Begin typing your search above and press return to search.

వణికిస్తోన్న మొంథా.. కీలక అప్ డేట్స్ ఇవే!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంథా తుపానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

By:  Raja Ch   |   27 Oct 2025 1:06 PM IST
వణికిస్తోన్న మొంథా.. కీలక అప్  డేట్స్  ఇవే!
X

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంథా తుపానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా... ఇది నైరుతి-ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ. వేగంతో కదిలింది. ఈ క్రమంలో... మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

అవును... దూసుకొస్తున్న మొంథా తుపాను వణికిస్తోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 600 కి.మీ. దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 570 కి.మీ. దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 520 కి.మీ. దూరంలో, పోర్టుబ్లెయిర్‌ కు పశ్చిమంగా 750 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాను.. కాకినాడ సమీపంలో మంగళవారం తీరం దాటే అవకాశం ఉంది.

ప్రభుత్వం ముందస్తు చర్యలు!:

మెంథా తుపాను నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. ఈ క్రమంలో ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.19 కోట్లు విడుదల చేసింది. ఎస్డీఆర్‌ఎఫ్‌, ఏపీఎస్‌డీఎంఏ కేంద్రాలు, 16 శాటిలైట్‌ ఫోన్లు ఏర్పాటు చేశారు. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుపాను షెల్టర్లు ఏర్పాటు చేశారు. సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు.

స్కూల్స్ కి సెలవు, అధికారులకు నో సెలవు!:

తుపాను నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, అనకాపల్లి జిల్లాల్లో విద్యాసంస్థలకు బుదవారం వరకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడపలో విద్యా సంస్థలకు రేపటి వరకు సెలవులు ప్రకటించారు. ఇదే క్రమంలో... నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. మరోవైపు అధికారులకు సెలవులు రద్దు చేశారు.

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రెడ్‌ అలర్ట్‌!:

మొంథా తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా... ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు కురుస్తున్నాయి. కాకినాడలో ఈ ఉదయం చిరుజల్లులతో మొదలైన వర్షం.. ఉదయం 10 గంటల తర్వాత భారీ వర్షంగా మారింది.

ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... మంగళవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో... తీర ప్రాంత జిల్లాల్లో అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు..!:

కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటుతుందనే హెచ్చరికల నేపథ్యంలో శనివారం నుంచే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో... యాంకరేజ్‌ పోర్టుతో పాటు, కాకినాడ డీప్‌ సీ పోర్టును మొత్తం ఖాళీ చేశారు. ఎరువులు, పంచదార, బొగ్గు, గ్రానైట్, వంట నూనె, బియ్యం నిల్వలతో ఉన్న 15 నౌకలను సముద్రంలోనే సురక్షిత ప్రాంతానికి తరలించారు.

విద్యుత్‌ శాఖ అప్రమత్తం!:

మొంథా తుపాను నేపథ్యంలో విద్యుత్‌ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి సోమవారం నుంచి మూడు రోజులపాటు సెలవులు రద్దు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. తుపాను ప్రభావంతో విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తితే యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ సమస్యలపై టోల్‌ ఫ్రీ నం-1912కు సమాచారం అందించాలని పేర్కొన్నారు.