Begin typing your search above and press return to search.

ఇలా చేస్తే సిబిల్ స్కోర్ ఇట్టే పెరుగుతోంది

మీ దగ్గర ఆస్తులు ఎన్నైనా ఉండొచ్చు. కానీ.. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే.. ఎంత సంపద ఉండి కూడా ఫలితం లేనట్లే. సిబిల్ స్కోర్.. ఆర్థిక క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది.

By:  Garuda Media   |   31 July 2025 9:55 AM IST
ఇలా చేస్తే సిబిల్ స్కోర్ ఇట్టే పెరుగుతోంది
X

మీ దగ్గర ఆస్తులు ఎన్నైనా ఉండొచ్చు. కానీ.. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే.. ఎంత సంపద ఉండి కూడా ఫలితం లేనట్లే. సిబిల్ స్కోర్.. ఆర్థిక క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది. ఏదైనా కొత్త రుణం తీసుకోవాలని డిసైడ్ అయితే.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చూసేవి సదరు వ్యక్తి క్రెడిట్ స్కోర్ ఎలా ఉందన్నది. క్రెడిట్ స్కోర్ బాగుంటే.. తేలిగ్గా అప్పు దొరకటమే కాదు.. వడ్డీలోనూ రాయితీ లభించే వీలుంది.

క్రెడిట్ స్కోర్ ను 300-900 వద్ద లెక్కేయటం తెలిసందే. 800 మించి క్రెడిట్ స్కోర్ ఉంటే అది మంచి స్కోర్ గా పరిగణలోకి తీసుకుంటారు. 670-739 వరకు స్కోర్ ఉన్నా ఫర్లేదు. కానీ.. 600 కంటే తక్కువ ఉంటే మాత్రం ఏ రుణ సంస్థ కూడా సదరు వ్యక్తిని పట్టించుకోవు. అతనికి ఎలాంటి రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు రావు. బ్యాంకులు అప్పు ఇవ్వాలంటే ఇంత కీలకంగా ఉండే ఈ స్కోర్ ను ఎవరిస్తారు? ఈ స్కోర్ ను మెరుగుపర్చుకోవటానికి ఏమేం చేయాలి? ఎలాంటి తప్పులు చేయకూడదన్న విషయంలోకి వెళితే కీలక అంశాలు కనిపిస్తాయి.

మన దేశంలో క్రెడిట్ స్కోర్ ను లెక్క కట్టే సంస్థలు నాలుగు ఉన్నాయి. అత్యధికులు సిబిల్ స్కోర్ ను ప్రామాణికంగా తీసుకుంటారు. అత్యంత పాపులర్ అయిన ట్రాన్స్ యూనియన్ సిబిల్ తో పాటు ఈక్విఫాక్స్.. ఎక్స్ పీరియన్.. క్రిఫ్ హమార్క్ సంస్థలు రుణగ్రహీతల చెల్లింపు తీరును లెక్కేస్తూ ఉంటాయి.

క్రెడిట్ స్కోర్ ను దెబ్బేసే అంశాల్లో కీలకమైనవి చూస్తే..

- రుణ వాయిదాలు (ఈఎంఐలు)

- ఈఎంఐలను సకాలంలో చెల్లించకపోవటం

- రుణాలు.. క్రెడిట్ కార్డులపై మినిమం బ్యాలెన్సు చెల్లిస్తూ ఉండటం

- క్రెడిట్ కార్డులో ఉన్న గరిష్ఠ మొత్తాన్ని కాకుండా కార్డు లిమిట్ లో కేవలం 30-40 శాతానికి మించి వాడేయటం లాంటి అంశాలు క్రెడిట్ స్కోర్ ను దెబ్బేస్తుంటాయి. మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు పరిమితిలో కేవలం 30 - 40 శాతం లోపే వినియోగించటం ద్వారా మీరు బాధ్యతాయుతంగా ఖర్చు చేసే వ్యక్తిగా రుణదాతలు భావిస్తారు. అదే సమయంలో మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి 70-80 శాతం ఉంటే.. క్రెడిట్ స్కోర్ తగ్గిపోవచ్చన్న విషయాన్ని మర్చిపోవద్దు

