క్రాస్ ఫైర్.. జార్ఖండ్ లో కాంగ్రెస్, కర్ణాటకలో బీజేపీకి మిత్రుల ఝలక్!
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులు, తిరుగుబాట్లు జోరుగా సాగుతున్న ఈ సమయంలో కర్ణాటక శాసనమండలి, జార్ఖండ్ లో రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం రేపుతోంది.
By: Tupaki Political Desk | 19 Jun 2026 9:00 PM ISTజాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులు, తిరుగుబాట్లు జోరుగా సాగుతున్న ఈ సమయంలో కర్ణాటక శాసనమండలి, జార్ఖండ్ లో రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం రేపుతోంది. రెండు చోట్ల జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరఫున అభ్యర్థులు పోటీలో నిలవగా, ఒక చోట బీజేపీకి మరోచోట కాంగ్రెస్ పార్టీకి క్రాస్ ఓటింగ్ తో షాక్ తగిలింది. జార్ఖండ్ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ అనూహ్య విజయం సాధించారు. ఇక్కడ అధికార కూటమికి చెందిన కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారని చెబుతున్నారు. అదే సమయంలో కర్ణాటకలో శాసనమండలి సభ్యుల ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ పార్టీ రికార్డు విజయం సాధించింది. బీజేపీ, జేడీఎస్ కూటమికి ఇక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. దీంతో కర్ణాటక శాసనమండలిలో బీజేపీ కూటమికి దక్కాల్సిన స్థానాలను కూడా అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెబుతున్నారు.
జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికలలో బీజేపీ అద్భుతమైన రాజకీయ చతురతను ప్రదర్శించిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ, తన మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీని బరిలోకి దింపి విజయం సాధించడమే కాకుండా, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను ఓడించడంలో సఫలీకృతమైంది. 'ఇండియా' కూటమికి అవసరమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, ఆ కూటమిలోని ఆర్జేడీ, సీపీఐ (ఎంఎల్) ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచిందని అంటున్నారు. సొంత కూటమిలో సమన్వయం లేకపోవడం, గతంలో బీహార్ రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన పరిణామాలకు ప్రతీకారంగా ఈ క్రాస్ ఓటింగ్ జరిగిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా జార్ఖండ్ గడ్డపై కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ఫలించక చేతులెత్తేసిన పరిస్థితి నెలకొందని అంటున్నారు.
అటు కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికలలో పూర్తి భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. ఏకంగా 151 ఓట్లను సాధించి, తన 5వ అభ్యర్థిని కూడా గెలిపించుకుంది. బీజేపీ, జేడీ(ఎస్) కూటమి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో, బీజేపీ తన కోటాలోని ఓట్లను కూడా కాపాడుకోలేకపోయిందని చెబుతున్నారు. బీజేపీకి బలం ఉన్నప్పటికీ క్రమశిక్షణారాహిత్యం, అంతర్గత అసంతృప్తి కారణంగా ఎదురుదెబ్బ తినాల్సివచ్చిందని అంటున్నారు. కాగా, ఐదుగురు ఎమ్మెల్సీలను గెలిపించుకున్న కాంగ్రెస్ కర్ణాటక ఎగువ సభలో తిరుగులేని మెజారిటీ సాధించింది.
ఈ రెండు ఘటనలు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రమైన జార్ఖండ్‌లో బీజేపీ ప్రతిపక్ష కూటమిలోని చీలికలను తనకు అనుకూలంగా మార్చుకోగలిగిందని, దీనిద్వారా అధికార కూటమికి గట్టి హెచ్చరికలు పంపిందని అంటున్నారు. అదే సమయంలో, కర్ణాటకలో బీజేపీ నాయకత్వం తమ సొంత ఎమ్మెల్యేలపై పట్టు సాధించడంలో విఫలమై, కాంగ్రెస్ చేతిలో భారీ అవమానాన్ని ఎదుర్కొనాల్సి వచ్చిందని అంటున్నారు. ఈ పరిణామంతో దక్షిణాదిలో బలపడాలనే బీజేపీ ఆకాంక్షలకు తీరని నష్టంచేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక చోట కూటమిలోని మిత్రపక్షాల వల్ల ఎదురుదెబ్బ తగిలితే, మరోచోట తన చతురతతో ప్రత్యర్థుల ఓట్లను దండుకుందని చెబుతున్నారు. ఇది ఒక విధంగా దక్షిణాదిలో ఆ పార్టీకి పెరుగుతున్న పట్టుకు నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా, పార్టీ అధిష్టానాల ఆదేశాలను సైతం లెక్కచేయని ఈ 'క్రాస్ ఓటింగ్' సంస్కృతి రెండు జాతీయ పార్టీలకు గట్టి హెచ్చరికలు పంపాయని అంటున్నారు.
