సైబర్ క్రిమినల్స్ కొత్త ఎత్తుగడ.. పిల్లలే టార్గెట్
ఇన్నాళ్లు పెద్దవాళ్లను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు చిన్నపిల్లలను అస్త్రంగా వాడుతున్నారు. ` మీ పిల్లలు పో*ర్న్ వీడియోలు చూశారు. మాకు కంప్లైంట్ వచ్చింది. మీ ఫోన్ నెంబర్, ఐపీ అడ్రస్ మా వద్ద ఉంది.
By: A.N.Kumar | 25 Jan 2026 8:00 PM ISTసైబర్ నేరగాళ్లు నిత్యం అప్ డేట్ అవుతూ ఉంటారు. ఒకసారి వాడిన వ్యూహాన్ని మరోసారి వాడరు. నిత్యం ఏదో ఒక కొత్త పద్ధతిలో ప్రజలను బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారి వలకు కొందరు చిక్కుతారు. మోసపోతారు కూడా. సైబర్ నేరగాళ్లు ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుంటారు. మొదట డబ్బును ఆశజూపుతారు. మనిషికున్న గ్యాంబ్లింగ్ నేచర్ సులువుగా వారి వలలో చిక్కేలా చేస్తుంది. తీరా మోసం జరిగాక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తారు. మోసపోయిన వారిని చూసి కొందరు జాగ్రత్తపడతారు. అయినప్పటికీ మోసపోవడానికి మరికొందరు సిద్ధంగా ఎల్లప్పుడూ ఉంటారు. మనిషి ఇంకో బలహీనత పోర్న్. పోర్న్ వీడియోల ద్వారా లేదా అందమైన అమ్మాయిల ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజల్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తారు. డబ్బుకు లొంగని కొందరు. అమ్మాయిలను చూడగానే నిజమని నమ్మి బుట్టలో పడిపోతారు. తీరా చూస్తే మోసం అని అర్థమవుతుంది. అటు ఫిర్యాదు చేయలేరు. జరిగిన నష్టాన్ని దిగమింగుకోనులేరు.
పిల్లలు.. పో*ర్న్ వీడియోలు.
ఇన్నాళ్లు పెద్దవాళ్లను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు చిన్నపిల్లలను అస్త్రంగా వాడుతున్నారు. ` మీ పిల్లలు పో*ర్న్ వీడియోలు చూశారు. మాకు కంప్లైంట్ వచ్చింది. మీ ఫోన్ నెంబర్, ఐపీ అడ్రస్ మా వద్ద ఉంది. మేం అడిగిన డబ్బు ఇవ్వకపోతే కంప్లైంట్ ఫైల్ చేస్తాం ` అంటూ దేశవ్యాప్తంగా ఈమెయిల్స్ పంపినట్టు తెలుస్తోంది. ఆ ఈమెయిల్ లోని కేంద్ర హోంశాఖ, ఇంటెలిజెన్స్ అధికారులు, కస్టమ్స్ అధికారుల ఫోన్ నెంబర్లు, కేసు సెక్షన్లు చూసి భయపడి మోసపోవద్దంటూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఏ మాత్రం భయపడినా సైబర్ క్రిమినల్స్ సాంతం దోచేయడానికి ప్రయత్నిస్తారని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి ఎలాంటి ఈమెయిల్స్ పంపలేదని స్పష్టం చేశారు. అధికారుల సూచనలు పాటించకపోతే సైబర్ వలలో చిక్కుకుంటారని అధికారులు ప్రజలకు సూచించారు.
ఎలా ఎదుర్కోవాలి..
సైబర్ నేరగాళ్లు నిత్యం ఏదో ఒక విధంగా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రజలు వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చంటూ ఆశజూపుతారు. స్టాక్ మార్కెట్లో సంపాదించవచ్చంటూ మాయ చేస్తారు. బిట్ కాయిన్ పేరుతో ముగ్గులోకి దింపాలని చూస్తారు. ఇవన్నీ కుదరకపోతే అమ్మాయిల పేరుతో, అమ్మాయిల ద్వారా వల పన్నుతారు. వీటన్నింటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. అనుమానం వచ్చిన వెంటనే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. అధికారుల పేరుతో కూడా సైబర్ మోసగాళ్లు మోసానికి పాల్పడతారని వారిపట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వాట్సాప్ లో ఏపీకే ఫైల్స్ పంపు మీ డేటా దోచేయడానికి ప్రయత్నిస్తారు. వెబ్సైట్ల ద్వారా డేటా లాగాలని ప్రయత్నిస్తారు. ఎప్పటికప్పడు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా మోసగాళ్ల బారినపడకుండా ఉండవచ్చని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
