Begin typing your search above and press return to search.

బీజేపీ దాసుడు జగన్

ఉప రాష్ట్రపతి ఎన్నిక కాదు కానీ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి.

By:  Satya P   |   22 Aug 2025 10:45 PM IST
బీజేపీ దాసుడు జగన్
X

ఉప రాష్ట్రపతి ఎన్నిక కాదు కానీ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అయితే ఇప్పటికే తన సోదరుడి మీద తీవ్ర విమర్శలు చేశారు. అక్రమ పొత్తు అన్నారు. బీజేపీతో అంటకాగుతున్నారు అన్నారు. ఇపుడు ఇదే తరహా విమర్శలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా చేశారు. ఆయన జగన్ మీద ఒకే ఒక హాట్ కామెంట్ చేశారు. జగన్ బీజేపీకి దాసుడు అని అభివర్ణించారు. వ్యంగ్యంగా సైతం కామెంట్స్ చేశారు. బీజేపీ అభ్యర్థిగా ఉంటూ ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న సీపీ రాధాకృష్ణన్ విషయంలో జగన్ తీసుకున్న ఈ స్టాండ్ అనూహ్యమైనది ఏదీ కాదని అందరికీ తెలుసు అన్నారు.

ఏనాడూ నోరెత్తలేదు :

వైసీపీ పెట్టినది లగాయితూ కేంద్రంలో బీజేపీని ఏనాడూ జగన్ పల్లెత్తు మాట అనలేదని రామకృష్ణ గుర్తు చేశారు. పైగా కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా మద్దతు ఇస్తూ వచ్చారని ఆయన దుయ్యబెట్టారు. బీజేపీ పెద్దలకు సన్నిహితంగా ఉంటూ వస్తున్న వైసీపీ కాంగ్రెస్ కి తాము వ్యతిరేక పార్టీ అని చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు కేసులు ఉండడం వల్లనే బహుశా ఈ విధంగా కేంద్రానికి దాసోహం అంటున్నారేమో అన్న అనుమానం కూడా ఆయన వ్యక్తం చేశారు.

ఏపీలో కుస్తీ ఏమిటి :

కేంద్రంలోనూ ఎన్డీయే ఉంది. ఏపీలో కూడా ఎన్డీయే ఉంది. అక్కడా ఇక్కడా డబుల్ ఇంజన్ సర్కార్ సాగుతోంది. ఈ విషయం వైసీపీ నేతలకు తెలియదా అని రామక్రిష్ణ అన్నారు. కేంద్రంలో ఎన్డీయే నిలబెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇస్తూ ఏపీలో అదే ఎన్డీయే ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పడం ఏ మేరకు సబబు అన్నారు. అసలు ఎండీయే మీద నిత్యం విమర్శలు చేస్తూ తిరిగి ఎన్నికల్లో వారికే మద్దతు ప్రకటించడాన్ని వైసీపీ ఏ విధంగా సమర్ధించుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో జగన్ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇండియా కూటమి నుంచి గట్టి అభ్యర్ధి :

ఇక తాము ఇండియా కూటమిలో ఉన్నామని ఆయన చెప్పారు. ఉప రాష్ట్రపతి పదవికి గట్టి ఆభ్యర్ధిని పోటీకి పెట్టామని చెప్పారు. ఓసీ అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నిలబెట్టడం మీద ఆయన స్పందిస్తూ బీసీ గణన జరగాలని కాంగ్రెస్ సహా అన్ని పార్టీలూ కోరుకుంటున్నాయని అదే సమయంలో ఒక కీలక ఎన్నిక వచ్చినపుడు ఓసీలను నిలబెట్టకూడదు అన్నది విధానం కాదని అన్నారు. పైగా అన్ని పార్టీల ఆమోదంతోనే ఈ ఎంపిక జరిగిందని అన్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించే శక్తులు పార్టీలు అన్నీ తమ అభ్యర్ధిని మద్దతుని ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.