ఏపీ-సీపీఐలో పెనుమార్పు.. రామకృష్ణకు ప్రమోషన్
ఈ స్థానంలో రామకృష్ణకు అవకాశం కల్పిస్తూ.. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
By: Garuda Media | 22 Oct 2025 2:00 AM ISTఏపీ-కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణకు పార్టీ జాతీయ కార్యవర్గం ప్రమోషన్ ఇచ్చింది. ఆయనను జాతీయ కార్యదర్శిగా నియమించింది. దీంతో రాష్ట్ర రాజకీయాల నుంచి ఆయన జాతీయ స్థాయికి చేరుకున్నారు. గతంలో నారాయణ జాతీయ కార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. 75 ఏళ్ల వయో పరిమితి చేరుకోవడంతో నారాయణ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు.
ఈ స్థానంలో రామకృష్ణకు అవకాశం కల్పిస్తూ.. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఛండీగఢ్‌లో తాజాగా ముగిసిన జాతీయ సమావేశాల అనంతరం.. రామకృష్ణను జాతీయ కార్యదర్శిగా ఎంపిక చేయడం గమనార్హం. ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రామకృష్ణ స్థానంలో కడప జిల్లాకు చెందిన గుజ్జల ఈశ్వరయ్యకు పార్టీ అవకాశం కల్పించింది. నిజానికి గత నెలలోనే ఈయన నియామకం జరిగి ఉండాలి.
కానీ, అప్పట్లో ముగ్గురు నాయకులు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్టుకు పోటీలో నిలిచారు. అంతేకాదు .. ఈ వ్యవహారం అప్పటి రాష్ట్రస్థాయి సమావేశాల్లో తీవ్ర వివాదానికి కూడా దారితీసింది. ఈ నేపథ్యంలో అప్పట్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపికను వాయిదా వేశారు. అనంతరం.. రామకృష్ణే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. తాజాగా మిగిలిన ఇద్దరినీ పక్కన పెట్టి.. తాజాగా ఈశ్వరయ్యకు అవకాశం కల్పించారు. ఇదిలావుంటే.. గత ఎన్నికల్లో ఈశ్వరయ్య కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. డిపాజిట్ కోల్పోయారు.
వ్యవసాయ రంగానికి చెందిన ఈశ్వరయ్య బీఎల్, ఎంఏ వరకు చదువుకున్నారు. ఆయన సతీమణి.. ఓ ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఇదిలావుంటే.. రాష్ట్ర కార్యదర్శి పోస్టులో పోటీ పడిన ఇద్దరు నాయకుల వ్యవహారం ఇప్పుడు చర్చకు దారితీసింది. సుదీర్ఘకాలంగా పార్టీలో సేవలందించిన ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రధాన పోటీ దారుగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఆయన సీపీఐ నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
