Begin typing your search above and press return to search.

అమరావతిని దెబ్బకొట్టిన ‘మెంథా’!

మెంథా తుఫాన్ ఏపీని భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అతిభయంకర తుఫాన్ కోస్తాపై విరుచుకుపడనుందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

By:  Tupaki Political Desk   |   27 Oct 2025 11:09 AM IST
అమరావతిని దెబ్బకొట్టిన ‘మెంథా’!
X

మెంథా తుఫాన్ ఏపీని భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అతిభయంకర తుఫాన్ కోస్తాపై విరుచుకుపడనుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రభుత్వం కూడా హైఅలర్డ్ ప్రకటించింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక కంట్రోల్ రూములను ఏర్పాటు చేయడంతోపాటు స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం కూడా పలు ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేస్తోంది. ఈ క్రమంలోనే 28వ తేదీన అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జాతీయ బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది.

అమరావతి 2.0 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా మే నెలలో పనులను పునఃప్రారంభించిన తర్వాత నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో సీఆర్డీఏ పరిపాలన భవనం నిర్మాణం పూర్తయి ప్రారంభమైంది. మరోవైపు హోటళ్లు, విద్యాసంస్థల పనులు మొదలయ్యాయి. రోడ్లు, గ్రావిటీ కెనాల్స్, డ్రైనేజీల నిర్మాణ పనులు విరామం లేకుండా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమరావతిలో 12 జాతీయ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాలు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఈ నెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించారు.

అయితే తుఫాన్ కారణంగా శంకుస్థాపన కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2014-19 మధ్య కాలంలోనే 12 జాతీయ బ్యాంకులకు రాజధాని అమరావతిలో భూములు కేటాయించారు. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం వద్ద బ్యాంకులు అన్నింటికి పక్కపక్కనే భూములిచ్చారు. చంద్రబాబు 3.0లో భవన నిర్మాణాలకు ముందుకొచ్చిన బ్యాంకులు.. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత వెనక్కి తగ్గాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేయడంతో 12 జాతీయ బ్యాంకులు కూడా భూములను స్వాధీనం చేసుకోలేకపోయాయి.

ఇక గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకులతో సంప్రదింపులు మళ్లీ మొదలయ్యాయి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణంపై శ్రద్ధ తీసుకోవడంతో జాతీయ బ్యాంకుల యాజమాన్యాలు అన్నీ ఒకేసారి శంకుస్థాపనకు నిర్ణయించాయి. అయితే మెంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేసింది. రాజధాని ప్రాంతంలో బ్యాంకులు అన్నీ ఒకేచోట నిర్మించనుండటం వల్ల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని అంటున్నారు.

అమరావతిలో నిర్మాణం జరగనున్న బ్యాంకుల్లో ఎస్బీఐకి 3 ఎకరాలు కేటాయించారు. ఇందులో 14 అంతస్థుల్లో ఎస్బీఐ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించనుంది. అదేవిధంగా కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉద్దండరాయుని పాలెంలో ప్రధాన కార్యాలయాలను నిర్మించనున్నాయి.