Begin typing your search above and press return to search.

బీజేపీ మింగేస్తుందంటున్న ఎర్రన్న !

పురాణాలలో దృత రాష్ట్ర కౌగిలి అని చెబుతారు. ఆయనది ఇనుప కౌగిలి. అందులోకి వెళ్ళిన భీముడు అయినా నుగ్గు కావాల్సిందే.

By:  Satya P   |   6 Sept 2025 2:00 PM IST
బీజేపీ మింగేస్తుందంటున్న ఎర్రన్న !
X

పురాణాలలో దృత రాష్ట్ర కౌగిలి అని చెబుతారు. ఆయనది ఇనుప కౌగిలి. అందులోకి వెళ్ళిన భీముడు అయినా నుగ్గు కావాల్సిందే. మరి రాజకీయాల్లోనూ దృత రాష్ట్ర కౌగిలి ఉంటుంది. చిక్కిన వారు చెక్కుకుపోతారు. కొట్టుకుపోతారు. ఇంతటి బలం ఎవరికి ఉంటుంది అంటే కచ్చితంగా జాతీయ పార్టీలకే అని చెప్పాలి. అందునా అధికారంలో ఉన్న పార్టీలకు వేయింతల పవర్ ఉంటుంది. ఆ కౌగిట్లోకి వెళ్తే ఇంతే సంగతులు అని అన్నీ తెలిసిన వారు హెచ్చరిస్తూంటారు.

ప్రాంతీయ పార్టీలకే షాక్ :

ప్రాంతీయ పార్టీల ఊపిరి తక్కువ. అవి స్థానికంగా ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఏర్పాటు అవుతాయి. అవి చేసే రాజకీయం కానీ అనుభవించే అధికారం కానీ పరిమితంగా ఉంటాయి. వాటి మీద స్వారీ చేసే అవకాశం ఎపుడూ జాతీయ పార్టీలకు ఉంటుంది. కోరి మరీ జుట్టు అందిస్తే పట్టి లాగుతాయి. ఎక్కడికైనా తీసుకెళ్ళి నామ రూపాలు లేకుండా చేసిన సందర్భాలు సంఘటనలూ చరిత్ర పుటలలో పదిలంగా ఉన్నాయి. ఈ దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు చిన్న పార్టీలు అలా కొట్టుకుపోయినవే అన్నది అంతా చెబుతారు.

ఎలుక ఏనుగూ సావాసమే :

ఎలుకతో ఏనుగుకు స్నేహం ఏమిటి అని అంతా విస్తుబోవచ్చు కానీ పరిస్థితులు అవసరాలు దోస్తీ చేయిస్తాయి. అలా ఎలకా ఏనుగుల స్నేహం కూడా ప్రకృతికి వింత అనిపించినా వర్ధిల్లుతుంది. కానీ కాలం కలసిరాక ఆ స్నేహం బెడిసికొడితే అధిక నష్టం ఎలుకకే అని మెడకాయ మీద తలకాయ ఉన్న వాడు ఎవడైనా ఇట్టే చెప్పేస్తాడు. అందుకే ప్రాంతీయ పార్టీల జాతీయ పార్టీల స్నేహంలో ముల్లూ ఆకూ సామెత వాడుతారు. ఇపుడు అదే మాట అంటూ హెచ్చరిక జారీ చేస్తున్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

టీడీపీ జనసేన తస్మాత్ జాగ్రత్త :

ఏపీలో టీడీపీ కూటమిలో పెద్దన్నగా టీడీపీ ఉంది. జనసేన బీజేపీ మిత్రులుగా ఉన్నారు. అయితే ఈ మూడు పార్టీల స్నేహం మీద నారాయణ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. బీజేపీతో అంటకాగుతున్నారు కానీ మీకే ముప్పు అని చంద్రబాబుని పవన్ ని హెచ్చరించారు. బీజేపీతో కలసిన పార్టీలు ఏవీ బతికి బట్టకట్టలేదని ఆయన ఉదహరిస్తున్నారు బీజేపీతో పెట్టుకుంటే మటాష్ అని కూడా అలెర్ట్ చేస్తున్నారు. బీజేపీతో కలసి సావాసం చేస్తున్న ఈ రెండు పార్టీలు ఆ మీదట ఏమి జరిగినా తాపీగా విలపించడం తప్ప జరిగేది ఏదీ లేదని ఒక పెద్దాయనగా సలహా సూచనలతో కూడిన భవిష్యత్తు దర్శనం చేశారు.

బీఆర్ఎస్ ఉదాహరణగా :

తెలంగాణాలో బీఆర్ఎస్ సంక్షోభం ఆయన ఉదహరించారు అక్కడ రెండుగా ఆ పార్టీ చీలిపోయింది అని గుర్తు చేశారు. కవిత రూపంలో పార్టీకి పెను సవాల్ ఎదురైంది అన్నారు ఆ అనుభవాలను చూడాలని సూచించారు. నారాయణ వ్యాఖ్యలను బట్టి చూస్తే బీఆర్ఎస్ చీలిక వెనక బీజేపీ హస్తం ఉందని ఆయన అనుమానంగా చెబుతున్నారు. బీఆర్ఎస్ కనుక తెలంగాణాలో బలహీనం అయితే బీజేపీకే రాజకీయ ప్రయోజనం కాబట్టి ఆ పార్టీ హ్యాండ్ కవిత ధిక్కారం వెనక ఉండొచ్చు అని ఆయన ఊహిస్తున్నారు అని అంటున్నారు.

దేశంలో చూసినా అలా :

ఇక దేశంలో చూస్తే కనుక శివసేన రెండుగా చీలిపోయింది. ఆ పుణ్యం అంతా బీజేపీదే అన్నది వర్తమానం చెబుతున్న వాస్తవం. అంతే కాదు తమిళనాడు అన్నా డీఎంకేలో వర్గ పోరు వెనక బీజేపీ ఉందని అంటారు. తనకు అవసరం అయినపుడు అన్నీ కుదిరినపుడు ప్రాంతీయ పార్టీలలో చీలికను బీజేపీ తెస్తుంది అని చెప్పడానికి అనేక ఉదాహరణలు పేర్కొంటారు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు జ్యోతిరాదిత్య సిధియాని వేరు చేసి మధ్యప్రదేశ్ లో చీలిక తెచ్చారు. అలాగే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో చీలిక తెచ్చారు రాజస్థాన్ లో సచిన్ పైలెట్ ని లాగేందుకు చూశారు అని అప్పట్లో ప్రచారం ఉంది. బహుశా ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే సీపీఐ నారాయణ టీడీపీ జనసేనలను హెచ్చరిస్తున్నారు.

సాధ్యమేనా :

అయితే ఏపీలో టీడీపీ చంద్రబాబు లోకేష్ ల మీదనే ఆధారపడి ఉన్న పాటీ క్యాడర్ బేస్డ్ పార్టీ. నాయకులు అయితే పోవచ్చేమే కానీ క్యాడర్ జై టీడీపీ అంటుంది ఇక జనసేన తీసుకుంటే పూర్తిగా పవన్ ఇమేజ్ మీద గ్లామర్ మీద నడిచే పార్టీ. అందువల్ల బీజేపీ వ్యూహాలు నాయకులు ఫిరాయించేందుకు ఉపయోగపడతాయేమో కానీ పార్టీలను లేకుండా చేయలేవని అంటున్నారు.