అంతేకాదు.. తక్కువ లిమిట్ ఉన్న కార్డుల్ని వీలైనంత వరకు వాడకుండా ఉండటం మంచిది. లిమిట్ ఎక్కువగా ఉన్న కార్డులో కాస్త ఎక్కువ ఖర్చు చేసినా.. నిష్ఫత్తిలో ఇబ్బందులు ఉండవు. కొందరు క్రెడిట్ కార్డు బిల్లులతో పాటు.. రుణాల మీద తీసుకున్న ఈఎంఐలను తూచా తప్పకుండా చెల్లిస్తూ ఉంటారు. ఒక్కసారి కూడా ఆ విషయంలో ఎలాంటి తప్పులు చేయరు. కానీ.. వారి క్రెడిట్ స్కోర్ ఆశించినంత బాగుండదు.దీనికి కారణం ఏమిటో తెలిస్తే..అవాక్కు అవుతారు.

క్రెడిట్ కార్డు మీద కొనుగోళ్లు చేసినప్పుడు.. ఆ మొత్తాన్ని జీరో వడ్డీతో ఈఎంఐలుగా మార్చుకోవచ్చని పలు సంస్థలు ఊరిస్తూ ఉంటాయి. కొన్ని సంస్థలు అయితే ఈఎంఐలతో కొనుగోలు చేస్తే.. ఆయా ఉత్పత్తులపై అధిక రాయితీ ఇస్తామని ఆఫర్ ప్రకటిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటి ఆకర్షణలకు లోనైతే క్రెడిట్ స్కోర్ కు ఎఫెక్టు పడుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే.. ఈఎంఐలు తీసుకోవటాన్ని మీ ఆర్థిక సామర్థ్యం మీద సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తుంటాయి.ఈ కారణంగానే క్రెడిట్ స్కోర్ ప్రభావితమవుతుంది. ఈ విషయం చాలామందికి తెలీదు. ఉత్పత్తుల్ని అమ్ముకునే సంస్థలు కూడా ఈ విషయాల్ని చెప్పవు.

సులువుగా తీర్చేయొచ్చన్న ఉద్దేశంతో వాయిదాల పద్దతిని ఫాలో కావటం ఎంత తప్పో.. కొందరు క్రెడిట్ కార్డు బాకీ తీర్చేందుకు మరో రుణాన్ని తీసుకోవటం.. ఒక అప్పును మరో అప్పుతో బదిలీ చేయటం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి వాటి వల్ల తాత్కలిక ఉపశమనం కలగొచ్చు.కానీ.. క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. అంతేకాదు.. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు కొత్త క్రెడిట్ కార్డులకు అప్లై చేయొద్దు. తక్కువ వ్యవధిలో క్రెడిట్ కార్డు దరఖాస్తులు చేయటం కూడా క్రెడిట్ స్కోర్ మీద ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే.. అదే పనిగా క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయటాన్ని రుణదాతలు మీరు డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నట్లుగా భావిస్తారు.

కొందరు క్రెడిట్ స్కోర్ ఎంత ఉందన్న విషయాన్ని తెలుసుకోవటానికి ప్రతి నెలా చెక్ చేస్తుంటారు. ఇది కూడా క్రెడిట్ స్కోర్ కు నెగిటివ్ గా మారుతుంది. ఆర్నెల్లకు ఒకసారి తనిఖీ చేసుకోవటం..ఏమైనా సమస్యలు ఉంటే ఆయా క్రెడిట్ బ్యూరోలకు నివేదిస్తూ..మార్పులు చేస్తారు. వారి నుంచి ఏదైనా పొరపాట్లు జరిగితే సరిచేసుకుంటారు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు పెంచుకోవటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? అంటే ఉన్నాయనే చెప్పాలి. హామీతో కూడిన రుణాలు తీసుకోవటం. అదేనండి.. బంగారం మీద రుణం.. ఫిక్సెడ్ డిపాజిట్ హామీతో క్రెడిట్ కార్డులు లాంటివి తీసుకుంటే.. క్రెడిట్ స్కోర్ మరింత మెరుగయ్యే వీలుంది. సో.. క్రెడిట్ స్కోర్ పెరిగేందుకు.. తగ్గేందుకు చాలానే అంశాలు కారణమవుతాయన్న అవగాహన ప్రతి ఒక్కరికి ముఖ్యం.