ఆయిల్ మంటలకు బ్రేక్.. భారత ఆర్థిక ప్రగతికి సరికొత్త బాట
అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా మండితే ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం సహజం.
By: A.N.Kumar | 1 Oct 2026 10:54 PM ISTచమురు మంటలు ఆర్థిక వ్యవస్థను దహించి వేస్తాయా? క్రూడ్ సెగకు రూపాయి విలవిలలాడి, మీ ఈఎంఐ ల భారం మరింత పెరగబోతోందా? అంతర్జాతీయ మార్కెట్లలో రోజురోజుకూ ఎగసిపడుతున్న చమురు ధరలు.. దేశీయంగా ప్రగతి రథ చక్రాలను అడ్డుకుంటాయనే భయాలు మళ్లీ మొదలయ్యాయి. వడ్డీ రేట్ల పెంపు తప్పదంటూ వస్తున్న వార్తల నడుమ.. భారత ఆర్థిక వ్యవస్థ అసలు మునిగిపోతుందా లేక ఈ సంక్షోభాన్ని సైతం సవాలుగా తీసుకుని నిలబడుతుందా? ప్రముఖ గ్లోబల్ మనీ మేనేజర్ కేన్ ఫిషర్ చేసిన దిమ్మతిరిగే విశ్లేషణ చేసింది. అది చర్చనీయాంశమైంది.
అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా మండితే ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం సహజం. తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడే భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. ముడి చమురు భారం దిగుమతి బిల్లును పెంచి.. రూపాయి విలువను తగ్గించి.. ద్రవ్యోల్బణాన్ని రగిలిస్తే భారత రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచక తప్పదా లేదా ఇది దేశ జీడీపీ వృద్ధికి ప్రతిబంధకంగా మారుతుందా అనే చర్చ తీవ్రమవుతోంది. ప్రముఖ ప్రపంచ మనీ మేనేజర్ కేన్ ఫిషర్ ఈ విశ్లేషణను ఒక సునిశితమైన దృష్టికోణంతో మన ముందుకు తెచ్చింది.. చమురు ధరల షాక్ అనేది ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి సవాళ్లను విసురుతుందో.. అదే సమయంలో భారత్ తన వద్ద ఉన్న ప్రత్యామ్నాయ శక్తులతో వీటిని అధిగమించి ఎలా ముందుకు సాగగలదో ఆయన తన నివేదికలో ఆవిష్కరించారు.
క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు దాని ప్రభావం కేవలం పెట్రోల్, డీజిల్ బంకుల వద్దే ఆగిపోదు. భారత్ విదేశీ మారకద్రవ్యాన్ని ఎక్కువగా చెల్లించాల్సి రావడం వల్ల కరెంట్ అకౌంట్ లోటు పెరిగి డాలర్‌కు డిమాండ్ పెరగడం ద్వారా రూపాయి బలహీనపడుతుంది. అక్కడితో ఆగకుండా ఇంధన వ్యయం పెరగడం వల్ల రవాణా రంగానికి అయ్యే ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఇది నిత్యావసర వస్తువులు, పారిశ్రామిక ఉత్పత్తులు, వ్యవసాయ వ్యయాన్ని పెంచి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఈ ద్రవ్యోల్బణం దీర్ఘకాలం కొనసాగితే దానిని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ కఠినమైన చర్యలు చేపట్టి వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుంది. ఫలితంగా గృహ, వాహన, వ్యాపార రుణాలు ప్రియమై ప్రజల వినియోగ సామర్థ్యం తగ్గడమే కాకుండా కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టడానికి వెనుకడుగు వేస్తాయి. ఇవన్నీ కలిసి చివరకు దేశ జీడీపీ వృద్ధి రేటును మందగించేలా చేస్తాయి.
అయితే చమురు ధర పెరిగినంత మాత్రాన వెంటనే జీడీపీ పడిపోతుందనే అత్యవసర ముగింపునకు రావడం సరైనది కాదని కేన్ ఫిషర్ స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి తీవ్రమైన ఆర్థిక ఒడుదొడుకులనైనా తట్టుకుని నిలబడే బహుముఖ సత్తా నేటి భారతదేశానికి ఉందనేది ప్రపంచం గుర్తించిన సత్యం. అంతర్జాతీయ అనిశ్చితులను ఎదుర్కొనేందుకు భారత వద్ద సమృద్ధిగా ఉన్న విదేశీ మారక నిల్వలు మొదటి రక్షణ కవచంగా నిలుస్తాయి. అంతేకాకుండా ఏ బాహ్య వ్యవస్థపైనా పూర్తిగా ఆధారపడకుండా తన సొంత వినియోగ శక్తితో పురోగమించగల భారీ దేశీయ మార్కెట్ భారత్‌కు అతిపెద్ద కొండంత అండ. వివిధ దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తూ దిగుమతి మార్గాలను వైవిధ్యపరచడం.. సోలార్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ హరిత ఇంధనాల వైపు వేగంగా అడుగులు వేయడం దీర్ఘకాలిక భద్రతను ఇస్తున్నాయి.
ప్రపంచ ఆర్థిక సమీకరణాల్లో చమురు ధరల పెంపు అనేది ఒక తాత్కాలిక సవాలు మాత్రమే. దృఢమైన ఆర్థిక విధానాలు, పరిస్థితులకు తగ్గట్లు శీఘ్రంగా స్పందించగల రిజర్వ్ బ్యాంక్ వ్యూహాలు, విశాలమైన దేశీయ మార్కెట్ బలం కలసి భారత్‌ను ఎప్పటికప్పుడు సురక్షిత తీరాలకు చేరుస్తున్నాయి. ప్రశాంత సమయంలో కంటే సవాళ్లు ఎదురైనప్పుడే ఒక దేశపు అసలైన ఆర్థిక శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ఆ కోణంలో చూస్తే, ఎలాంటి ఇంధన సంక్షోభాన్ని అయినా సమర్థవంతంగా తట్టుకుంటూ తన ప్రగతి రథాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించే సత్తా భారత్‌కు ఉందని ఈ విశ్లేషణ చాటిచెబుతోంది.
