రెండు పళ్ల మధ్య ఖాళీ కోసం రూ.16.5 కోట్ల బీమా... ఎవరీ భామ..!
ఆరోగ్య బీమా, జీవిత బీమాలు చాలా మందే చేయించుకుంటారు. పల్లెల సంగతి పక్కనపెడితే పట్టణాల్లో మెజారిటీ ప్రజలకు బీమా ఉంటుందని అంటారు.
By: Raja Ch | 1 Aug 2025 8:00 AM ISTఆరోగ్య బీమా, జీవిత బీమాలు చాలా మందే చేయించుకుంటారు. పల్లెల సంగతి పక్కనపెడితే పట్టణాల్లో మెజారిటీ ప్రజలకు బీమా ఉంటుందని అంటారు. ఇక పలువురు సెలబ్రెటీల విషయానికొస్తే.. కాళ్లకు, పిరుదులకు, పళ్లకు కోట్ల రూపాయలకు బీమా చేయించుకుంటారు. ఈ క్రమంలో తన రెండు దంతాల మధ్య గ్యాప్ కు బీమా చేయించుకుందో భామ. ఇది కాస్తా వైరల్ గా మారింది!
అవును... మౌత్ వాష్ బ్రాండ్ లిస్టెరిన్ నిర్వహిస్తోన్న 'వాష్ యువర్ మౌత్' కార్యక్రమానికి ప్రచారకర్తగా ఉన్న బ్రిటిష్ నటి, సింగర్ సింథియా ఎరివో.. నోటి శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెబుతారు. ఇదే సమయంలో... తన నవ్వు, గొంతుకు ఉన్న ప్రత్యేకత కారణంగానే తాను తన వృత్తి, వ్యక్తిగత జీవితంలో రాణిస్తున్నట్లు వెల్లడించారు.
అంతేకాదు... ఆమె వేదిక ఎక్కేముందు ప్రతిసారి బ్రష్ చేసుకొని, మౌత్ వాష్ వాడుతుంటారట. దానివల్ల తనలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని ఆమె చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. తన రెండు దంతాల మధ్య ఉన్న గ్యాప్ ను, తన విలక్షణ నవ్వును, గళాన్ని కాపాడుకునేందుకు బీమా వైపు మొగ్గు చూపినట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే రూ.16.5 కోట్లు ఖర్చు పెట్టి తన నోటికి బీమా చేయించుకున్నారు. ఎంతో ఇష్టమైన తన నవ్వుకోసం ఏకంగా రూ.16.5 కోట్లు ఖర్చుపెట్టారు! ఈమె తన నటన, గాత్రంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్, టోనీవంటి ప్రతిష్ఠాత్మక అవార్డులకు నామినేషన్లు పొంది, వాటిని అందుకున్నారు.
కాగా... గతంలో జెన్నిఫర్ లోపెజ్ తన వీపు భాగాన్ని రూ.200కోట్లకు బీమా చేయించారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో... హైడీ క్లమ్ అనే మోడల్ తన కాళ్ళను $2.2 మిలియన్లకు బీమా చేయించుకున్నట్లు సమాచారం. ఇక కిమ్ కర్దాషియాన్ తన పిరుదులను $21 మిలియన్లకు బీమా చేసుకుంది.
నటి, దర్శకురాలు అమెరికా ఫెర్రెరా తన దంతాలను $10 మిలియన్లకు బీమా చేసింది. ఇదే క్రమంలో... ఫుట్ బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, డేవిడ్ బెక్ హామ్ తమ కాళ్లకు బీమా తీసుకోగా... బ్రిటిష్ సెలబ్రిటీ చెఫ్ గోర్డన్ రామ్ సే తన నాలుకు ఇన్సూరెన్స్ తీసుకోన్నారు.
