పొరపాటున తప్పుడు ఏపీకే ఫైల్స్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే?
ఎప్పుడు ఏ వైపు నుంచి సైబర్ నేరస్తులు పంజా విసురుతారు? అన్నది ఇప్పుడో సవాలుగా మారింది.
By: Garuda Media | 24 Nov 2025 11:00 AM ISTఎప్పుడు ఏ వైపు నుంచి సైబర్ నేరస్తులు పంజా విసురుతారు? అన్నది ఇప్పుడో సవాలుగా మారింది. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. ఏదో ఒక టైంలో జరిగే చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చే పరిస్థితి. ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు ఏం చేయాలన్న అంశంపై అవగాహన పెంచుకుంటే.. తప్పుతో జరిగే నష్టాన్ని తప్పించుకునే వీలుంది. సైబర్ నేరస్తులు కొత్త ఎత్తుగడలతో ఎప్పటికప్పుడు కొత్త పద్దతుల్లో ఏపీకే ఫైల్స్ పంపటం.. తెలీక వాటి మీద క్లిక్ చేసినంతనే.. సదరు ఫోన్ హ్యాక్ అయి.. నేరస్తుల కంట్రోల్ లోకి వెళ్లిపోవటం తెలిసిందే.
ఇలాంటి వేళ.. వారి నుంచి తప్పించుకోవటానికి ఏం చేయాలి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తప్పుడు ఏపీకే ఫైల్స్ ను పొరపాటున డౌన్ లోడ్ చేసుకున్నంతనే ఏం చేయాలన్న దానిపై సైబర్ సెక్యూరిటీ నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. సైబర్ నేరస్తుల పంపే మోసపూరిత ఏపీకే ఫైల్ ను క్లిక్ చేసినంతనే డౌన్ లోడ్ షురూ అవుతుందన్న విషయం తెలిసిందే. దాదాపుగా ఏపీకే ఫైల్స్ ను టచ్ చేయకూడదు. ఒకవేళ.. టచ్ చేసి ఉంటే.. యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. ఇందుకు ఏం చేయాలంటే..
- ఏపీకే ఫైల్ ఇన్ స్టాల్ చేసి ఉంటే వెంటనే ఇంటర్నెట్ డేటాను ఆఫ్ చేయాలి. వైఫై ను డిసేబుల్ చేయాలి.
- సెట్టింగ్స్ లోని యాప్స్ లోకి వెళ్లి సదరు ఏపీకే యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసుకోవాలి.
- యాంటీ వైరస్ తో ఫోన్ ను ఫుల్ స్కాన్ చేయాలి.
- బ్యాంకింగ్ యాప్ లు.. సోషల్ మీడియా అకౌంట్లు.. ఈమొయిల్ అకౌంట్ పాస్ వర్డులను వెంటనే మార్చాలి. ఇందుకోసం ఫోన్ కు ప్రత్యామ్నాయ పద్దతుల్ని అనుసరించాలి.
- మెసేజ్ లు.. కాల్ లాగ్.. బ్యాంక్ లావాదేవీలు ఈ మొయిల్ లాగిన్లలో అనుమానాస్పద యాక్టివిటీ ఉందా? అన్నది చెక్ చేసుకోవాలి.
- ఒకవేళ మాల్ వేర్ యాప్ అన్ ఇన్ స్టాల్ కాకుంటే.. ఫోన్ ను సేఫ్ మోడ్ లో రీస్టార్ట్ చేసి అన్ ఇన్ స్టాల్ చేయాలి.
- ఫోన్ లో ఇంకా అనుమానాస్పద యాక్టివిటీ కనిపిస్తే డేటా బ్యాకప్ తీసుకొని ఫ్యాక్టరీ రీసెట్ చేయటం మంచిది.
- ఇలా ఉన్న సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటూ.. బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేయాలి. 1930కు ఫోన్ చేసి కంప్లైంట్ చేయాలి.
