Begin typing your search above and press return to search.

ఉప‌రాష్ట్ర‌ప‌తి పోస్టుకు ఫ‌స్ట్ నామినేష‌న్‌.. మోడీ తొలిసంత‌కం!

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ బుధ‌వారం నామినేష‌న్ దాఖలు చేశారు.

By:  Garuda Media   |   20 Aug 2025 3:37 PM IST
ఉప‌రాష్ట్ర‌ప‌తి పోస్టుకు ఫ‌స్ట్ నామినేష‌న్‌.. మోడీ తొలిసంత‌కం!
X

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ బుధ‌వారం నామినేష‌న్ దాఖలు చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిరెన్ రిజుజు, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర‌హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాష్ న‌డ్డా త‌దిత‌రులు ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణ‌న్‌తో క‌లిసి రాజ్య‌స‌భ స‌చివాల‌యానికి వెళ్లి, రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ప్ర‌మోద్ చంద్ర మోడీకి 20 సెట్ల నామినేష‌న్ ప‌త్రాల‌ను అందించారు.

ఆయా ప‌త్రాల‌పై సీపీ రాధాకృష్ణ‌న్‌ను బ‌ల‌ప‌రుస్తూ ప్ర‌ధాని మోడీ తొలి సంత‌కం చేశారు. ఇత‌ర ఎన్డీయే ప‌క్షాల నేత‌లు కూడా ఆయ‌న‌ను బ‌ల‌ప‌ర‌స్తూ సంత‌కాలు చేశారు. అనంతరం, ఆయా ప‌త్రాల‌ను ప‌రిశీలించిన రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ప్ర‌మోద్ చంద్ర మోడీ.. సీపీ రాధాకృష్ణ‌న్‌తో సంతాలు చేయించుకుని వాటిని స్వీక‌రించారు. కాగా, ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణ‌న్‌ను ప్ర‌ధాని మ‌రోసారి అభినందించారు. విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.

మ‌రోవైపు, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నామినేష‌న్ ప్ర‌క్రియ రేప‌టితో ముగియ‌నుంది. సెప్టెంబ‌రు 9న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీనిలో పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల స‌భ్యులతో పాటు నామినేట్ అయిన వారు కూడా ఓటు వేయ‌నున్నారు. ర‌హ‌స్య బ్యాలెట్ విధానంలో ఈ పోలింగ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున త‌మిళ‌నాడుకు చెందిన చంద్ర‌పురం పొన్నుసామి రాధాకృష్ణ‌న్‌, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూట‌మి త‌ర‌ఫున తెలంగాణ‌కు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డి ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థులుగా నామినేట్ అయ్యారు.

ఇదిలావుంటే, 2022, సెప్టెంబ‌రు నుంచి భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ అనారోగ్య కార‌ణాల‌తో త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఆ వెంట‌నే కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొత్త ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ ప్ర‌క్రియ‌ను ముందుకు తీసుకువెళ్లేలా రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక బృందాన్ని నియ‌మించింది. మ‌రోవైపు.. తెలుగు వారైన సుద‌ర్శ‌న్ రెడ్డికి మ‌ద్ద‌తు ఇవ్వాలంటూ... కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ముఖ్య నాయ‌కులు తెలుగు ఎంపీల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. పార్ల‌మెంటు వ‌ద్ద కూడా.. ఇదే అభ్య‌ర్థ‌న‌ల‌తో తెలుగు ఎంపీల‌ను కాంగ్రెస్ నాయ‌కులు క‌లుసుకున్నారు.