అజహర్ మాత్రమే కాదు.. వీరు కూడా మినిస్టర్ క్రికెటర్లే..!
అజహర్ కంటే ముందే చాలామంది క్రికెటర్లు పలు రాష్ట్రాలలో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు.
By: Tupaki Political Desk | 31 Oct 2025 9:33 AM ISTభారత దేశంలో మూడు రంగాలలో రాణించినవారు ఫేమస్ అవుతారు. అవి రాజకీయాలు, సినిమా, క్రికెట్ లేదా ఏదైనా క్రీడలు. ఇందులో సినిమా, క్రీడా రంగంవారు తదుపరి జర్నీ రాజకీయాలు అయిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. తాజాగా హైదరాబాదీ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కానున్నారు. అజహర్ కంటే ముందే చాలామంది క్రికెటర్లు పలు రాష్ట్రాలలో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓ జాతీయ క్రికెటర్, దేశానికి కెప్టెన్ గా చేసిన వ్యక్తి మంత్రి కావడం బహుశా ఇదే మొదటిసారి. 2009లోనే అజహర్ యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ నుంచి ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ తరఫున హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బరిలో దిగి పరాజయం పాలయ్యారు. ఇప్పుడు అదే జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక రావడం అజహర్ కు కలిసొచ్చిందని చెప్పాలి.
సమకాలికుడు సిద్ధు
టీమ్ ఇండియాలో అజహర్ కు సమకాలికుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ. సిక్సర్ల సిద్ధూగా 1980ల్లో పేరుగాంచిన ఈయన పంజాబ్ ప్రభుత్వంలో 2017-19 మధ్య పర్యటక శాఖ మంత్రిగా పనిచేశారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యుడిగా కూడా వ్యవహరించారు.
ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడు
టీమ్ ఇండియా 1983లో ప్రపంచ కప్ నెగ్గిన జట్టులో సభ్యుడు కీర్తి ఆజాద్. అయితే, ఈయన ఎంపీగా పలుసార్లు ఎన్నికయి కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. 2014లో బిహార్ లోని దర్భంగా నుంచి ఎంపీగా గెలిచారు. నిరుడు జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీలో చేరి వర్ధమాన్-దుర్గాపూర్ నుంచి నెగ్గారు.
బెంగాలీ తివారీ...
ప్రతిభావంతుడే అయినప్పటికీ టీమ్ ఇండియాలో రెగ్యులర్ సభ్యుడు కాలేకపోయాడు మనోజ్ తివారీ. పశ్చిమ బెంగాల్ జట్టు తరఫున భారీగా పరుగులు చేసిన తివారీ.. అటు టీఎంసీ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూనే ఇటు బెంగాల్ జట్టు సారథ్యం కూడా నిర్వర్తించారు. 2021లో ఎమ్మెల్యే అయిన తివారీ.. ఇప్పటికీ మంత్రిగానే ఉన్నారు.
చేతన్ చౌహాన్..
టీమ్ ఇండియా తరఫున 40 టెస్టులు ఆడి.. ఒక్క సెంచరీ కూడా చేయకున్నా మంచి బ్యాటర్ గా గుర్తింపు పొందారు చేతన్ చౌహాన్. దిగ్గజ బ్యాటర్ సునీల్ గావస్కర్ తో 1970, 80ల్లో ఎన్నో మ్యాచ్ లలో ఓపెనింగ్ కు దిగిన చేతన్ చౌహాన్ యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో కరోనాతో చనిపోయారు. వీరు కాక.. పలువురు క్రికెటర్ల చట్ట సభలకు ఎంపికైనా మంత్రి పదవులు మాత్రం చేపట్టలేదు.
