Begin typing your search above and press return to search.

ఎక్కి ఎక్కి ఏడవండి...బాగుంది కదూ !

ఏడుపుగొట్టు వాడు అంటారు. అది తిట్టుగా వాడుతారు. ఎందుకురా ఏడుస్తావ్ అని ఎగతాళీ చేస్తారు, ఎద్దేవా చేస్తారు.

By:  Satya P   |   7 Aug 2025 1:00 AM IST
ఎక్కి ఎక్కి ఏడవండి...బాగుంది కదూ !
X

ఏడుపుగొట్టు వాడు అంటారు. అది తిట్టుగా వాడుతారు. ఎందుకురా ఏడుస్తావ్ అని ఎగతాళీ చేస్తారు, ఎద్దేవా చేస్తారు. కానీ ఎక్కి ఎక్కి ఏడిస్తే కలిగే లాభాలు ఎంతమందికి తెలుసు. అసలు ఎడిస్తే ఎంత ఆరోగ్యమో తెలిస్తే ఎవరూ ఏడవకుండా ఉండరు అంటారు మానసిక ఆరోగ్య నిపుణులు. నవ్వడం ఒక రోగం నవ్వకపోవడం ఒక రోగం అని సామెత తెలుగులో ఉంది. అలాగే ఏడవకపోవడం కూడా ఒక రోగం అనేది ముందు ముందు రాబోయే సామెత అని అంతా గుర్తెరగాలి. ఏడుపు ఒక దివ్య ఔషధం. మానవ శరీరంలో అన్ని భావోద్వేగాలు నిక్షిప్తం అయి ఉంటాయి. వాటిలో ఏ ఒక్కటిని అయినా అదిమి పట్టినా లేక వాటిని పట్టించుకోలేకపోయినా మానసిక శారీరక అనారోగ్యం తప్పకుండా వచ్చి తీరుతుందందని నిపుణులు అంటున్నారు.

ఏడిచేందుకు ఒక క్లబ్ :

అవునా నిజమేనా అనుకోవద్దు. అక్షరాల నిజం. దీని పేరు క్రయింగ్ క్లబ్. ఇది ముంబైలో తాజాగా ఏర్పాటు అయింది. ఇది ఒక వినూత్నమైన మానసిక ఆరోగ్య వేదిక అని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈ క్లబ్ లో చరిక వారు అంతా గుక్క పట్టి ఏడుస్తారు అని అంటున్నారు. అలా ఏడిచేందుకు ఇది ఒక సురక్షితమైన వాతావరణంగా భావించి ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజలు తమ భావోద్వేగాలను బాధలను ఏడవటం ద్వరా బయటపెట్టుకుంటారు. తద్వారా వారిలో ఒత్తిడి తగ్గుతుంది. అది మానసిక ఆరోగ్యానికి ఎంతో కీలకమని నిపుణులు చెబుతున్నారు.

ఏడిస్తే బలహీనత కాదు :

నవ్వే వాడు ధైర్యవంతుడూ కాదు ఏడిచేవాడు పిరికివాడు అంతకంటే కాదు అని నిపుణులు చెబుతున్నారు. మనసారా నవ్వాల్సిన చోట నవ్వాలి. అలాగే ఏడవాల్సిన చోట ఏడవాలి. అలా ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే అంతగా ఆరోగ్యం మన చేతులలో ఉంటుంది అని చెబుతున్నారు. ఏడవడం అన్నది సిగ్గు పడేది కాదు తప్పు అంతకంటే కాదు అది సహజాతిసహజమైన ప్రక్రియగా మానసిక నిపుణులు చెబుతారు. నవ్వు వచ్చినపుడు నవ్వడం ఏడుపు వచ్చినపుడు ఏడవడం చేసేవారే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లుగా చెబుతారు.

గంభీరంగా ఉంటే :

చాలా మద్ని ఏడవమేంటి నాన్సెన్స్ అనుకుంటారు. బయటకు ఎంతో గంభీరంగా కనిపిస్తారు. తమ సమస్యలను కనీసం సన్నిహితులతో కూడా పంచుకోరు. అంతా మనసులో పెట్టుకుంటారు. అలా ఒత్తిడి పెరిగి అది చివరికి శరీర ఆరొగ్యం మీద కూడా విపరీతంగా ప్రభావం చేస్తుందని నిపుణులు చెబుతారు. ఉదాహరణకు తీసుకుంటే మన సమాజంలో పురుషులు బయటకు తమ భావోద్వేగాలను ఎక్కువగా బయటపెట్టుకోరు. అదే ఎక్కువ శాతం మహిళలు సహజ సిద్ధంగా వచ్చే భావోద్వేగాల ప్రకారం నడచుకుంటారు. వారు తన బాధలను పంచుకుంటారు ఏడుపు వస్తే ఏడుస్తారు. తద్వారా తన ఒత్తిడిని తగ్గించుకుంటారు. అందుకే వారికి గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా రావు అని అంటారు. అదే మగవారిలో అధిక శాతం మాత్రం బ్యాంకులో నగదు మాదిరిగా తమ భావాలను ఉద్వేగాలను దాచుకుంటారు. ఫలితంగా వారే ఎక్కువగా ఒత్తిడికి లోను అవుతారు అని అంటారు.

ఏడిస్తేనే భోగం :

మొత్తం మీద పక్కా క్లారిటీగా బల్లగుద్ది మరీ చెప్పేది ఏమిటి అంటే తనివి తీరా ఏడవండి, ఏడిస్తేనే ఒక భోగం. రేపటికి అదే ఆరోగ్యానికి ఇంధనం అని. ఇక ముంబైలో పెట్టిన క్రైయింగ్ క్లబ్ లాంటివి రానున్న కాలంలో దేశంలో చాలా చోట్ల కావాల్సి వస్తుందేమో అని అంటున్నారు. ఎందుకంటే ఈ రోజులలో ఎదుటి వారి బాధలు చెప్పుకోవాలనుకున్నా పంచుకోవడానికి ఎవరూ లేకుండా పోతున్నారు. మరి ఆ బాధ లా వడ్డీలు పెడుతూ మనసు బరువుని పెంచేస్తే ఏదో రోజున అది బద్ధలు అయిపోతుంది. అందుకే క్రయింగ్ క్లబ్ కాన్సెప్ట్ ఆసక్తిని వర్తమాన అవసరాన్ని చాటి చెబుతోంది. ఈ క్లబ్ ల అవసరం లేకుండానే ఎవరికి వారుగా కుళాయి విప్పితే ఆ మనిషి జీవితంలో పన్నీరే అని అంటున్నారు నిపుణులు. సో ఏడవండి బాగా ఏడవండి. ఎదుటివారు మిమ్మల్ని చూసి ఏమనుకున్నా ఫర్వాలేదు. ఏడవండి. అదే అభ్యాసంగా చేసుకోండి.