ఆర్నాబ్ తో పెను ముప్పు...ఈ రాత్రి గడిస్తే చాలు !
కోస్తా ఆంధ్రా పైన భారీ తుఫాన్ పడగ విప్పి మరీ ఆర్నాబ్ విరుచుకుపడుతోంది.
By: Satya P | 27 Oct 2026 7:58 PM ISTకోస్తా ఆంధ్రా పైన భారీ తుఫాన్ పడగ విప్పి మరీ ఆర్నాబ్ విరుచుకుపడుతోంది. అనూహ్యంగా ఒక రోజు రోజంతా ఆంధ్రా తీరంపై అతి పెద్ద తుఫాన్ కొనసాగడం అంటే ఇటీవల కాలంలో ఎక్కడా చూడని పరిణామంగా చెబుతున్నారు. కోస్తాలోని మొత్తం ఏడు ఉమ్మడి జిల్లాలూ ఆర్నాబ్ తుఫాన్ ప్రభావానికి పెద్ద ఎత్తున గురి అవుతున్నాయి. ఒక వైపు భయంకరమైన ఈదురుగాలులు, మరో వైపు అనేక జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఆర్నాబ్ తన విశ్వరూపం చూపిస్తోంది. ఆర్నాబ్ ఎప్పటికప్పుడు తన దిశను మార్చుకుంటూ ముందుకు సాగడంతో అది ఎక్కడ తీరాన్ని తాకుతుంది అన్నది అయితే టెన్షన్ పెడుతోంది.
కోనసీమకు డేంజర్ :
ఇదిలా ఉంటే గంటకు పాతిక కిలోమీటర్ల వేగంతో తీరం వైపుగా దూసుకుని వస్తున్న ఆర్నాబ్ ఎక్కడ ల్యాండ్ ఫాల్ అవుతుంది అన్నదే ఇపుడు అంతా అందోళనగా గమనిస్తున్నారు. ఇక ఆర్నాబ్ మొదట ఈ నెల 28వ తేదీ బుధవారం ఉదయం పదకొండు గంటల మధ్య తీరాన్ని తాకుతుందని అనుకున్నారు. అయితే అది కాస్తా బుధవారం ఉదయానికి అని కూడా ఆర్బాబ్ దూకుడుతో అంచనా కట్టారు. ఇపుడు మరింత ముందుగానే ఆర్నాబ్ తీరాన్ని తాకే సూచనలు ఉన్నాయని భావిస్తున్నారు. దాంతో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆర్నాబ్ తీరాన్ని దాటవచ్చు అని అంటున్నారు. కోనసీమ ప్రాంతంలో అమలాపురం అంతర్వేది వద్ద ఆర్నాబ్ తీరాన్ని దాటుతుందని తాజా అంచనాలుగా ఉన్నాయని తెలుస్తోంది.
ఊహించిన దాని కంటే :
ఇదిలా ఉంటే ఆర్నాబ్ తుఫాన్ భారీ ఎత్తున విద్వంశం సృష్టిస్తోంది. ఊహించిన అంచనాల కంటే కూడా దాని ప్రభావం ఉందని అంటున్నారు. తాజా ఉపగ్రహ ట్రాక్ మ్యాప్ వాతావరణ అంచనాల ప్రకారం చూస్తే కనుక ఆర్నాబ్ తుఫాను గమనంలో వేగం అధికంగా పెరిగింది అంటున్నారు. దాంతోనే మొదట వేసుకున్న అంచనాలు, అలాగే అనుకున్న సమయం కంటే ముందే మంగళవారం అర్ధరాత్రి నాటికే ఈ భారీ తుఫాన్ తీరాన్ని తాకనుందని అంటున్నారు. దాంతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్ర ప్రాంతం వైపు తుఫాను కన్ను నేరుగా దూసుకొస్తోందని చెబుతున్నారు.
తీరాన్ని తాకే సమయంలో :
ఇక ఏ తుఫాన్ అయినా తీరాన్ని దాటే సమయంలో భారీ విద్వంశం ఉంటుంది. ఆర్నాబ్ అయితే ప్రళయ భయంకరంగా విరుచుకుపడుతోంది. అంచనాలకు అందని తీరులో దాని ప్రభావం ఉంది అని అంటున్నారు. ఈ క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది అమలాపురం సమీప తీర ప్రాంతాల మధ్య ఆర్నాబ్ తుఫాను నేరుగా తీరం దాటనుందని అంటున్నారు. ఇలా తీరాన్ని తాకే సమయంలో భీకరమైన పెను గాలులతో పాటు ఊహించని తీవ్రత ఉంటుందని అటున్నారు. ఇక ఆర్నాబ్ తుఫాన్ తీరం దాటే సమయంలో నిరంతరాయంగా గంటకు 140 నుండి 180 కిలోమీటర్ల వేగంతో పెను విధ్వంశక గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే కనుక తీవ్రత గరిష్ట స్థాయికి చేరితే మాత్రం ఈదురుగాలులు ఏకంగా గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని తాకే ప్రమాదం సైతం పొంచి ఉందని అంటున్నారు.
భారీగానే విధ్వంశం :
ఇక ఆర్నాబ్ భారీ ఎత్తున విరుచుకుపడుతున్న నేపధ్యాన్ని చూసినపుడు పెను గాలుల తీవ్రత వల్ల చెట్లు మొదళ్లలో సహా కూలిపోవడం జరుగుతుందని అంటున్నారు. విద్యుత్ స్తంభాలు కమ్యూనికేషన్ టవర్లు నేలమట్టం కావడంతో పాటు రేకులు పైకప్పులు ఎగిరిపోయే తీవ్ర ముప్పు ఉందని చెబుతున్నారు. ఇక ఈ భారీ తుఫాను ప్రయాణ మార్గం చూస్తే మ్యాప్ ట్రాక్ ప్రకారం అంతర్వేది వద్ద తీరం దాటిన తర్వాత ఇది ఉత్తర దిశగా పయనిస్తుంది. దాంతో అంతర్వేది, అమలాపురం, కొత్తపేట, మండపేట, రాజమహేంద్రవరం, పోలవరం మార్గంలో తుఫాను తీవ్రత మరింతగా కొనసాగనుంది అని అంటున్నారు. అలాగే యానాం, కాకినాడ, పిఠాపురం, ఏలేశ్వరం, భీమవరం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో కూడా పెనుగాలులతో కూడిన కుండపోత వర్షంతో ఆర్నాబ్ తన ప్రతాపం చూపించనుంది.
