Begin typing your search above and press return to search.

శ‌త వ‌సంతాల క‌మ్యూనిజం.. సీపీఐ వందోవేడుక‌.. !

క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)కు నేటితో వంద సంవ‌త్స‌రాలు పూర్తి కానున్నాయి. 1925, డిసెంబరులో ఏర్ప‌డిన భార‌త క‌మ్యూనిస్టు పార్టీకి ఘ‌న చ‌రిత్ర ఉంది.

By:  Garuda Media   |   22 Dec 2025 9:20 AM IST
శ‌త వ‌సంతాల క‌మ్యూనిజం.. సీపీఐ వందోవేడుక‌.. !
X

క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)కు నేటితో వంద సంవ‌త్స‌రాలు పూర్తి కానున్నాయి. 1925, డిసెంబరులో ఏర్ప‌డిన భార‌త క‌మ్యూనిస్టు పార్టీకి ఘ‌న చ‌రిత్ర ఉంది. దేశ‌వ్యాప్తంగా కార్మికులు, క‌ర్ష‌కుల ఉద్య‌మా లకు పెట్టింది పేరుగా ఈ పార్టి ప్రాభవం ద‌క్కించుకుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ గురించి చాలా మంది చ‌ర్చిస్తారు. కానీ, కాంగ్రెస్ కంటే కూడా ముందుగానే గ్రామాల్లో ప‌రిఢ‌విల్లిన పార్టీ సీపీఐ అంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఏ గ్రామానికి వెళ్లినా.. నాలుగు రోడ్ల కూడ‌లిలో ఎర్ర జెండా ఎగ‌రేసే దిమ్మెలు ద‌ర్శ‌న‌మిస్తాయి.

క‌నీసంలో క‌నీసం ప‌ది మంది అయినా.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గ్రామాల్లో క‌నిపిస్తారు. అలా ఒక‌ప్పుడు ప్రాభ‌వాన్ని సంత‌రించుకున్న పార్టీ కేర‌ళ స‌హా.. అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి కూడా వ‌చ్చింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్టీఆర్‌తో క‌లిసి.. అధికారం కూడా పంచుకుంది. ప్ర‌స్తుతం తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌కు మ‌ద్దతు దారుగా కూడా సీపీఐ ఉండ‌డం విశేషం. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా సిద్ధాంతాల‌ను కొంత మేర‌కు మార్చుకుంటూ.. ముందుకు సాగుతున్నా.. సీపీఐ ప్ర‌భావం మాత్రం త‌గ్గుతూ వ‌స్తోంది.

దేశంలో చెప్పుకోద‌గ్గ నాయ‌క‌త్వం ఇప్పుడు సీపీఐకి లేద‌న్న వాద‌న ఉంది. ప్ర‌స్తుతం కేర‌ళ‌కు చెందిన డి. రాజా సీపీఐ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఒక‌ప్పుడు కులాలు, మ‌తాల‌కు భిన్నంగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పెద్ద‌పీట వేసిన సీపీఐ.. రాను రాను.. కుల జాడ్యంలో కూరుకుపోతోంద‌న్న వాద‌న ఉంది. ఏపీలో సీపీఐ చీఫ్‌గా ఈశ్వ‌ర్య ఎంపిక వెనుక ఇదే జ‌రిగింద‌న్న చ‌ర్చ వినిపిస్తోంది. ఇక‌, ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీల‌తో అంట‌కాగుతున్నార‌న్న వాద‌న‌కు కూడా సీపీఐ భిన్న‌మేమీ కాక‌పోవ‌డం మ‌రో చిత్రం.

సీపీఎంతో పోల్చుకుంటే.. సీపీఐ సిద్ధాంతాలు భిన్నంగా ఉంటాయి. ఇదేస‌మ‌యంలో సీపీఐ కేడ‌ర్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. కానీ.. మేలైన ప‌రిణామాలు.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే విధానాల రూప‌క‌ల్ప‌న‌లో పార్టీ వెనుక‌బ‌డుతోందన్న‌ది వాస్త‌వం. అందుకే.. ఇత‌ర రాష్ట్రాల్లో ప్రాభ‌వం త‌గ్గుతూ వ‌స్తోంది. ఇప్ప‌టికే సీపీఎం దాదాపు నానాటికీ తీసిక‌ట్టుగా మారింది. ఇప్పుడు కొంత మేర‌కు ఫ‌ర్వాలేద‌న్న రేంజ్‌లో సీపీఐ ఉన్న‌ప్ప‌టికీ .. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే విధానాల దిశగా అడుగులు వేస్తేనే.. పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఒక‌ప్పుడు.. సీపీఐని న‌డిపించిన‌ శ్రీపాద అమృత్ డాంగే, ఈఎంఎస్ నంబూద్రిపాద్‌, సుర‌వరం సుధాక‌ర్ రెడ్డి వంటి వారు సామాన్యుల‌కు చేరువ అయ్యారు. పార్టీని బ‌లోపేతం చేశారు. ఈ దిశ‌గా నేడు న‌డిపిస్తేనే త‌ప్ప‌.. క‌మ్యూనిజానికి ప‌ట్టుకొమ్మ కాలేని ప‌రిస్థితిలో ఉన్న సీపీఐ పుంజుకునే అవ‌కాశం లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.