Begin typing your search above and press return to search.

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'మురసు' తీవ్ర తుపానుగా మరింత బలపడి ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది.

By:  Tupaki Political Desk   |   2 Nov 2026 1:54 PM IST
నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు
X

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'మురసు' తీవ్ర తుపానుగా మరింత బలపడి ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తుపాను, ప్రస్తుతం నెల్లూరుకు 120 కి.మీ., కావలికి 140 కి.మీ., తిరుపతికి 170 కి.మీ., ఒంగోలుకు 180 కి.మీ., అలాగే బాపట్లకు 200 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తాజా బులిటెన్ లో తెలిపింది. ఈ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా , రాయలసీమ మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

అర్నాబ్ అంత బీభత్సం ఉంటుందా?

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మురసు తుపాను సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య సమయంలో ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు. గత నెలలో కోనసీమ తీరాన్ని అతలాకుతలం చేసిన అర్నాబ్ తుఫాన్ అంత స్థాయిలో ప్రమాదం ఉండకపోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారనే సమచారంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారుల సమన్వయంతో మత్స్యకారుల బోను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తుపాను తీరానికి సమీపిస్తున్న కొద్దీ అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను ముమ్మరం చేశామని, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి సన్నద్ధతతో రంగంలోకి దిగింది. అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కంట్రోల్ రూమ్ ద్వారా శాటిలైట్ సమాచారంతో తుపాను కదలికలను పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, తిరుపతి జిల్లాల్లోని సున్నితమైన ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ముందస్తుగానే మోహరించారు. వర్షాల వల్ల విద్యుత్, మంచినీటి సరఫరా, రోడ్డు రవాణాకు అంతరాయం కలగకుండా సంబంధిత శాఖల సిబ్బందికి తగిన సామగ్రితో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం వాట్సాప్ గవర్నెన్స్ సేవ 'మన మిత్ర' (95523 00009) లేదా టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చని, స్థానిక అధికారుల సూచనలు పాటిస్తూ ప్రజలంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.