ఆది, సోమవారాల్లో దిత్వా విధ్వంసం.. ఏపీ సర్కారు హైఅలర్ట్!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుఫాను కారణంగా ఆది, సోమవారాల్లో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
By: Tupaki Political Desk | 29 Nov 2025 7:54 PM ISTనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుఫాను కారణంగా ఆది, సోమవారాల్లో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం శ్రీలంక తీరంలోని కారైకల్ ప్రాంతానికి 220 కి.మీలు, పుదుచ్చేరికి 330 కి.మీ, చెన్నైకి 430 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. ఇది గంటకు 7 కి.మీ వేగంతో కదులుతోందని, ఆదివారం తెల్లవారుజామునకు తీవ్రవాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
దిత్వా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. తుఫాను హెచ్చరిల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాను తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించాలన్నారు.
తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు కిందిస్థాయి అధికారులకు, ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్‌లను 24/7 కొనసాగించాలని ఆదేశించారు. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రందించాలని తెలిపారు.
శిథిలావస్థలో ఉన్న ఇళ్ళల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. విరిగిన చెట్లు తొలగించడం , విద్యుత్తు అంతరాయం జరిగితే పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా ఏర్పాటు చేయాలని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నపుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోంమంత్రి సూచనలు చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బలమైన ఈదురుగాలుల వీచేప్పుడు చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని ప్రజలు హోంమంత్రి అనిత కీలక సూచనలు చేశారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కూడా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను కారణంగా వచ్చే మంగళవారం వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎస్ అప్రమత్తం చేశారు. విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజిఎస్ ద్వారా తుఫాను సమాచారాన్ని ఎస్ఎంఎస్ లు ద్వారా తెలియజేయాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని ధాన్యం తడవకుండా చర్యలు తీసుకునేలా రైతులను అప్రమత్తం చేయాలన్నారు.
