టీడీపీ ఎంపీకి టోకరా.. 10 కోట్లు డిమాండ్.. సీన్ కట్ చేస్తే!
ఆన్‌లైన్ మోసాలు.. పెరుగుతున్నాయి. వ్యక్తులతో తేడా లేకుండా.. అనేక మందిని సైబర్ ముఠా నేరస్తులు బెదిరిస్తున్నారు. డిజిటల్ అరెస్టులు కూడా చేస్తున్నారు.
By: Garuda Media | 15 Jan 2026 7:00 AM ISTఆన్‌లైన్ మోసాలు.. పెరుగుతున్నాయి. వ్యక్తులతో తేడా లేకుండా.. అనేక మందిని సైబర్ ముఠా నేరస్తులు బెదిరిస్తున్నారు. డిజిటల్ అరెస్టులు కూడా చేస్తున్నారు. ఇలానే టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తండ్రి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ ను కూడా.. కొన్నాళ్ల కిందట సైబర్ నేరస్తులు మోసం చేశారు. ఈ కేసును విచారిస్తున్న సమయంలోనే మరో ఉదంతం కూడా చోటు చేసుకుంది. తాను ఆర్‌టీఐ కార్యకర్తనంటూ.. పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి.. ఏకంగా ఏంపీని బెదిరించి.. ఆయనకు టోకరా వేసేందుకు ప్రయత్నించాడు.
మీరు అక్రమంగా సంపాయించారని.. ఆ ఆస్తుల చిట్టాను బహిరంగ పరుస్తానని బెదిరించిన సదరు వ్యక్తి ఏకంగా 10 కోట్ల రూపాయలను డిమాండ్ చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు జైలు పాలయ్యాడు. మహారాష్ట్రకు చెందిన రిషాంత్ వాడ్కే అనే 32 ఏళ్ల వ్యక్తి.. తొలుత ఆన్‌లైన్‌లో మోసం చేశాడు. సుధాకర్ యాదవ్ ఖాతా నుంచి 70 వేల రూపాయలు దోచుకున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రిషాంత్ నుంచి ఏకంగా ఎంపీకి ఈమెయిల్ వచ్చింది.
దీనిలో మీ ఆస్తులను బహిరంగ పరుస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలోనే 10 కోట్ల రూపాయ లు డిమాండ్ చేశాడు. దీంతో ఎంపీ తొలుత బెదిరినా.. తర్వాత.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అతి కష్టం మీద కడప పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఎంపీ పుట్టా మహేష్ పేర్కొన్న ఆస్తుల వివరాలను ఆధారంగా చేసుకుని రిషాంత్ ఈ బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
అంతేకాదు.. గతంలో ఒకసారి రిషాంత్ ఏకంగా మైదుకూరుకు వచ్చి.. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ పీఏను బెదిరించినట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి నిందితుడిని జైలుకు తరలించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
