బిగ్ అలర్ట్: ఏపీకి 'మొంథా' ముప్పు.. 26 - 29 మధ్య జాగ్రత్త!
బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.
By: Raja Ch | 25 Oct 2025 10:23 AM ISTబంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది శనివారానికి వాయుగుండంగా మారుతుందని, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. సోమవారం ఉదయానికి నైరుతి, పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపాన్ గా మారే అవకాశం ఉందని తెలిపింది!
అవును... రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం నాడు ఏర్పడిన అల్పపీడనం.. శనివారం నాటికి వాయుగుండంగా, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశముందని పేర్కొంది. తర్వాత సోమవారం నాటికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని అంచనా వేసింది. ఇది తుపానుగా మారితే 'మొంథా' గా ఐఎండీ నామకరణం చేయనుంది.
దీని ప్రభావంతో రాబోయే అయిదు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇందులో భాగంగా... శనివారం - బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు.. ఆదివారం - గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇదే సమయంలో.. కాకినాడ, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు, వైఎస్సార్ కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఇక.. సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది! ఈ లెక్కన చూసుకుంటే.. ఈ నెల 26 నుచి 29 వరకూ ఆ నాలుగు రోజులూ మరింత కీలకమన్నమాట.
'మొంథా' అంటే...?:
ఈ వాయుగుండం తుపానుగా మారితే 'మొంథా' గా ఐఎండీ నామకరణం చేయనుండగా.. ఈ పేరును థాయిలాండ్ సూచించిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 'మోంథా' అంటే థాయ్ భాషలో 'సువాసన వెదజల్లే పుష్పం' అని అర్థం. ఈ తుపాన్ 28 లేదా 29వ తేదీల్లో కాకినాడ, ఒంగోలు మధ్యలో తీరం దాటే సూచనలున్నాయని.. 26వ తేదీకి దీనిపై స్పష్టత వస్తుందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
