Begin typing your search above and press return to search.

రుణం తక్కువ, వసూళ్లు ఎక్కువ కోర్టు తలుపు తట్టిన విజయ్‌ మాల్యా

భారత ఆర్థిక చరిత్రలో ‘కింగ్‌ ఆఫ్‌ గుడ్ టైమ్స్‌’ అనే పేరు ఒకప్పుడు ఎక్కువగా వినిపించేది.

By:  Tupaki Political Desk   |   5 Nov 2025 2:00 PM IST
రుణం తక్కువ, వసూళ్లు ఎక్కువ కోర్టు తలుపు తట్టిన విజయ్‌ మాల్యా
X

భారత ఆర్థిక చరిత్రలో ‘కింగ్‌ ఆఫ్‌ గుడ్ టైమ్స్‌’ అనే పేరు ఒకప్పుడు ఎక్కువగా వినిపించేది. కానీ అదే పేరు ఇప్పుడు ఆర్థిక ద్రోహి, వసూల్ రాజా వంటి పేర్లతో వినిపిస్తుంది. ఈ రెండు బిరుదులు ‘విజయ్ మాల్యా’ సొంతం. ఆర్థిక నేరగాడుగా చెప్పుకుంటున్న విజయ్ మాల్యా వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో తలదాచుకున్న పారిశ్రామికవేత్త ఆయన తనపై బ్యాంకులు అవసరానికి మించి వసూలు చేశాయి అంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

ఇచ్చిన దాని కంటే ఎక్కువ వసూలు చేశారు..

మాల్యా తన పిటిషన్‌లో తనకు బ్యాంకులు ఇచ్చిన రుణం, వడ్డీ మొత్తం కంటే కూడా ఎక్కువ మొత్తాన్ని వసూలు చేశాయన్నారు. ఇప్పటికే వసూలు చేసిన డబ్బుపై మళ్లీ వడ్డి విధిస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది చట్టపరంగా అన్యాయం అని పేర్కొంటూ.. బ్యాంకులు తన కంపెనీ కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ బకాయిల వివరాలను స్పష్టంగా బయటపెట్టాలని హైకోర్టును కోరారు. మాల్యా తరఫు న్యాయవాది వాదనలో, ‘రుణ వసూలు ట్రైబ్యునల్‌ రూ.10 వేల కోట్లు వసూలయ్యాయని పేర్కొంది. కానీ ఆర్థిక మంత్రి లోక్‌సభలో రూ.14 వేల కోట్లు వసూలయ్యాయని చెప్పారు.

ఈ వ్యత్యాసం ఎందుకు?’ వచ్చిందని ప్రశ్నించారు.

వసూళ్లపై వడ్డీ అన్యాయం..

తాను చెల్లించిన రుణానికి బ్యాంకులు మళ్లీ వడ్డీ విధించడం చట్టపరంగా తప్పు అని మాల్యా వాధిస్తున్నాడు. ఇలా చేస్తే అది రెండు సార్లు వసూలు చేసినట్లే అవుతుందని న్యాయవాది వాదించారు. కర్ణాటక హైకోర్టు జస్టిస్‌ కన్నెగంటి లలిత నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసి విచారణను వాయిదా వేసింది.

‘కింగ్ ఫిషర్’ కథ

ఒకప్పుడు లగ్జరీకి సింబల్‌గా నిలిచిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌, మాల్య వ్యాపార సామ్రాజ్యానికి చిహ్నంగా నిలిచింది. 2012లో ఆర్థిక సంక్షోభం తలెత్తి, కంపెనీ మూతపడింది. భారీ రుణబాధలతో 17 బ్యాంకులు చుట్టుముట్టగా, మాల్యా 2016లో విదేశాలకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత మనీలాండరింగ్‌, మోసం, రుణ ఎగవేత కేసులతో ఆయనపై విచారణలు కొనసాగుతున్నాయి. యూకే కోర్టులు భారత ప్రభుత్వానికి అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నా, మాల్యా అప్పీలు చేస్తూ విచారణను వాయిదా వేస్తూనే ఉన్నాడు.

విజయ్‌ మాల్య కథలో వాస్తవం, న్యాయం, ఆర్థిక మాయాజాలం అన్నీ కలసి ఉన్నాయి. ఒకప్పుడు విజయానికి ప్రతీక అయిన వ్యక్తి.. ఇప్పుడు వసూళ్ల లెక్కల మీద వాదనలతో కోర్టు తలుపు తట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

రుణాలు ఇచ్చిన బ్యాంకులు, వాటిని వసూలు చేసే ప్రభుత్వ సంస్థలు.. ప్రజా ధనానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత వహించాలి.

మాల్యా వాదనలో కొంత నిజం ఉన్నా.. ఆయన దూరమయ్యేలా చేసిన కారణాలు కూడా ఉన్నాయి. అవి స్వయానా వ్యాపార నిర్ణయాలే. ఇప్పుడు ఆయన పిటిషన్‌ సత్యం కోసం పోరాటమా.., లేక సమయాన్ని పొడిగించాలనే వ్యూహమా..? అన్నది కోర్టు తీర్పు చెబుతుంది.