార్ట్ మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది.
